ఏది అసలైన కవిత్వం?



ఏది అసలైన కవిత్వం?

ఇవాళ ఏది సుకవిత్వమో !.ఏది కుకవిత్వమో తెలియక కొత్త కవులు తికమక పడుతున్నారు.అసలు కవిత్వమే కాని కవిత్వానికి పురస్కారాలు ఇవ్వడం,ఏవో కొన్ని వాక్యాలు పేర్చి వాటిని కవిత్వంగా అచ్చు వేయడం.ఆపై వాటిపై సమీక్షలు వ్యాసాలు రావడం..చిన్న పెద్ద పత్రికల్లో ముద్రించుకొని మురిసిపోవడం...దాన్ని గొప్ప కవిత్వంగా భ్రమింపచేయడం.ఇవాళ తెలుగు కవిత్వంలో జరుగుతున్న మార్కెటింగ్ తంతు.కవితను ఎలా నిర్మించాలో..ఎలాంటి కవితా నిర్మాణాలు అనుసరించాలో తెలియకపోయినా...చే.రా.అన్నట్టు" కొన్ని గారడి వాక్యాలు,హాస్యోక్తులు,ప్రశ్నార్థకవాక్యాల్ని పదే పదే రిపీట్ చేయటం,సింబాలిక్ పేరిట అయోమయ సంకేతాలు గుప్పించడం," కవిత్వం కాదు.ఒకే వస్తువుకు ఏళ్ళ తరబడి సానపెట్టడం(కాలంలో వచ్చిన మార్పులు గమనించకుండ)ఇంకా శ్రీ శ్రీ లాగో,సి.నా.రె లాగో,తిలక్, అజంతాల లాగా కవితలు రాయాలని చూడటం ఇవన్నీ..నేడు ప్రీవర్స్ రాస్తున్న వాళ్ళు చేస్తున్న ట్రిక్కులు.అందుకే చే.రా.ఏనాడో భావ,అభ్యుదయ,విప్లవ,కవుల ఖండికల సంపుటులు మహా కావ్యాలుగా భ్రమపడకూడదన్నారు.రా.రా.లాంటి విమర్శకులు తిలక్ మంత్ర లోకపు మణి స్తంభాల కవిత్వాన్ని అసలు కవిత్వమే కాదని విమర్శించారు.ఇస్మాయిల్ ఏకంగా కమ్యూనిస్టు కవులకు రూపనిర్మాణం తెలియదన్నారు.ఇవన్నీ పక్కనపెడితే నేడు కవిత్వం రాస్తున్న యువకవులు,కవయిత్రులు..ఎవరిని ఆదర్శంగా తీసుకొని కవిత్వం రాస్తున్నారో అర్థం కావడం లేదు.ఫేస్ బుక్ లు,వాట్సాప్ గ్రూపులు,ట్విట్టర్ లు,బ్లాగుల్లో తవ్వితే గుట్టలు కొలది కవితలు బయట పడుతాయి.వాటిపై కొందరు అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్ళు,లోతైన పరిశోధనల చేయకుండానే.. తెలిసీ తెలియని అమాయకత్వంతో సమీక్షలు రాస్తూ..కవిత్వం కాని కవిత్వానికి పబ్లిసిటీ కల్పిస్తున్నారు. నేటి కవులు,సమీక్షకులు,పాత కవులను రోతకవులను,నీతిలేని కవుల అవుట్ డేటెడ్ పొయెట్రీని సమీక్షించి దాన్నే గొప్ప కవిత్వంగా భ్రమింప చేయటం దారుణం.,కొత్త కవుల కవితల్లో ప్రతీకల గందరగోళం ఉన్నా,సింటాక్సు సరిగా లేకున్నా అభివ్యక్తిలో వైవిధ్యం లేకున్నా వారిది మంచి కవిత్వమని సమర్థిస్తూ రాయటం వల్ల కొత్త కవులకు ఏది సుకవిత్వమో...ఏది కుకవిత్వమో తెలియని పరిస్థితులు కల్పించి వారిని  అయోమయంలో పడేసినట్టవుతుంది..కొత్త కవులను ప్రోత్సహించాల్సిందే..కాని..ఏది కవిత్వమో ..కవితా నిర్మాణం ఎలా చేపట్టాలో తెలియజేయాల్సిన అవసరం ఉంది.కొత్తగా కవిత్వం రాసే కవులు ఈ కింది విషయాలు గమనించాలి..

1.పాత కవుల కవితలు చదవండి.కాని మక్కికి మక్కి అనుకరించకండి.

2.కవిత్వపు భాష వేరని గుర్తించండి.సాధారణవచనం కన్నా ఫ్రీవర్సువాక్యరచన భిన్నంగా ఉంటుందని గుర్తించండి.

3.అనుప్రాసలు ,అంత్యప్రాసలు,అంతర్లయలు,వచన కవిత్వానికి అక్కర్లేదు.

4.కవితలో సంబోధనలు అవసరం లేదు.ఒకవేళ బలమైన అభివ్యక్తి కోసం వాడితే ఔచితీవంతంగా ఉండాలి.

5.ఒకే శైలిని సాగదీస్తూ,చెప్పిందే చెబుతూ..ముసలి కవుల్లాగ కవిత్వం రాయకండి. 

6.ప్రతీకలు,మెటాపర్లను అవసరమైనంత మేరకే వాడండి.అలా అని కవిత మొత్తం వాక్యాలతో నింపి ఎక్కడో ఒకచోట..సిమిలీతో,లేక మెంటాపర్తో కవితా వాక్యం నిర్మిస్తే ...అది కుకవిత్వం అవుతుంది.

7.కవితాభివ్యక్తిలో వైవిధ్యం పాటించాలి.ప్రపంచ కవితా నిర్మాణ పద్ధతులు,పర్సోనిఫికేషన్,పేరల్లెల్లిజం,మెటానమి,అఫోస్ట్రెపి..లాంటివి అందుకే వచ్చాయి.(చూ...బిక్కికృష్ణ కవిత్వం-డిక్షన్ పుస్తకం)

8.ఇస్మాయిల్ పర్సోనిఫికేషన్ కవితా నిర్మాణ పద్ధతిని ఎక్కువ ఫాలో అయ్యారు.అందుకే ఆతని కవిత్వం ఆరోజుల్లో వెలిగింది.

9.పాదాలు విరవటం వల్ల కవితా నిర్మాణం గొప్పగా ఉండదు.భావనా బలం ఉండాలి.కొత్త పదబంధాలు సృష్టించడంలోనే కవి ప్రతిభ దాగి ఉంటుంది.

10.వాక్యాల మధ్య అంతస్సంబంధాన్ని కొనసాగిస్తూ కవితా రూపాన్ని అల్లుకోవాలి. 

11.ముందే శీర్షిక పెట్టి కవిత రాయటం కన్నా..కవితా నిర్మాణం...చివర్లో..శీర్షికను నిర్ణయించడం మంచిది.

12.పాత ప్రతీకలు ధ్వంసం చేసి..వాటిస్థానంలో కొత్త ప్రతీకలు సృష్టించాలి(ఫ్రెంచి కవులు బోదలేర్,మల్లార్మేల కవిత్వం మానిపెస్టేషన్ చెప్పింది ఇదే)

ఇలా వచన కవితా నిర్మాణంలో కొన్ని మెలకువలు పాటించాలి.బాగా గమనిస్తే ప్రపంచంలో గొప్ప కవులుగా పేరు పొందిన ఏ కవి కవితా నిర్మాణం ఒకేలా ఉండదు.అభివ్యక్తిలో ఏదో కొత్తదనం ఉంటుంది.వర్డ్స్ వర్త్,ఇలియట్ ,ఎజ్రా పౌండ్ ,వాట్ విట్మన్..ఎవరి కవితలైనా విశ్లేషించి పై విషయం తెలుసుకోవచ్చు.తెలుగులో శ్రీశ్రీ ని ఎందరో అనుకరించాలని చూసినా ఆతని డ్రైవింగ్ ఫోర్స్,వాక్య నిర్మాణం,నవ్యప్రతీకలు,(సిందూరం,రక్తచందనం,బంధూకం,సంధ్యారాగం,పులిచంపిన లేడి నెత్తురు,కలకత్తా కాళికా నాళిక) తర్వాతి తరం అనుకరించినా శ్రీశ్రీలా ఆకట్టుకోలేక పోయారు.తర్వాత వచ్చిన కుందుర్తి,తిలక్,శేషేంద్ర,అజంతాలు ప్రపంచ కవుల కవితా నిర్మాణాలు అనుకరించి తెలుగు కవితానిర్మాణంలో కొత్తదనం సాధించారు.ఇస్మాయిల్,"మో"లు  పూర్తీగా విదేశీ కవితా నిర్మాణాలను అనుకరించి అభివ్యక్తి నవ్యతను సాధించి తమది కన్సీవ్ పొయెట్రీ అని భ్రమింపజేశారు.తర్వాతి తరం కవులు వారిని అనుకరించడానికి ప్రయత్నించి వ్యుత్పత్తిలేక బంగపడ్డారు. విస్తృత విదేశీ కవితాధ్యయనం వల్లనే శ్రీశ్రీ,మో లాంటి కవుల కవిత్వానికి శిల్పసోయగం సిద్ధించింది.విప్లవ, దిగంబర కవులు,(నగ్నముని కొయ్యగుర్రం మినహాయిస్తే) అరుపులు,కేకలు,నినాదాలనేగొప్ప కవితా నిర్మాణాలనుకోవడంవల్ల వారి కవిత్వం ఉద్యమాలతోపాటే మూలబడింది.  నిర్మాణ రామణీయత,సార్వజనీనమైన వస్తుతత్వం,అభివ్యక్తినవ్యత,రూపనిర్మాణ కౌశలం ఉన్న కవిత్వమే (శ్రీశ్రీ,శేషేంద్ర)కలకాలం మనగలుగుతుంది. అలాగే అస్తిత్వ కవితోద్యమాలు,తమ జీవద్భాషకు, బాధకు,ఆగ్రహానికి,ఆత్మగౌరవానికి, వస్తువుకు ఇచ్చిన ప్రాధాన్యం శిల్పవైవిధ్య భంగిమలకివ్వలేదన్న విమర్శలున్నాయి.
నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో కవితావస్తువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.నేడు అభ్యుదయ,విప్లవ,అస్తిత్వ వాదాలకవులు ప్రభుత్వాలకు అమ్ముడు పోయారు.(ఏ కొందరో మినహా)విప్లవ కవులు,విప్లవ సానుభూతి సృజన కారులు పెట్టుబడి ప్రభుత్వాలు విసరివేసే చిల్లరను, అవార్డులను..స్వీకరించి వ్యక్తిత్వాలు కోల్పోయి జీవశ్చవాలుగా బతుకులు వెల్లదీస్తున్నారు.అసలు వారి కవిత్వాలు ఏనాడో యువకెరటాల నవ్యాభివ్యక్తి ఉధృతిలో కొట్టుకు పోయాయి.ఇప్పుడు తక్కువశాతమైనా యువతీయువకులు మంచి కవిత్వం రాస్తున్నారు.అయితే కుహనా విమర్శకులు,అవకాశవాదులైన సమీక్షకులు,పురావైభవంకోసం ప్రాకులాడే  కొందరు సీనియర్ కవుల మాయలోపడి,కుల, మత కంపు అంటించుకొని..కుకవిత్వాన్నివంటబట్టించుకొంటున్నారు.,పాతకవుల ,రోతమెటాపర్లలో,వ్యక్తిగతస్వేచ్ఛోన్మాదపు విచ్చలవిడితనపు అభివ్యక్తి లో అసలైన కవిత్వం ఉందనుకొంటున్నారు.ప్రగతిశీలభావజాలం వేరు.వ్యక్తిగత భావోద్రేకాలు,విలువలు వేరు.కాలాన్ని బట్టి విలువలు మారుతుంటాయి. ,సైకాలజికల్ రోగ్స్ వస్తుతత్వ ,స్వీయ పైత్యపు కవిత్వాన్ని విశ్లేషిస్తూ గొప్ప కవిత్వంగా మార్కెటింగ్ చేస్తున్నారు.ప్రపంచీకరణ,కంజ్యూమర్ సంస్కృతిలో కవులు,ఉద్యమాలు,ఆదర్శాలు అమ్ముడుబోయాయని..తెలియజేస్తూ..వాటి మూలాలు వెతికి‌ పరిష్కారాలు కొత్తకవులకు సూచించాలి.కవితా నిర్మాణాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు చూబెట్టాలి.ఉత్పత్తి సాధనాలు మారేకొలది కవిత్వంలో ప్రతీకలు మారుతుంటాయని గుర్తు చేయాలి.... ఆత్మాశ్రయ కవిత్వంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేసే కవిత్వాన్ని రాయడానికి యువకవులను ప్రోత్సహించాలి. నేడు కవిత్వపు విమర్శ లేదని గగ్గోలు పెడుతున్న పెద్దమనుషులు ఇప్పుడొస్తున్న అద్భుతమైన కవితావిమర్శా పుస్తకాలను చూడలేకపోతున్నాను.జీర్ణించుకోలేకపోతున్నారు.నేడు కవిత్వాన్ని ఆస్వాదించి, విమర్శించి,విశ్లేషించి,సమీక్షించే విమర్శకులు ,విశ్లేషకులు,సమీక్షకులు గతం కన్నా ఎక్కువగానే ఉన్నారు.అలాగే గతం కన్నా గొప్ప కవులు నేటి తరంలోనే చాలామంది ఉన్నారు.
అయితే పత్రికలు మీడియా పాతకవులను ,రోతకవులను పాత డిక్షన్ కవిత్వాన్ని,కు కవిత్వాన్ని ప్రచురించడానికే,ప్రసారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కొత్త కవులు ఎంత మంచి కవిత్వం రాసినా వెలుగులోనికి తేవడంలేదన్న విమర్శలు లేకపోలేదు..మొత్తానికి కవికూటాలు,యూనివర్సిటీ కుహనా మేధావులు,కుల సంఘాలు,కొన్ని అంతర్జాల సాహిత్య గ్రూపులు ,వ్యక్తిగత పలుకుబడికోసం నేడు కవిత్వం కాని అకవిత్వాన్ని సుకవిత్వంగా  భ్రమింపజేస్తున్నారు.సీనియర్ కవులు కూటాలుగా విడిపోయి భజన బృందాల కవులను ప్రోత్సహిస్తున్నారు.యూనివర్సిటీ పరాన్న బుక్కులు...నక్కల మాదిరి కూటాలుగా ఏర్పడి పురస్కారాలు పంపిణీ చేసుకుంటారు.యూనివర్సిటీల్లో లేటెస్టు కవిత్వంపై ఎక్కడా పరిశోధనలు జరగడం లేదు.ఇంకా కట్టమంచి భావశిల్పం దాటి వారి పరిధి పెరగలేదు.మన తెలుగు యూనివర్సిటీలు కవిత్వ విషయంలో వెయ్యేళ్ళు వెనుకబడి ఉన్నాయి.ఇక సాహితీ సేవా సంస్థలు...పేరుకోసం..కుకవిత్వాన్ని ,కుకవులను కూటాలవారీగా ప్రోత్సహిస్తున్నాయి.ఇక తెలుగు కవిత్వం అంతర్జాతీయ స్థాయికెదగాలంటే .....

1.యువతీ యువకులు అసలైన కవిత్వమంటే ఏమిటో తెలుసుకోవాలి.మంచి కవిత్వం కోసం త్రిపురనేని శ్రీనివాస్ లా ఉద్యమించాలి.

2.ఊహకు భావనకు,భావనకు కల్పనకు,కల్పనకు బుద్ధికి ఉన్న తేడా తెలుసుకోవాలి.

3.కవిత్వం సౌందర్యం గురించి విశ్లేషించుకోవాలి.

4.కవితా నిర్మాణంలో నూతన అభివ్యక్తి ద్వారా అపూర్వతను ఎలా సాధించాలో నేర్చుకోవాలి.
వస్తువును కవిత్వం ఎలా చేయాలో నిర్మాణ బంధం(structural tie)రహస్యం తెలుసుకోవాలి.
ఉదా...
అడవిని అడివంటే అది కవిత్వం కాదు..అడవి నీలాకా శంలాగుందంటే అది కవితా పాదమవుతుంది..పచ్చదనాన్నినీలిమతో ఉపమింపజేసే మెంటార్ లేక సిమిలీలు ఎలా సృష్టించాలో తెలుసుకోవాలి..ఇంకా మీరు భావనా బలంతో కొత్తగా conceit poetry చెప్పాలంటే "ప్రకృతి రాసిన ప్రేమలేఖ అడవి"అని సరికొత్త కవితా పాదం నిర్మించవచ్చు.మనం కవితా రాస్తే...అంతకు ముందు ఎవడో రాసినట్టు ఉండకూడదు.అలాగే పోలికలు కొత్తగుండాలి.ఫ్యాషన్ డిజైనింగ్ లో కొత్త కొత్తఫ్యాషన్స్ వచ్చినట్టు..కవితా నిర్మాణంలో మీదైనా క్రియేటివిటి(సృజనాత్మకత)నేటివిటీ(స్థానికత)భావుకత,తాత్వికత,సౌందర్య దృష్టి(Aesthetic Sense) ఉండాలి.వస్తువు ఏదైనా అభివ్యక్తి నవ్యతే ఆధునిక కవిత్వం..అని గుర్తించుకోండి!

-కళారత్న బిక్కికృష్ణ(కవిత్వం-డిక్షన్ కవితా నిర్మాణ పద్ధతులు..పుస్తకం రచయిత)
సెల్:8374439053

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు