సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి ?


సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి ?
                   
       Pic Source: thestrip.ru
మనకు చిన్నప్పుడు అమ్మమ్మలూ, నాయనమ్మలూ చెప్పిన ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. శివుడు ఎద్దును ఒక చాటింపు వేసి రమ్మన్నాడట మనుషులందరూ రోజుకు ఒక్కసారి భోంచేసి, మూడుసార్లు స్నానం చెయ్యాలని. ఆ ఎద్దు పొరపాటున వ్యతిరేకంగా చాటింపు వేసింది. రోజుకు ఒక్కసారి స్నానం చేసి, మూడుసార్లు భోంచెయ్యాలని, దాంతో శివుడిక్కోపం వచ్చి, రోజుకు మూడుసార్లు తినడానికి అవసరమైన పంటల్ని పండించడానికి ఆ ఎద్దునే కష్టపడమని దానికి శిక్ష వేశాడట. ఎంత అద్భుతమైన ఊహ! మానవుడు తాను రోజుకు మూడుసార్లు తినడానికి ఆ ఎద్దుచేసిన పొరబాటే కారణంగాని, తాను కారణం కాదని చెప్పుకోడానికి అల్లుకున్న
అందమైన కథ ఇది. మానవుడు కథలు రాయడం ప్రారంభించకముందే, కథలు చెప్పుకునే సంప్రదాయాన్ని ఎప్పుడో ప్రారంభించి ఉంటాడు.

మానవుడు స్వార్ధపరుడు. తన 'జాతి స్వార్థం' మానవుడితోబాటు ఏ జీవికయినా ఉండడం ప్రకృతి సహజం. ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడాన్ని దోపిడీ అనాలేగాని, స్వార్థం అనే చిన్నమాటతో తేలిగ్గా చెప్పకూడదు. పెద్ద తప్పులకు చిన్నమాటలు వాడి తప్పించుకునే తెలివితేటలు ఈనాడు మానవుడికి పుష్కలంగా ఉన్నాయి. మానవ సమాజంలో రెండు వర్గాలున్నాయని చెబుతూ కొందరు ఉన్నవాళ్ళూ, లేనివాళ్ళూ అని విభజిస్తారు. అది పైకి కనిపించే వాస్తవం మాత్రమే. కాని అసలు వాస్తవం దోచుకునేవాళ్ళూ, దోపిడీకి గురయ్యేవాళ్ళూ అని విభజించడంలో ఉంది. అప్పుడు మాత్రమే కొందరు ఎందుకు ఉన్నవాళ్ళయ్యారో మరికొందరు ఎందుకు లేనివాళ్ళయ్యారో తెలుస్తుంది.

సామాన్య మానవుడు కూడా తాను చూసిన, తాను తెలుసుకున్న ప్రతిసంఘటన పట్లా, ప్రతి విషయంపైనా తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండడు. ఆ అభిప్రాయాన్ని కూడా అంతవరకూ తనకేర్పడి వున్న అవగాహనను బట్టే వ్యక్తం చేస్తాడు. అంటే సామాన్య మానవుడు కూడా అడుగడుగునా తన దృక్పథం నుంచే మాట్లాడుతుంటాడన్నమాట.

ఒకసారి ఒకే సంఘటన గురించి రెండు పత్రికల్లో రెండు దృక్పథాలతో ఒక వార్త అచ్చయింది. వరకట్నం ఇవ్వలేకపోవడం వల్ల పెళ్ళిపీటలపై నుంచి లేచి వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు. ఆ దారుణాన్ని సహించలేక పెళ్ళికి వచ్చినవాళ్ళలో ఒక యువకుడు అదే పెళ్ళి మండపంలో అదే పీటలపై కూర్చుని అదే మూహూర్తానికి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇదీ సంఘటన. ఒక పత్రిక దీన్ని 'యువకుని ఆదర్శం' అనే శీర్షికతో ప్రచురించింది. మరో పత్రిక ఆ వార్తకే 'ముహూర్తబలం' అని శీర్షిక పెట్టింది. ఇది ఆ రెండు పత్రికల దృక్పథాన్ని తెలియజేస్తుంది.



సమాజంలోని అవినీతిని, లంచగొండితనాన్ని చూసి ఈ సమాజం బాగా చెడి పోయిందని ఒకరనొచ్చు. ఈ రోజుల్లో లంచమివ్వకుండా పనులెట్లా అవుతయ్?.. అని మరొకరు ప్రశ్నించవచ్చు. డబ్బులు తీసుకున్నా పని బాగా చేస్తాడని ఇంకొకరు అభిప్రాయపడొచ్చు. ఇవన్నీ వారి వారి అవగాహననూ, అనుభవాన్ని, సంస్కారాన్నీ... ఒక్కమాటలో దృక్పథాన్ని తెలియజేస్తాయి.

రచయితకు ఒక దృక్పథం ఉంటుందని చెప్పడానికి ఇంత ఉపోద్ఘాతం  కావాలా అని ఆశ్చర్యపడొచ్చు. నిజమే, రచయితలకు ఏ సిద్ధాంతమూ అక్కరలేదనవాళ్ళు కూడా సాహిత్యలోకంలో ఉన్నారు. నిజానికి మనం ఆశ్చర్యపడాల్సింది ఇందుకు ఏ సిద్ధాంతమూ లేకుండా, ఏ విషయాన్నీ చెప్పకుండా, ఏ రచయితా ఏ రచనా చెయ్యడు. 'ఇజాలు కాదు. నిజాలు కావాలి' అంటారు కొందరు. ఇజాల కతీతంగా నిజం ఉంటుందో లేదో ఆ విషయం అలా ఉంచుదాం గాని, మానవుడు ఇజాల కతీతంగా నిజాన్నే కాదు అబద్ధాన్నీ  చూడలేడు. మనిషి నడతలో, మనిషి చూపులో, మనిషి చేష్టలో, మనిషి మాటలో, మనిషి మౌనంలో ఇజం ఉంది. ఇది ముమ్మాటికీ నిజం.

రచయిత ఏ విషయాన్నైనా ఒక దృక్పథంతో చిత్రిస్తాడని అర్థమైంది. అయితే ఆ దృక్పథం ఎలాంటిదై ఉండాలి? ఇక్కడ ఎన్నో అభిప్రాయ భేదాలుంటాయి. మనిషికి ఆకలయితే ఏం చెయ్యాలి ? బహుశ ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుండవు. ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే ఆకలి తీరదు. మానవ శరీర ధర్మం అది. అది అందరికీ ఒకే విధంగా అర్థం అవుతుంది. మానవ శరీరంలోని అవయవాలు నేను గొప్పంటే నేను గొప్పని తగాదా పెట్టుకుని, ఏది గొప్పో తేలక పని చెయ్యడం మానేసిన కథ మనకు తెలుసు. శరీర అవయవాలన్నీ పరస్పర అవగాహనతో ఉంటేనే శరీరం పనిచేస్తుంది. అలాగే సమాజమూ. అయితే సమాజంలో ఎక్కువ తక్కువ భేదాలున్నాయి. బలవంతులు, బలహీనులు అనే తేడాలున్నాయి. ఆస్తిపరులు, ఆస్తి లేనివాళ్ళు అనే. అంతరాలున్నాయి. మంచి, చెడ్డ అనే విలువలున్నాయి. వర్గవ్యవస్థ అంతమయ్యేదాకా ఈ అసమానతలు పోవు. వ్యక్తిగత ఆస్తి హక్కు ఉన్నంతవరకూ ఈ అసమానత లుంటాయి.

రచయిత ఎందుకు రాస్తాడు ? తన ఆనందం కోసమా ? తన భావాల్ని ఇతరులకు చెప్పడం కోసమా? తన ఆనందం కోసమే అయితే రాయక్కరలేదు. అచ్చెయ్యక్కర లేదు. తన మనసులోనే కవిత్వం చెప్పుకుని తనలో తాను ఆనందించొచ్చు. కానీ అలా ఎవ్వరూ ఉండరు. రాసిన రామాయణాన్నే ఎందుకు రాస్తున్నారని ఎవరైనా అడిగితే తిన్న అన్నమే ఎందుకు తింటున్నాం? పీల్చిన గాలినే ఎందుకు పీలుస్తున్నాం అంటాడు విశ్వనాథ సత్యనారాయణ. అయినా రామాయణంలో చిత్రింపబడ్డ జీవితం, మానవ సంస్కృతి ఆయన కిష్టమనీ, అందుకే ఆయన రామాయణాన్ని మళ్ళీ రాశాడనీ గ్రహించడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ప్రతి రచయితా సమాజంకోసమే రచన చేస్తాడు.

సామాజిక స్పృహలేని రచయితలు సాధారణంగా ఎవరూ ఉండరు. సామాజిక స్పృహ కేవలం మార్క్సిస్టు రచయితలకు మాత్రమే సంబంధించిందని అనుకోవడం పొరబాటు. చాలామంది రచయితలు సమాజాన్ని పట్టించుకోరనడం సరైన పరిశీలన కాదు. ప్రాచీన సాహిత్యం కూడా సమాజం ఎలా ఉండాలో తన పద్ధతిలో తాను చెప్పింది. చాలామంది రచయితలు నిజంగానే సమాజాన్ని పట్టించుకోకుండా రచనలు చేసి ఉంటే బహుశ సమాజం ఇంతగా చెడిపోయేది కాదేమో!

పాఠకులు రచయితని అర్థం చేసుకోడానికి ప్రయత్నించినట్టే, రచయితలు కూడా సమాజాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. అర్ధం చేసుకోవడం అంటే ప్రజల కష్టాల్ని చూసి బాధపడడం కాదు, సానుభూతిని ప్రదర్శించడం కాదు, అయ్యోపాపం అనడం కాదు, నాలుగు కన్నీటిబొట్లు రాల్చడమూ కాదు. పేదలకు సేవచేస్తూ అదే నిజమైన పరిష్కారం అనుకోవడమూ కాదు. ప్రజలు తమ సమస్యల్ని తాము పరిష్కరించుకునే దిశలో వెళ్ళడానికి అవసరమైన చైతన్యాన్ని కలిగించడమే సాహిత్యం చెయ్యాల్సిన పని. ఒక పేదవాడికి కేజీ చేపలు తెచ్చివ్వడం కంటే ఒక చేపను పట్టడం నేర్పడం మంచిదని చైనా సామెత. ఒకసారి ప్రభుత్వం నిర్వహించిన  'జన్మభూమి' కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు, విద్యార్థులూ గ్రామాలకు వెళ్ళి క్లీన్ అండ్ గ్రీన్ పనిలో పాల్గొని వస్తే, నెలరోజుల తర్వాత ఆ గ్రామానికి చెందిన ఒకతనికి ఈ అధ్యాపకుడు కనిపిస్తే 'మళ్ళీ ఎప్పుడొస్తారు సార్' అనడిగాడట !

స్త్రీ పురుషుల మధ్య వున్న ఆర్థిక అసమానతను గూర్చి ఒక రచయిత ఒక చిన్న కథలో అద్భుతంగా చెప్పాడు. కూలి చేసుకొని బతికే ఒక స్త్రీ ప్రతిరోజూ కూలికి వెళ్లి ఆడకూలి తీసుకుంటూ ఉంది. మగకూలి కంటే ఆడకూలి తక్కువ. ఒక రోజామె బస్సెక్కింది. కండక్టరు తనకు ఆడ టిక్కెట్టివ్వకుండా మగటిక్కెట్టే ఇచ్చాడు. కూలిలో ఆడా మగా తేడా ఉన్నప్పుడు బస్సు టిక్కెట్టులో ఆ తేడా ఎందుకు లేదని ఆ స్త్రీ అమాయకంగానే అడిగింది. పని చేయించుకోవడంలో సమానత్వం, ఫలితం యివ్వడంలో అసమానత్వం. ఖర్చు పెట్టే చోట సమానత్వం, సంపాదించే చోట అసమానత్వం. ఈ వైరుధ్యమే సంఘర్షణకు దారి తీస్తుంది. ఈ అసమానత్వమే పోరాటానికి కారణమవుతుంది. ఇదే మానవజాతి చరిత్ర క్రమం. అందుకే “పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను" అన్నాడు శ్రీశ్రీ.

సమానత్వాన్ని కోరుకునే వాళ్లు జంతువుల్ని కూడా మానవులతో సమానంగా చూడాలి గదా అని చలం ఒకచోట ప్రశ్నిస్తాడు. నిజమే. జంతువుల్ని తమతో సమానంగా చూసే ముందు మానవులు సాటి మానవుల్ని సమానంగా చూడడం నేర్చుకోవాలి. సగభాగమైన స్త్రీలను సమానంగా చూడడం నేర్చుకోవాలి. కొందరు మనుషుల్ని అంటరానివాళ్లుగా చూడడం మానుకోవాలి. మానవుల మధ్య అసమానతలు పోకుండా. జంతువుల్ని ప్రేమగా చూడ్డం సాధ్యం కాదు. పెంపుడు కుక్కకు బిస్కెట్లు పెట్టి వీధి కుక్కను తరిమి కొట్టడం జంతువులపై ప్రేమ చూపడం కాదు. అసలు విషయం ఏమిటంటే కమ్యూనిస్టులు చెప్పే సమానత్వం సాధ్యం కాదని చెప్పడానికి చలం చేసిన ప్రశ్న ఇది. సామాజిక స్పృహ ఎంతో కొంత అందరు రచయితల్లో ఉన్నా, మానవ జాతి చరిత్ర క్రమాన్ని గుర్తించగలిగిన రచయితలే సామాజిక చైతన్యంతో రచనలు చెయ్యగలరు. కాలం మారే కొద్దీ ఒకప్పుడు వ్యతిరేకించిన సమాజమే కొన్ని విలువల్ని గుర్తిస్తుంది. ఒకప్పుడు స్త్రీకి విద్య అనవసరం అని భావించిన స్థితి ఉంది. ఇవాళ ఆ స్థితి లేదు. మనిషికి తిండి అవసరమా అని చర్చించడం ఎంత అర్థరహితమో, ఇవాళ ఫ్రీకి విద్య అవసరమా అని చర్చించడం అంతే అర్థరహితం. సమాజం ఇలా ఒక విలువను గుర్తించడం వెనుక ఎన్నో పోరాటాలుంటాయి. ఎంతో మంది కృషి ఉంటుంది. ఇలా ప్రాచీన కాలం నుంచీ సమాజం దశలు దశలుగా ఎదుగుతూ వస్తోంది. "గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్" అన్న అభిప్రాయంనుంచి 'మంచి గతమున కొంచెమేనోయ్" అన్న అభిప్రాయానికి రావడానికి తెలుగు సమాజానికి తొమ్మిది శతాబ్దాలు పట్టింది.

అన్నీ వేదాల్లో ఉన్నాయని సంతృప్తి చెందడం, భగవద్గీతను పారాయణం చెయ్యడం, రామాయణాన్ని పూజించడం ఇలాంటి ధోరణుల వల్ల ఆ సాహిత్యం సాహిత్యం కాకుండా పోతోంది. వేదాలు గానీ, రామాయణ భారతాలు గానీ, పురాణాలు గానీ ఈ దేశంలో పుట్టిన సాహిత్యం. ప్రాచీన భారత దేశపు స్థితిగతుల్ని ఎంతో కొంత మేరకు చిత్రించిన సాహిత్యం. ప్రాచీన భారతదేశ చరిత్ర రచనకు ఇతర ఆధారాలతో బాటు ప్రాచీన సాహిత్యాన్ని కూడా ఒక ముఖ్య ఆధారంగా అద్భుతంగా వినియోగించుకున్నాడు సుప్రసిద్ధ ఆధునిక చరిత్ర కారుడు డి.డి. కోశాంబి.

రామాయణంలో రాముణ్ణి ఒక పాత్రగా గాక దేవుడిగా చూస్తే అప్పుడు రామాయణం సాహిత్యం కాలేదు, మనం సాహిత్య పాఠకులమూ కాలేము. పురాణాలలో చిత్రింపబడ్డ అద్భుత శక్తుల్ని, మహిమల్ని పక్కనబెట్టి వాటిని పరిశీలించాలి. కోశాంబి ఇచ్చిన ఒక ఉదాహరణ గుర్తు చేస్తాను. పరశురాముడి కథ మనందరికీ తెలుసు. పరశురాముడు బ్రాహ్మణ వర్ణంలో పుట్టినా శస్త్రాస్త్ర విద్యలు నేర్చాడు. ఆయుధం పట్టాడు. రాజులందర్నీ ఇరవయ్కొక్క సార్లు నరికి పారేశాడు. ఇదీ కథ. ఎంత మొనగాడికయినా ఆచరణలో ఇది సాధ్యం కాదని తెలుసు. ఈ కథ ఎందుకు పుట్టింది ? దాని నేపథ్యం ఏమిటి ? వర్ణ వ్యవస్థ ప్రకారం శస్త్రాస్త్ర విద్యలు నేర్వడం క్షత్రియధర్మం. మరి పరశురాముడు బ్రాహ్మణుడై వుండి వేద విద్యలతో సరిపెట్టుకోక ధనుర్విద్యను ఎందుకు నేర్చుకున్నాడు ? రాజులందర్నీ ఇరవయ్కొక్క సార్లు ఎందుకు చంపాడు ? ప్రాచీన భారతదేశంలో బ్రాహ్మణులూ, క్షత్రియులూ అగ్రవర్ణాలు. అప్పటికే వ్యవసాయం ప్రారంభమైంది. పంటలు పండి మిగులు ఉత్పత్తి వస్తోంది. దీన్ని పంచుకోవడంలో అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకూ, క్షత్రియులకూ మధ్య ఏర్పడ్డ తగాదాలే పరశురాముడి కథ సృష్టికి కారణం అంటాడు కోశాంబి. అధికారం రూపంలో భౌతికశక్తి క్షత్రియుల
చేతిలో ఉంది. బ్రాహ్మణులకు సమాజంలో గౌరవం ఉంది. బ్రాహ్మణులు మంత్రాలు. చదివితే తప్ప రాజుల అధికారం ఖరారు కాదు. అధికారం వచ్చాక రాజుల అహంకారానికి తిరుగు లేదు. ఇద్దరి మధ్య తగాడా వస్తే క్షత్రియులదే పైచేయి అవుతుంది. చివరకు క్షత్రియుల మాట బ్రాహ్మణులు వినక తప్పదు. బలవంతుడు కొడితే బలహీనుడు మనసులో తిట్టుకుంటాడు. ఆ విధంగాతృప్తి పడతాడు. అలా పరశురాముడి పాత్ర ద్వారా బ్రాహ్మణులు క్షత్రియులపై కసి తీర్చుకున్న అనుభూతిని పొంది ఉంటారు. ఇంకో ఉదాహరణ. రామాయణ భారతాల వల్ల ప్రాచీన భారత సమాజంలో వచ్చిన ఒక ముఖ్యమైన పరిణామాన్ని తెలుసుకోవచ్చు. మానవుల మధ్య ఉన్న సంబంధాలలో ఆస్తి సంబంధం ప్రధానమైంది. అది ముఖ్యం కాదని మనం ఎంత చెప్పుకున్నా సమాజాన్ని నడిపిస్తున్న ఒక ప్రధాన చోదక శక్తి అది. ఆస్తి పుట్టినప్పటి నుండి ఆస్తి సంబంధాలు ఈ సుదీర్ఘ కాలక్రమంలో మారుతూనే వస్తున్నాయి. రామాయణ కాలంలో తండ్రి ఆస్తిపై పెద్ద కుమారుడికే హక్కుండేది. అందుకే దశరథుడి రాజ్యంపై రాముడికే అధికారం దక్కింది. లక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముడి అధికారాన్ని ప్రశ్నించలేదు. భారత కాలం వచ్చేసరికి ఈ విషయంలో కొంత మార్పు వచ్చింది. అన్నదమ్ముల బిడ్డలు పాండవులూ, కౌరవులూ రాజ్యాన్ని పంచుకున్నారు. రాజ్యంపై అన్నదమ్ములైన ధృతరాష్ట్రుడికీ పాండురాజుకీ ఇద్దరికీ హక్కున్నదని పాండవుల అభిప్రాయం. ధృతరాష్ట్రుడికే హక్కున్నదని కౌరవుల అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల మధ్య ఘర్షణే మహాభారతం. ఒకప్పుడు పెద్ద కుమారుడికే ఉన్న ఆస్తి హక్కు కాలక్రమంలో కొడుకులందరికీ సమానంగా వర్తించింది. ఇవాల్టికి స్త్రీల ఆస్తి హక్కును కూడా గుర్తిస్తున్నాం. అంటే కొడుకులతో పాటు కూతుళ్లకూ, ఆస్తి హక్కుండాలనే విషయాన్ని గ్రహించాం. ఇలా ఆస్తి హక్కులో వచ్చిన పరిణామాన్ని ఆయా కాలాల సాహిత్యం ప్రతిబింబిస్తుంది. ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆస్తి హక్కుపై నియంత్రణ పెట్టాలని ప్రయత్నించింది. ఓట్ల కోసమైనా సరే. ల్యాండ్ సీలింగ్ చట్టం దాని ఫలితమే. మార్క్స్ చెప్పిన దాని ప్రకారం సోషలిస్టు వ్యవస్థ కొంతమేరకు వ్యక్తిగత ఆస్తిని అంగీకరిస్తుంది గాని, ఆస్తిని పెంచుకునే అవకాశాన్ని రద్దు చేస్తుంది. మార్క్స్ ఊహించిన ఉన్నతమైన కమ్యూనిస్టు వ్యవస్థలో అసలు ఆస్తి హక్కే రద్దవుతుంది. ఇలా అర్ధం చేసుకున్నప్పుడు రామాయణ కాలం నుండి ఆస్తి హక్కులో వచ్చిన మార్పులు అభివృద్ధికరమైనవే అని తెలుస్తుంది. అందుకే 'మంచి గతమున కొంచెమే నన్నాడు గురజాడ.
ప్రాచీన కాలంలో కూడా సాహిత్యాన్ని నన్నయలూ, తిక్కనలూ, పోతనలూ, పెద్దనలూ మొదలైన ప్రతిష్ఠ గల కవులలోనే మనం చూస్తున్నాం తప్ప ఇతర ప్రజా సాహిత్యాన్ని చూడగలిగి శక్తి ఇంకా మనకు రావలసే ఉంది. ప్రజల జీవితమూ, సామాజిక విలువలూ కొంతవరకైనా కనిపించే జానపద పాటలను గానీ, శతక సాహిత్యాన్ని గానీ, జీవితాన్ని ఆపోశన పట్టినట్టు కనిపించే ప్రజల సామెతలను గానీ మనం సాహిత్యంగా చూర్ణం లేదు. సాహిత్యాన్ని అర్ధం చేసుకునే పద్ధతిలో ఈ అశాస్త్రీయమైన వారసత్వమే ఇంకా మనల్ని పట్టి పీడిస్తున్నందు వల్ల సాహిత్యంలో కూడా వ్యక్తి పూజ (Hero worship) ప్రాధాన్యం వహిస్తోంది. అందువల్లనే నేటి సాహిత్య యుగంలో కూడా కొద్దిమంది మహాకవులనే గుర్తిస్తాం తప్ప మొత్తం  కవిత్వాన్ని దాని ప్రభావాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇవాళ గొప్ప కవిత్వం కొద్ది మంది వ్యక్తులకే పరిమితం కాదు. అనామకంగా ఉండిపోతున్న ఎందరో కవులు గొప్ప కవిత్వాన్ని చెప్పిన వాళ్లున్నారు. చెప్తున్న వాళ్లున్నారు.

ఈ ఆస్తి నాది అనుకున్నట్టు గానే, ఈ కవిత్వం నాది అనుకునే వ్యవస్థలోనే ఉన్నాం గదా ? కాబట్టి కవిత్వాన్ని వ్యక్తుల పరంగాచూసే దృష్టి అంత సులభంగా పోదు. వ్యక్తుల వద్ద పోగుపడివున్న ఆస్తిని మందికి విస్తరింప జెయ్యడమే ఆస్తి విషయంలో నిజమైన ప్రజాస్వామికీకరణ. అలాగే కవిత్వం కూడా కొద్దిమంది వ్యక్తులలోనే కేంద్రీకృతం కాకుండా అనేక మందిలో విస్తరించడం, దాన్ని మనం గుర్తించగలగడం కవిత్వంలో ప్రజాస్వామికీకరణ. కాబట్టి సాహిత్యాన్ని అధ్యయనం చేసేపద్ధతుల్ని శాస్త్రీయంగా, హేతుబద్ధంగా రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

____  వి. చెంచయ్య
(సాహిత్య దృక్పథం,2000 నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు