వేమన పద్యాలు

వేమన





కుండ కుంభమన్న, కొండ పర్వతమన్న
ఉప్పు లవణమన్న నొకటి గాదె!
భాష లింతె వేరు పరతత్వ మొక్కటే
విశ్వదాభిరామ వినుర వేమ.


ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు 
కాచి అతుకనేర్చు కమ్మరీడు; 
మనసు విఱిగెనేని మరి యంట నేర్చునా?
 విశ్వదాభిరామ వినురవేమ!

పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టినేని బిగియ పట్టవలయు
పట్టు విడుచుట కన్న పనిచేయుటే మేలు 
॥విశ్వ॥

అనువుగాని చోట అధికుల మనరాదు,
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
!!విశ్వ!!



ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమవీధి 
మూగ చింతల పల్లె మొదటి ఇల్లు 
ఎడ్డె రెడ్డికుల మదేమని తెల్పుదు;

చంపదగిన యట్టి శత్రువు తనచేత 
జిక్కె నేని కీడు - సేయరాదు 
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు



భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు 
దానహీను జూచి ధనము నవ్వు 
కదనభీతుజూచి కాలుండు నవ్వురా


కనక మృగము భువిని గద్దు లేదనకయె
 తరుణి విడిచి చనియె దాశరధి యు
 దెలివిలేనివాడు దేవుడెట్లాయోరా?
 విశ్వధాభిరామ! వినురవేమ!

కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమును మిగులఁగోడు గలుగుఁ
కోపమణచెనేని కోర్కెలునీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ


కానివానితోడఁ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!



అల్పబుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!


వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!



మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!


మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడ లోనచురుకు మనును
సజ్జను లగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!


తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు 
పుట్ట నేమి వాడు గిట్టనేమి
పుట్టలోని జెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమా!




భూమి లోన బుట్టు భూసారమెల్లను
తనువు లోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమము లోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినుర వేమ.


కులము గలుగువాడు గోత్రంబు గలవాడు 
విద్య చేత విర్రవీగువాఁడు 
పసిడిగల్గువాని బానిస కొడుకులు 
విశ్వదాభిరామ! వినుర వేమ! 

 తాత్పర్యం: మంచి కులముగల వాడునూ, మంచి గోత్రము కలవాడునూ,విద్యచేత గర్వించువాడునూ ముగ్గురూ సంపద గలవానిని చూచి ఆశ్రయిస్తారు. ఆతిథ్యము పొందుతారు.వానికి బానిసగా ఉంటారని భావం.




చంపదగినయట్టి శత్రువు తనచేత 
చిక్కెనేని కీడు సేయరాదు 
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు 
విశ్వదాభిరామ వినురవేమ



ఉర్వివారికెల్ల నొక్క కంచము బెట్టి 
పొత్తుగుడిపి పొలము కలయజేసి
తలను చెయ్యిబెట్టి తగునమ్మజెప్పరా 
విశ్వదాభిరామ వినురవేమ'

కులవిచక్షణలోని డొల్లతనం గురించి.

మాలవానినంటి మరి నీటమునిగితే 
కాటికేగునపుడు కాల్చు మాల 
అప్పుడంటినంటు ఇప్పుడెండేగెనో 
విశ్వదాభిరామ వినురవేమ



ఇంటియాలి విడిచి ఇల జారకాంతల 
వెంటదిరుగువాడు వెర్రివాడు 
పంటచేను విడిచి పరిగె ఏరినయట్లు 
విశ్వదాభిరామ వినురవేమ



పిండములను జేసి పితరులు దలపోసి 
కాకులకును పెట్టుగాడ్దెలారా 
పియ్యిదినెడుకాకి పితరుడెట్లాయరా
విశ్వదాభిరామ వినురవేమ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు