కష్టజీవులకు కుడి ఎడమల నిలచిన రచయిత హోవార్డ్ ఫాస్ట్
కష్టజీవులకు కుడి ఎడమల నిలచిన రచయిత హోవార్డ్ ఫాస్ట్
'స్పార్టకస్' పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, పీడిత జన విముక్తిని కాంక్షించే ప్రతి ఒక్కరికి నిరంతర స్పూర్తి స్పార్టకస్, క్రీస్తు పూర్వం 71లో రోమన్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బానిసల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వాడు స్పార్టకస్, మహాయోధుడికి ఆ చారిత్రక ఘట్టానికి అనితర సాధ్యమైనరీతిలో నవలా రూపమిచ్చిన సాహితీ స్రష్ట హోవార్ట్ ఫాస్ట్. అతి పిన్న వయసులోనే సాహితీ ప్రస్థానాన్ని ఆరంభించి కడదాకా కొనసాగించిన ప్రఖ్యాత అమెరికన్ రచయిత హోవార్డ్ ఫాస్ట్ 88 ఏండ్ల వయస్సులో 2003 మార్చి 12వ తేదీన కన్నుమూశారు.
హోవార్డ్ ఫాస్ట్ సాహిత్య సృష్టి ఎంతో విస్తారమైంది, విభిన్నమైంది. ఆయన లెక్కకు మించిన గ్రంథాలు రచించారు. అమ్ముడైన ఆయన గ్రంధాల మొత్తం ప్రతుల సంఖ్య 8 కోట్లు. అంటే ఆ కృషి ఎంతటి బృహత్తరమైనదో అర్థం చేసుకోవచ్చు. హోవార్డ్ ఫాస్ట్ కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. కమ్యూనిస్టు, అభ్యుదయ రాజకీయాల్లో ఉద్యమాల్లో ఆయన ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాలుపంచుకున్నారు. ఫలితంగా అనేక అణచివేతలకు చివరకు జైలు నిర్బంధానికి సైతం గురికావలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన కడదాకా పీడితుల పక్షాన్నే నిలబడ్డాడు. అటువంటి ఉదాత్తమైన వ్యక్తి జీవితాన్ని, కృషిని ఈ సందర్భంగా స్మరించుకోవడం సాహిత్యా భిమానుల బాధ్యత.
హోవార్డ్ ఫాస్ట్ 1914 నవంబరు 2వ తేదీన న్యూయార్క్ నగరంలో జన్మించారు. ఆయన తండ్రి టెక్స్టైల్ కార్మికుడు. పుట్టిన దగ్గర నుండి పేదరికాన్ని అనుభవించిన ఫాస్ట్ హైస్కూలు విద్య కూడా పూర్తి చేయలేక పోయారు. అయినా పేదరికంతో కృంగిపోక జీవితాన్ని ఒక సవాలుగా స్వీకరించి ముందుకు సాగాడు. పదహారేళ్ళ వయస్సులో ఫాస్ట్ మొట్టమొదటి కథ రచించాడు. ఆ కథను ఓ పత్రిక ప్రచురించడమే కాకుండా పారితోషికాన్ని కూడా ముట్టచెప్పింది. అప్పటి నుండి ఫాస్ట్కు సాహిత్యమే జీవనోపాధి అయింది. మొదటి కధ తర్వాత రెండేళ్ళకు ఫాస్ట్ తన మొదటి నవల 'టు వ్యాలీస్' రచించాడు. న్యూయార్లోని డయల్ ప్రెస్ 1933లో ఆ నవలను ప్రచురించింది. 1939లో 'కన్సీవ్ ఇన్లిబర్టీ' నవల ప్రచురణతో ఫాస్ట్ సాహితీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇది అమెరికా విప్లవానికి సంబంధించిన చారిత్రక నవల. ఇదే అంశంపై 'ది ఆన్వాంకిష్డ్' (1942), సిటిజన్ టామ్ పాయిన్' (1943) నవలలను ప్రచురించాడు. 1941లో ప్రచురితమయిన 'లాస్ట్ ఫ్రంటియర్' నవల అమెరికా ఖండం వలసగా మార్చ బడటం ఎటువంటి ఫలితాలకు దారితీసిందీ అక్కడి తొలి నివాసుల దృష్టికోణం నుంచి వివరిస్తుంది. 18వ శతాబ్దానికి చెందిన మహోన్నత విప్లవ ప్రచారకుడు టామ్ పాయిన్ జీవితాన్ని అనాటి చారిత్రిక నేపథ్యంలో ఎంతో ఉత్కంద భరితంగా వివరిస్తుంది సిటిజన్ టామ్ పాయిన్' ననల.
"సిటిజన్ టామ్ పాయిన్' రాస్తున్నపుడే ఫాన్స్ కమ్యూనిస్య పార్టీ సభ్యుడయ్యాడు. ప్రజాస్వామ్య వాదిగా, ఫాసిస్టు వ్యతిరేకిగా ఉన్న ఫాస్ట్ ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో ఫాసిస్ట్ మూకలను సోవియల్ యూనియన్ వీరోచితంగా ప్రతిఘటిస్తున్న సమయంలో కమ్యూనిన్న పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. 1957 వరకు ఆయన కమ్యూనిస్టు పార్టీలో కొనసాగారు. ఈ కాలంలో అమెరికా కమ్యూనిస్టు పార్టీ అధికారపత్రిక డైలీ వరల్డ్'లో విస్తారంగా రచనలు చేశారు. ఈ రచనలు ఓ రాజకీయ జర్నలిస్టుగా ఆయన. ప్రతిభకు అద్దం పట్టాయి. అయితే ఆయన కేవలం ఈ రచనలకే పరిమితం కాలేదు. క్రియాశీల రాజకీయాల్లనూ పాల్గొన్నారు. 1948. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన హెన్రీ వాలెస్కు మద్దతుగా ప్రచారం చేశారు. సలు అంత ర్జాతీయ కాన్ఫరెన్స్లకు కూడా ఫాస్ట్ హాజరయ్యారు. రాజకీయాలను, రచనా వ్యాసంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలోనే ఫాస్ట్ పై ప్రభుత్వ నిర్బంధం, నిఘా కూడా అధికమయింది. అమెరికా గూడచారి శాఖ ఎఫ్.బి.ఐ. ఫాస్ట్ పై 1100 పేజీల రిపోర్టును తయారు చేసిందంటే ఆయన పై నిఘా ఎంత తీవ్రంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అమెరికాయేతర కార్యకలాపాల కమిటీ ఎదుట హాజరయ్యేందుకు నిరాకరిం చడంతో ఫాస్ట్ 1950లో జైలుపాలు కావలసివచ్చింది. స్పెయిన్ అంతర్యుద్ధంలో గాయపడిన వారి చికిత్స కోసం ఫ్రాన్స్లో నిర్మించిన అసుపత్రికి విరాళా లందించిన వారి జాబితాను తెలియజేయకపోవడమే ఆయన చేసిన నేరం. జైల్లో ఉన్న ఈ కాలంలో ప్రజా స్వామ్య హక్కులపట్ల ఫాస్ట్ నిబద్ధత మరింత బలపడింది. ఈ సమయంలోనే ప్రఖ్యాత 'స్పార్టకస్' నవలపై ఆయన పని చేశారు. మూడు మాసాల తర్వాత ఆయన జైలు నుండి విడుదల య్యారు.
1952లో అమెరికన్ లేబర్ పార్టీ తరపున కాంగ్రెస్కు ఫాస్ట్ పోటీ చేశారు. 1953లో సోవియట్ యూని యన్ ఆయనను స్టాలిన్ శాంతి బహుమతితో సత్యరించింది. ప్రఖ్యాత అమెరికా నల్లజాతి గాయకుడు పాలబ్ సన్ కు కూడా ఈ పురస్కారం లభించింది. ఈ సమయం లోనే కమ్యూనిస్ట్ పార్టీలో కొన్ని ధోరణులపట్ల ఫాస్ట్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. 'ది నేకెడ్ గాడ్: ది రైటర్ అండ్ కమ్యూనిజం' అనే గ్రంధంలో పార్టీపట్ల తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన ఫాస్ట్ 1957లో కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఘటన ఆనాడు ఎంతో సంచలనం సృష్టించింది. అమెరికా పాలకులు దీన్ని తమ కమ్యూ నిస్టు వ్యతిరేక ప్రచారానికి వాడుకోవాలని ఎంతో ఆశపడ్డారు. నిజాయి తీపరులకు కమ్యూనిస్టు పార్టీలో స్థానం లేదని దుష్ప్రచారం చేయాలన్నది వారి దురుద్దేశ్యం. కాని ఫాస్ట్ ఆ తర్వాత వ్యవహరించిన తీరు అమెరికా పాలకులకు అటువంటి అవకాశాన్నివ్వ లేదు.
1990లో ప్రచురించిన 'బీయింగ్ 'రెడ్' అనే గ్రంధంలో ఆయన పార్టీ గురించి ఇలా చెప్పారు. "ఒక్క సారిగా పైకి పోవాలన్న కాంక్ష, సంకుచితత్వం, ద్వేషం పార్టీలో నాకు కనిపించాయి. ప్రేమ, అంకితభావం, గొప్ప సాహసం, ఔన్నత్యం కూడా నాకు కనిపించాయి. నేనెన్నడూ చూడనంతటి అత్యున్నత మానవత్వం మూర్తీభవించిన మహానుభావులు కూడా పార్టీలో ఉన్నారు."
ఫాస్ట్ రాజకీయాల్లో తలమునకలవుతున్న సమయంలో ప్రచురణ కర్తలు ఆయనకు దూరం కాసాగారు. 'స్పార్టకస్' నవలను అనేక మంది ప్రచురణ కర్తలు తిరస్కరించారు. ఫాస్ట్ కలుసుకున్న ప్రచురణ కర్తలు కొందరి వద్దకు ఎఫ్.బి.ఐ. ఏజెంట్లు వెళ్ళి ఆయన రచనలను ప్రచురించ వద్దని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో ఫాస్ట్ తన రచనలను తానే ప్రచురించుకోవడానికి పూనుకున్నాడు. 'బ్లూ హెరాన్ ప్రెస్'ను స్థాపించి 'స్పార్టకస్' నవలను ప్రచురించాడు. ఈ తొలి ప్రచురణే గొప్ప ఆదరణ పొందింది. మూడు మాసాల్లోనే 48 వేల కాపీలు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో కమ్యూనిస్టు వ్యతిరేక జాడ్యం మెకర్జీజంను వివరించే పలు నవలలను ఫాస్ట్ రచించారు. కమ్యూనిస్టు పార్టీతో ప్రత్యక్ష సంబంధాన్ని వదులకున్న తర్వాత ఫాస్ట్ హాలీవుడ్ కు వెళ్ళారు. స్క్రీన్ప్లే రచయితగా మారారు. ఈ కాలంలోనే 'స్పార్టకస్' సినిమాగా వచ్చి అపూర్వ విజయాన్ని సాధించింది. ఇరవయ్యవ శతాబ్దం ఆరంభం నుండి, వియత్నాం యుద్ధకాలం వరకు ఒక అమెరికా కుటుంబ జీవితాన్ని వివరిస్తూ రాసిన 'ఇమిగ్రెంట్స్' నవల టెలి సీరియల్గా కూడా గొప్ప విజయాన్ని సాధించింది.
అమెరికా చారిత్రిక నవలా రచయితల్లో ఫాస్ట్ స్థానం అందరి కన్నా ముందుంటుంది. ఆయన నవలల్లో కాలానుక్రమ అధ్యాయాలుండవు. దృశ్యాలు మాత్రమే ఉంటాయి. ఆయన నవల చదువుతూ ఉంటే కదా గమనం కంటే మిన్నగా ఆయా దృశ్యాలు పాఠకుని మనోనేత్రం ముందు సాక్షాత్కరిస్తుంటాయి. ఫ్లాఫ్ బ్యాక్ పద్దతిని ఫాస్ట్ ఎంతో నైపుణ్యంతో ఉపయోగించుకుంటారు. చారిత్రక, రాజకీయ నవలలు ఫాస్ట్ ప్రధాన కృషి అంటే సముచితంగా ఉంటుంది. అందులోనూ చారిత్రక నవలలది ప్రధమస్థానం. అయితే ఫాస్ట్ సాహితీ కృషి కేవలం ఇలాంటి నవలలకే పరిమితం కాలేదు. ఇ కన్నింగ్ హోం అనే పేరుతో ఆయన 20కి పైగా డిటెక్టివ్ నవలలు, సైన్స్ ఫిక్షన్ నవలలు కూడా రచించారు. ఆయన స్వంత పేరుతో రాసిన ప్రధాన నవలలు 40కి పైగా ఉంటాయి. ఇవి కాకుండా అనేక కధలు, వ్యాసాల సంకలనాలు కూడా వెలువడ్డాయి. ఇంతటి బృహత్తరమైన కృషికి అనుగుణంగానే ఫాస్ట్ పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించారు. ఆయనకు జనాదరణ మొదటి నవల నుండే ఆరంభమయింది. ఆ మొదటి నవల 'టు వ్యాలీన్' అమెరికాలో ప్రచురితమయిన కొద్ది మాసాలకే ఇంగ్లండ్లో కూడా ప్రచురితమయింది. ఇదే నవల మొదటి పాత ప్రతి ఒకటి విలువైన పాత వస్తువులు అమ్మే దుకాణంలో కొద్ది సంవత్సరాల క్రితం 500 డాలర్ల ధర పలికింది. ఈ విషయం ఫాస్ట్ దృష్టికి వచ్చినపుడు మొత్తం ఆ నవల రాసినందుకే తనకు అంత మొత్తం ముట్టలేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఫాస్ట్ నవలలకు విదేశాలలో కూడా మంచి ప్రజాదరణ లభించింది పూర్వపు సోవియట్ యూనియన్, ఇతర సోషలిస్టు దేశాలలో ఫాస్ట్ నవలలకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఆయన నవలలు (ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్, స్పానిష్, కేటలాన్, పోర్చుగీస్, గ్రీక్, జెక్, క్రోట్, హీబ్రూ, చైనీస్, జపనీస్, బెంగాలీ, తెలుగు తదితర అనేక భాషలలో అనువదించబడి ప్రపంచ వ్యాపితంగా ప్రచురించ బడ్డాయి. లాస్ట్ ఫ్రంటియర్' నవల ఒక్కటే 20 భాషల్లోకి అనువదించ
బడింది.
ఫాస్ట్ చివరి వరకు నవలలు రాస్తూనే ఉన్నారు. వీటిలో అమెరికాలో పరిస్థితులను విమర్శనా త్మకంగా వివరించే రాజకీయ నవలలు కూడా ఉన్నాయి. ది డిన్నర్ పార్టీ (1987), డిప్లెడ్జ్ (1988), కన్ఫెషన్స్ ఆఫ్ జోకలైన్ (1989) ఈ తరహా నవలలు, ది ట్రయల్ ఆఫ్ ఎ బిగెయిల్ గుడ్ మ్యాన్ (1993) నవల మహిళల గర్భ విచ్ఛిత్తి హక్కును నిరోధించడానికి జరిగే ప్రయత్నాలను సందేహాస్పద దృష్టితో వివరిస్తుంది. ఫాస్ట్ చివరి నవల గ్రీన్ విచ్ 2000లో ప్రచురితమయింది. అప్పటికి ఆయన వయసు 85 ఏళ్ళు. మరో కొత్త నవలపై పని చేస్తున్న సమయంలోనే ఆయన కన్ను మూశారు. ఇంతటి బ్రహ్మాండమైన సాహిత్యాన్ని సృష్టించిన ఫాస్ట్ చివరి వరకు తన రాజకీయ నైశిత్యాన్ని, వామపక్ష దృక్పథాన్ని విడనాడలేదు.
జాక్ లండన్ తర్వాత అమెరికాలో కార్మికవర్గ నేపథ్యం నుండి వచ్చిన రచయితను తానేనని ఆయన నుండే తాను స్ఫూర్తిని పొందానని గర్వంగా చెప్పుకునే ఫాస్ట్ అదే బాటలో ముందుకుసాగారు. నల్లజాతి గాయకుడు పాల్ గోబ్సన్ తో సన్నిహిత మైత్రిని ఫాస్ట్ కొనసాగించారు. ఫ్రెంచి విప్లవ చిత్రకారుడు పికాసోతో ఆయనకు దగ్గర సంబంధాలుండేవి. చిలీ కమ్యూనిస్టు కవి పాబ్లో నెరూడాతో ఆయనకు ప్రగాడానుబంధం ఉండేది. నెరూడా తన కవిత్వం సంపుటి నొకదాన్ని ఫాస్ట్కు అంకితమిచ్చాడు కూడా.
ఏడు దశాబ్దాలకు పైగా ఏకబిగిన అభ్యుదయ సాహిత్య రంగానికి ఎనలేని సేవలందించి, వామపక్ష, ప్రజాతంత్ర, అభ్యుదయ, ఉద్యమాల్లో కూడా పాలుపంచుకున్న హోవార్డ్ ఫాస్ట్ మృతి ప్రపంచ సాహిత్యరంగానికి, అభ్యుదయోద్యమానికి తీరనిలోటు, ఏక ధృవ ప్రపంచంలో తనకెదురేలేదని విర్రవీగుతున్న అమెరికాను అమెరికా గడ్డ నుండే నిలదీసిన ఓ సాహితీ మూర్తి అదృశ్యమయ్యాడు. అయినా ఆయన రచనలు ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళే వారికి నిత్యం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
గుడిపూడి విజయరావు__(ప్రస్థానం ఏప్రిల్-జూన్ 2003)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి