స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు

                                      
శుకసప్తతి, స్వేచ్ఛాశృంగారానికి సంబంధించిన కథల సంపుటి. ఇందులో 21 పెద్ద కథలు, 9 ఉపకథలు, మొత్తం ముప్పై కథలు ఉన్నాయి. దీనిని పాలవేకరి ఖాదిరీపతి రచించాడు. ఇతను క్రీ.శ. 1660 నాటి కాలంలో జీవించాడు. నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించాడని కొందరు భావిస్తున్నారు. జయంతి పాపారావు తన “ఆరు వేల కథల ప్రస్థానం"లో ఆనాటి మైసూరు రాష్ట్రంలోని కోలార్ లో జన్మించాడని పేర్కొన్నారు.
ఖాదిరీపతి శుకసప్తతిని 17వ శతాబ్దంలోని మూడోపాద ప్రాంతంలో రచించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఖాదిరీపతిని కాలక్రమంలో కదిరీపతిగా పిలిచారు. కదిరీపతి తల్లిదండ్రులు కదరరాజు, కదురమ్మ.వాస్తవానికి శుకసప్తతి పేరుతో 12వ శతాబ్దంలోనే ఒక సంస్కృత కావ్యం
వచ్చింది. కాని కదిరీపతి ఆ శుకసప్తతిని అనువాదం చేయలేదు. తన స్వతంత్ర రచనగా తెలుగులో పద్యకావ్యంగా అదే రీతిలో రాసినాడు. ఒక రకంగా ఇది అనుకరణ కావ్యం. 
         ఇందులోని కథలన్నీ పురాణ కథలు కావు. రాజు,రాణీల ప్రేమ కథలు కావు. సామాన్యజనాలకు సంబంధించిన శృంగార సంబంధ కథలు. ఈ కథల్లో మహిళల లైంగిక స్వేచ్ఛ గురించి కదిరీపతి స్పష్టంగా చెప్పినాడు. వాస్తవ జీవితంలోని సంఘటనలనే కథలుగా రూపుదిద్దినాడు. సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య శృంగార సంబంధాలు సహజాతాలు. ఇవి జీవితం నుంచి విడదీయలేనివి. శుకసప్తతిలోని కథలు పచ్చి శృంగార కథలుగా, బూతుకథలుగా, రంకు కథలుగా కొంత మంది పరిగణిస్తారు.కానీ సౌందర్యాత్మక దృష్టితో చూస్తే జీవితంలోని శృంగార పార్శ్వం ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఫ్రాయిడ్ సిద్ధాంతం దీన్నుంచి వచ్చిందే.
           జీవితంలోసమస్యలు వచ్చినప్పుడు ప్రదర్శించాల్సిన లౌక్యం గురించి ఈ కథలు తెలియజేస్తాయి. ఈ కథలన్నీ సార్వత్రికంగా కనిపించినప్పటికీ, కాలానుగుణంగా మారిన పరిస్థితుల్లో ఆనాటి కథల్లో చెప్పినంతగా, నేడు అలాంటి పరిస్థితులు లేవు. ఇందులోని కథలన్నీ సూటిగా, వంకరటింకరలేకుండా ఉంటాయి.
శుకసప్తతిలోని కథలు నీతిని బోధించే కథలుకావు. నైతిక విలువలు పెంపొందించే కథలు కావు. స్వేచ్ఛా శృంగారం, జీవిత వాస్తవికత, జీవితాలపట్ల
ప్రేమను, అవగాహనను పెంపొందించే కథాచిత్రణ ఈ కథల్లో బాగా తొణికిసలాడుతుంది. ప్రతి కథలోనూ ఇతివృత్తం ఒక్కటే అయినా పాత్రలువేరువేరుగా ప్రవర్తిస్తుంటాయి. నిత్యజీవితంలో ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడుతుంటారు.కథల్లో రహస్యాలు, ఆ రహస్యాలు బయటపడకుండా వ్యూహం,
సమయస్ఫూర్తిగా వ్యవహరించటం, చాకచక్యం, నమ్మించే యుక్తి మొదలగునవన్నీ ఉన్నాయి.
శుకసప్తతి కథలను ఆధునిక సాహితీ సిద్ధాంతాల పరిధి (ఫ్రాయిడ్ సిద్ధాంతం)లో చర్చిస్తే మానవ సంబంధాల్లో నిబిడీకృతమైన శృంగార సంబంధాల
గురించి అవగతమవుతుంది.
           శుకసప్తతి కథలసంపుటిని (పద్యకావ్యాన్ని) సి.పి.బ్రౌన్ క్రీ.శ. 1831లో జూటూరి అప్పయ్య అనే పండితునితో తిరిగి రాయించాడు. అదిప్పుడు
మద్రాసులోని ప్రభుత్వ చేతిరాతల గ్రంథాలయంలో భద్రపరచబడిందని జయంతి పాపారావు పేర్కొన్నారు. శుకసప్తతి పద్యకావ్యంపై అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన సి.వెంకటరామిరెడ్డి సిద్ధాంత గ్రంథాన్ని పూర్తిచేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వ
విద్యాలయం ద్వారా పి. హెచ్.డి. పట్టా కూడా పొందినారు.  శుకసప్తతిలోని ముప్పై కథలలో 19 కథలను మాత్రమే వర్తమాన కథన రీతులకు
అనుగుణంగా రాసి శుకసప్తతి కథల పుస్తకంలో పొందుపరిచాను.

  __  పిళ్లా విజయ్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)