తెలుగు లిపి

తెలుగు లిపి

     తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపి లో వ్రాసిన అక్షరములు మొదట భట్టిప్రోలు లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి._
*ఆవిర్భావం*
*1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం*
   తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరాన ఉన్న భట్టిప్రోలు గ్రామమందు క్రీ.పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది. ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడా అచటకు చేరినది. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవుల నుంచి మొదలైన దేశాలకు కూడా చేరి అచటి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది. క్రీ.శ. ఐదవ శతాబ్దము నాటికి భట్టిప్రోలు లిపి పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది.
   తెలుగున నన్నయ్య కావ్యవ్యాకరణచ్చందసంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రధమాచార్యుడు. నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు. నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి. ఆ లిపి చతురస్రముగాను, తలకట్టు గీతలవలె కాక  గంటం వ్రాతకు అనుకూలంగా ఉండునట్లు ఏర్పడినది. తాటాకుపైన గంటంతో రాసేటప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా రాస్తే తాటాకు చినిగిపోతుంది. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా రాసేవారు. కార చిహ్నమగు కొమ్ము ొ ా అని గీతగానే ఉండేది. -జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము.
   నన్నయ వీటిని పరిశీలించి, తెలుగు లిపిని చతురస్ర స్వరూపమునుండి గుండ్రదనమునకు మార్పు చేసి పలు మార్పులు చేసినాడు. అవే తలకట్టు నకు ా గాక ప్రస్తుత తలకట్టు లాగా, కొమ్ముల మార్పు ప్రస్తుత వరుసగా, ర్గ సంయుక్తాక్షరములు అనునవి పంకచంక-ఖండ-నంద-డింబ-అనురీతి పూర్ణబిందువులుగా వ్రాయుట, రకార సంయుక్తాక్షరములను ర్క,ర్త,ర్చ మొదలగునవి అర్క-అర౬, కర్త-కర్౬, కర్చ-కర౬ గా వ్రాయుట మొదలుచేసినాడు. ౬ ఈ చిహ్నమునకే వలపలగిలక అని పేరు. ఈవలపలగిలక వలన రకార సంయుక్తాక్షరములుగా నుండక ఏకాక్షరములుగా ఉండును. ఇందువలన లిపికి సమత ఏర్పడినది, అంతకుముందున్న ఒక అక్షరము శకటరేఫముకన్నా భిన్నమైనది, ష్జ గా పలుకునదానిని "డ" గా మార్చినాడు. ఈ మార్పుల వలన తెలుగు లిపికి గుండ్రనిదనము, సౌందర్యము చేకూరునవి. తెలుగులిపినందు ఈమార్పులు చేయుటయేకాక నన్నయ, తాను వ్రాసిన నందంపూడి శాసనము నందు తాను ప్రతిపాదించిన సంస్కరణలిపిని ప్రవేశపెట్టి-ఆవెనుక తాను వ్రాసిన మహా భారతము ను ఆలిపిలోనే వ్రాసినాడు.తెలుగు అక్షరములకు అంతకుముందులేని రమ్యతను-లేక మనోహరత్వమును తాను ప్రతిపాదించుటచేత-నన్నయ తెలుగులిపి సౌందర్యమును వ్యక్తపరిచినాడు.అర్ధ ముక్తి శబ్ద సంబంధమైనది అక్షర రమ్యత లిపి సంబంధమైనది-రెండింటి సమ్మేళనము నన్నయ కవితలో కలదు.
    తెలుగులిపి సౌందర్యమును తరతరాలుగా వంశపారంపర్యముగా, చెక్కుచెదరక నిల్పి, సంరక్షించినవారు శిష్టుకరణ కులజులు.వీరాంధ్రదేశమున నేటి శ్రీకాకుళము లో నివసించెడి కరణలు.వీరు చిత్రగుప్తుని వమ్శీయులగుటచే తెలుగు లిపిని ఒక కళలాగా ఉపాసించినారు. వీరి తాళపత్ర లేఖన నైపుణ్యమసమానమైనది. వీరినే శిష్టలేఖకులు అందురు. పూర్వకాలమున కవికి ఎంత ప్రాధాన్యము కలదో లేఖకునకు అంతప్రాధాన్యము కలదు. మునుపు కవిత్వము చెప్పుట-లేఖకుడు వ్రాయుటేకాని-కవి తాను స్వయంగా వ్రాయు ఆచారములేదు. తిక్కన కు గురుబాధుడను లేఖకుడు ఉండినట్లు మనకు తెలియుచున్నది. తెలుగులిపి సౌందర్యమునకు ముగ్ధులై తంజావూరి మహారాష్ట్ర రాజులు-వారిలో ముఖ్యముగా శివాజీ రాజా తెలుగు లేఖకులకు తన రాజ్యాంగమున నొక ప్రత్యేక నిబంధనము చేసియున్నాడు.వందలకొద్దీ తాళపత్రాలను వీరిచే వ్రాయించినాడు.
   మౌర్యులకాలపు (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీలిపి పట్టికలోని రెండవ వరుసలో ఇవ్వబడింది. అటు పిమ్మట భట్టిప్రోలు ధాతుకరండముపై కొద్దిమార్పులుగల బ్రాహ్మీలిపి మూడవ వరుసలో చూడవచ్చును.
*తెలుగు శాసనములు*
*శాతవాహనుల శాసనములు*

శాతవాహనుల శాసనములలోని (క్రీ. శ 1వ శతాబ్ది) భట్టిప్రోలు లిపి పరిణామము 4వ వరుసలో ఇవ్వబడింది.
*ఇక్ష్వాకుల శాసనములు*
క్రీ.శ. 218 లో శాతవాహనుల సామంతులు ఇక్ష్వాకులు స్వతంత్రులైరి. వారికాలమునాటి లిపి 5వ వరుసలో గలదు.
*శాలంకాయన నందివర్మ శాసనము*
ఇక్ష్వాకుల తరువాత శాలంకాయనులు ఆంధ్ర దేశాన్ని క్రీ. శ. 300 నుండి 420 వరకు పాలించారు. శాలంకాయనుల రాజధాని వేంగి. ఆకాలమునాటి లిపి 7వ వరుసలోనున్నది. ఈ కాలములోనే తెలుగు లిపి మిగిలిన దక్షిణ భారత మరియు ఉత్తర భారత లిపులనుండి వేరుపడుట ప్రారంభమయింది. క్రీ. శ. 420-611 మధ్యకాలములో విష్ణుకుండినులు వినుకొండ రాజధానిగా పరిపాలించారు.
*విష్ణుకుండిన శాసనములు*
విష్ణుకుండినుల పరిపాలనాకాలములో భాషల వాడుకలో, వ్రాతలో పలుమార్పులు వచ్చాయి. ప్రాకృతము బదులు సంస్కృతము వాడుట ఎక్కువయ్యింది. అదేసమయములో రాయలసీమను పాలించిన రేనాటి చోళులు రాజశాసనములు తెలుగులో వ్రాయించారు. మనకు దొరికిన వారి మొదటి శాసనము క్రీ. శ. 573 నాటిది. తీరాంధ్రప్రాంతములో దొరికిన క్రీ. శ 633 నాటి శాసనము మొదటిది. అప్పటినుండి తెలుగు వాడకము బాగా ఎక్కువయింది.
*పల్లవ నరసింహవర్మ శాసనము*
శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈలిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది.
*పరిణామము*
*తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా*
    భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. వరుసలు 9, 10 మరియు 11 చాళుక్యుల కాలము (7, 10 మరియు 11వ శతాబ్దములు) నాటి లిపులను సూచిస్తునాయి. 10, 11 వరుసలలోని లిపిని వేంగీలిపి అనికూడ అంటారు. 12వ వరుసలో కాకతీయుల కాలమునాటి లిపిచూడవచ్చు. ఈ కాలములో తెలుగు భాష, సాహిత్యములు ప్రజ్వరిల్లాయి. 13, 14 వరుసలలో మహాకవి శ్రీనాథుని కాలము నాటి లిపి, చివరి వరుసలో విజయనగరకాలము నాటి తెలుగు-కన్నడ ఉమ్మడి లిపి చూడవచ్చు. అధునిక తెలుగు లిపికిది చివరి పరిణామదశ.
   బెంజమిన్ షుల్జ్ అను మతప్రచారకుని మూలముగ క్రైస్తవ సాహిత్యము జర్మనీ దేశమందు తెలుగులిపిలో ప్రచురించబడింది. బ్రౌను దొర తెలుగు పుస్తకముల ప్రచురణకు చాల కృషిచేశాడు. 20వ శతాబ్ది మధ్యలో తెలుగు గొలుసుకట్టు పద్ధతిలో (ఆంగ్లమువలె) కూడ వ్రాయబడింది. కాని అది ప్రాచుర్యము చెందలేదు.
*ప్రస్తుత లిపి*
*అచ్చులు (16)*
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ
*ప్రాణ్యక్షరములు (2)*
అం అః
*ఉభయాక్షరములు (3)*
అఁ అం అః
*హల్లులు (38)*
క ఖ గ ఘ ఙ
చ ౘ ఛ జ ౙ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
*అంకెలు (10)*
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౦
*తెలుగు హల్లుల ఉచ్చారణ పట్టిక*
ప్రయత్న నియమావళి కంఠ్యము(జిహ్వామూలము) 
తాళవ్యము(జిహ్వామధ్యము) 
మూర్ధ్యన్యము(జిహ్వాగ్రము) 
దంత్యము(జిహ్వాగ్రము)
దంతోష్ఠ్యము ఓష్ఠ్యము (అథోష్ఠము)
స్పర్శము, శ్వాసము, అల్పప్రాణము క చ ట త - ప
స్పర్శము, శ్వాసము, మహాప్రాణము ఖ ఛ ఠ థ - ఫ
స్పర్శము, నాదము, అల్పప్రాణము గ జ డ ద - బ
స్పర్శము, నాదము, మహాప్రాణము ఘ ఝ ఢ ధ - భ
స్పర్శము, నాదము, అల్పప్రాణము,
అనునాసికము, ద్రవము, అవ్యాహతము ఙ ఞ ణ న - మ
అంతస్థము, నాదము, అల్పప్రాణము, ద్రవము, అవ్యాహతము - య, ర (లుంఠితము)
ళ (పార్శ్వికము) 
ల (పార్శ్వికము)
ఱ (కంపితము) 
వ -ఊష్మము, శ్వాసము, మహాప్రాణము, అవ్యాహతము విసర్గ శ ష స - -
ఊష్మము, నాదము, మహాప్రాణము, అవ్యాహతము హ - - - - -
*తెలుగులిపి-కవుల వర్ణనలు*
    తెలుగు సాహిత్యములో తొలుత లిపి ప్రసక్తి తెచ్చినవాడు మంచెన. అతడు కేయూర బాహు చరిత్రలో కృతిపతి గుండమంత్రి ప్రతిభను తెలుగు లిపి గుండ్రత్వము సౌందర్యముతో పోల్చినాడు. అటుపై వెన్నెలకంటి సిద్దనమంత్రి, అటుపై జక్కన తెలుగు లిపిని ఆణిముత్యములతో పోల్చినారు.వాగ్దేవి లిపి స్వరూపిణి. అఖిలవర్ణమయిమగు ఆమె మూర్తిని అప్పకవి వర్ణించినాడు (అప్పకవీయము -2-393).

అ- తలకట్టు
ఆ - నుదురు
ఇ,ఈ- చెవులు
ఉ,ఊ- కన్నులు
ఋ,ౠ- చెక్కులు
ఌ ౡ- దంతములు
ఏ,ఐ - భుజములు
ఓ,ఔ- కక్షములు
అం- కంఠము
అః- స్తనములు.
 (మొత్తం 16)
క వర్గము-
చ వర్గము- చేతుల వ్రేళ్ళు (10)
ట వర్గము-
త వర్గము- పృష్ఠము (10)
ప వర్గము- ఉదరము (5)
అంతస్థలు,ఊష్మములు పాదములు (9)
మొత్తము అక్షరములు 50- సంస్కృత వర్ణ సమామ్నాయము 50 అక్షరములు. సరస్వతి లిపి స్వరూపి. ఒకచేత ఆమెకు పుస్తకము కలదు. లిపి స్వరూపము పుస్తకము. అదియే సరస్వతీ స్వరూపము. అందువల్ల మనము విజయ దశమినాడు పుస్తకమునకు పూజింతుము.
*గుణింతములో స్రీ వర్ణన చేసిన మహాకవి ప్రౌఢిమ చూడుడు.అకారాది గుణింతాలతో స్త్రీ వర్ణన:*
తలకట్టు - స్త్రీ నొసలు
దీర్ఘము (ా)- కనుదోయి
గుడుసు-గుండ్రము (ి) - నాభి
గుడిదీర్ఘము (ీ)- నూగారు
కొమ్ము - రెండు చేతులు
వట్రసుడి (ు)- నితంబము
ఏత్వము- జడ
ఐత్వము- తొడలు
ఓత్వము - కనుబొమలు
ఔత్వము- చెవులు
సున్న- నడుము (శూన్యము)
విసర్గ ః - స్తనములు.
వలపలగిలక ౬- భుజములు.
*సంస్కృతములో లిపి శబ్దము స్త్రీలింగము.*

Vijayachandar Kommu:

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు