కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది? సినారె
https://youtu.be/jAiQlEZpi84
*కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది?*
*- సినారె*
కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది?
కత్తులు నాటిన గుడిలో భక్తి ఎలా పండుతుంది?
అంతా భద్రం అంటూ ఎంత కాలమీ సూక్తులూ...
వంచన దూరిన ఇంట్లో మంచి ఎలా బ్రతుకుతుంది?
నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది?
కరగనిదే కొవ్వొత్తి కాంతి ఎలా పుడుతుంది?
చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది?
ఫలితం అందేది, తీవ్ర పరిణామం లోనె సుమా...
మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది?
నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది?
కలవర పడి వెనుదిరిగితే, కాలం ఎగబడుతుంది.
కదనుతొక్కి చెలరేగితే, కాలం భయపడుతుంది.
కర్మయోగి ఏనాడూ కాలాధీనుడు కాదు.
కనురెప్పలు మూతపడితే, కాలం జోకొడుతుంది
కంఠమెత్తి తిరగబడితే, కాలం జే కొడుతుంది.
అపూర్వ సృష్టిని జరపని అహంకారమది వ్యర్థం.
అందంతో శ్రుతి కలవని అలంకారమది వ్యర్థం.
చాటింపుల వెనుక ఉన్న సరుకెంతో తెలుసునులే...
అరుదైన ప్రతిభకివ్వని పురస్కారమది వ్యర్థం.
ఆత్మశుద్ధి తో చేయని నమస్కారమది వ్యర్థం.
వాగుబోతు ఆగడు తన వాక్కులు కక్కేయందే.
తాగుబోతు ఆగడు తన తాగుడు ఎక్కేయందే.
ఎవరెంతగ మొత్తుకున్న ఎక్కదులే ఆ చెవికి...
తిరుగుబోతు ఆగడు తన పరువును పారేయందే.
తిండిబోతు ఆగడు తన గుండెను అపేయందే.
మనిషి వాక్కు పెరుగుతుంది అనుకరణంలోనే.
మనసు గొంతు ఉరుముతుంది అనురణనంలోనే.
అనివార్యం ఎప్పుడో ఒకప్పుడు అనుసరణం...
సైన్యం గతి కుదురుతుంది సహచరణం లోనే.
సంఘం స్థితి ఎదుగుతుంది సహమననం లోనే.
రొద ఉందనుకుంటే నీ ఎద తలుపులు మూసుకో.
అడుసుందనుకుంటే నీ అడుగు తూచి వేసుకో.
చిరాకు తలకెక్కిందా చేటు సుమా నీ ఒంటికే...
దారి అడ్డుతుంటే నీ దమ్ము సాగదీసుకో.
పగ పై పడుతుంటే నీ పంజా శ్రుతి చేసుకో.
బాతును చూపించి అదే పరమహంస అంటున్నావా.
మడుగులోన మునిగి అదే కడలి అడుగు అంటున్నావా.
మగతే కమ్మిందో లేక పొగరు ఒంట పట్టిందేమో...
ఎక్కిందే గుట్ట అదే హిమాలయం అంటున్నావా.
కదిలిందే మైలు అదే తుది గమ్యం అంటున్నావా.
ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైన కలత ఉన్నదా?
ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైన నలత ఉన్నదా?
అంతలోనే ఊసూరంటు అలిసి సొలిసి పోతున్నావా?
ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైన కొరత ఉన్నదా?
ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైన కోత ఉన్నదా?
బురద లోన ఉంటున్నా తరగదు పద్మం విలువ.
తాటాకున పడి ఉన్నా తగ్గదు పద్యం విలువ.
అసలు సిసలు పస ఉంటే అవరోధించేదెవరు.
అశ్రితులేమంటున్నా చెరగదు గానం విలువ.
మూర్ఖులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ.
పూలపైన విహరించే పిల్లగాలికి తుమ్మముళ్ళంటే జడుపుంటుందా?
గోపురాలపై మెరిసే సూర్యకాంతికి పెంట కుప్పలంటే వెగటుటుందా?
మైదానంలో పారే ఏటి నీటికి మాగాణి, బీడూ ఒకటే...
గుండెలోన పొరలు లేని మనిషి కంటికి కులం పైన గురి ఉంటుందా?
మానవతను పూజించే మంచి మనసుకు ఒకే మతం పైన బరి ఉంటుందా?
ఎదురీదే చేతులుంటే ఏరు దారి ఇవ్వక ఏం చేస్తుంది?
పయనించే అడుగులుంటే బాట చేతులెత్తక ఏం చేస్తుంది?
తన కరాలు, పరికరాలు తగిన పాళ్లలో సమన్వయించుకుని...
చూపుని సాచే కంటికి శూన్యం శిరసొగ్గక ఏం చేస్తుంది?
పిడికిలి పిండే మనిషికి ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది?
ఎముక ఉనికి విరగనంత వరకే.
ఇంటి ఉనికి ఒరగనంత వరకే.
గొప్ప డాబులెన్ని చెప్పుకున్నా ....
గుండె ఉనికి చెదరనంత వరకే.
దండ ఉనికి వాడనంత వరకే.
కలల సొగసు దొరకనంత వరకే.
కడలి సొగసు తొణకనంత వరకే.
చిలిపి తలపులెన్ని ఉబుకుతున్నా...
సిగ్గు సొగసు పలకనంత వరకే.
చెలిమి సొగసు ఒలకనంత వరకే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి