ఒక పుస్తకపు అద్భుత ప్రభావం





*ఒక పుస్తకపు అద్భుత ప్రభావం*
                                 -మహాత్మాగాంధీ

ఒకసారి నా మిత్రుడు పోలక్ ఒక పుస్తకం నాకిచ్చి "ఈ పుస్తకం చాలా బాగుంది. చదవండి. మీకు నచ్చుతుంది" అని అన్నాడు. పుస్తకం పేరు "అంటు ది లాస్ట్", రస్కిన్ రాసిన పుస్తకం. ఆ పుస్తకం చదవడం ప్రారంభించాను. చివరివరకు దాన్ని వదలలేకపోయాను. నన్ను ఆ పుస్తకం కట్టిపడేసింది. జోహన్సుబర్గ్ నుండి నేటాలుకు 24 గంటల ప్రయాణం. సాయంత్రం రైలు డర్బను చేరుకుంది. ఇంటికి చేరిన తరువాత ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. పుస్తకంలో చదివిన విషయాల్ని ఆచరణలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను.

ఇంతకు ముందు రస్కిన్ పుస్తకాలు ఏవీ నేను చదవలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లో పాఠ్య పుస్తకాలు తప్ప యితర పుస్తకాలు నేను అసలు చదవలేదనే చెప్పవచ్చు. మన దేశంలోకి అడుగు పెట్టిన తరువాత సమయం చిక్కలేదు. అందువల్ల యీనాటి వరకు నాకు గల పుస్తకజ్ఞానం తక్కువేనని చెప్పక తప్పదు. అనుకోకుండా అప్పుడెప్పుడో దొరికిన కొంత సమయంవల్ల కొంత లాభమే జరిగింది. ఈ సమయాల్లో కొన్ని పుస్తకాలు చదివాను. చదివిన కొద్ది పుస్తకాలను ఒంటపట్టించుకున్నానని మాత్రం చెప్పగలను. నా జీవితంలో చదివిన తక్షణం మహత్తరమైన నిర్మాణాత్మకమైన మార్పు తెచ్చిన పుస్తకం యిదేనని మాత్రం చెప్పగలను. తరువాత దాన్ని "సర్వోదయం" అనే పేరుతో రస్కిన్ వ్రాసిన 'అంటు ది లాస్ట్' ను అనువదించాను.

నాలో లోతుగా పాతకు పోయిన విషయాల ప్రతిబింబం స్పష్టంగా రస్కిన్ రచించిన యీ పుస్తకంలో నాకు కనబడింది. అందువల్ల యీ పుస్తక ప్రభావం నా హృదయంమీద అపరిమితంగా పడింది. ఆ పుస్తకములోని విషయాల్ని ఆచరణలో పెట్టాలని ప్రేరణ కలిగింది. మనలో నిద్రావస్థలో వున్న మంచి భావాలను, గుణాలను మేల్కొపగల శక్తి కలవాడే కవి. కవుల ప్రభావం అందరిమీదా పడదు. సర్వులలో మంచి భావాలు సమాన పరిమాణంలో వుండకపోవడమే అందుకు కారణం. నేను తెలుసుకున్న సర్వోదయ సిద్ధాంతాలు యివి.

1. సర్వుల మంచి యందే తన మంచి యిమిడి  ఉంది.

2. వకీలు, క్షురకుడు యిద్దరి వృత్తికి విలువ ఒకటిగానే వుండాలి. జీవనోపాధి హక్కు అందరికీ సమానమే.

3. నిరాడంబరంగా వుంటూ కష్టపడి పనిచేసే రైతు జీవనమే నిజమైన జీవనం.

మొదటి విషయం నాకు తెలుసు. రెండో విషయం కొంచెం తెలుసుకుంటున్నాను. మూడో విషయాన్ని నేను ఎన్నడూ ఊహించలేదు. మొదటిదానిలో మిగతా రెండూ యిమిడి వున్నాయి. యీ విషయం దీపంవలె వెలుగు ప్రసారం చేసి సర్వోదయాన్ని నాకు బోధ చేసింది. తెల్లవారింది. యిక ఆచరణకు పూనుకున్నాను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు