శత్రువు ఒకడుండాలె!
శత్రువు ఒకడుండాలె!
కాలం నదిలో
నీ ఎదురీతను చూసి నవ్వడానికి
శత్రువు ఒకడుండాలె!
అపుడే నీవు గమ్యం చేరగలవు!
గుడ్డుపైన కోడిపెట్ట పొదిగితేనే
కోడిపిల్ల బయటికొచ్చినట్టు
నీ గుండెపైన శత్రువుమాట
గుదిబండలా మారితేనే
ఏ నిద్రపట్టని రాత్రో
ఓ వెలుగుగెలుపుకిరణం నీలో తళుక్కుమంటుంది!
మాటలపువ్వులు నీపై విసిరేవాళ్ళంతా మంచి మిత్రులనుకోకు!
పూలవెనుక ముళ్ళున్నట్టే మిత్రులముసుగులో శత్రువులుంటారు!
నీ శత్రువు ఎవరోకాదు
ఒకప్పటి నీ మిత్రుడే!
చిన్నబండను చూసి కుక్క
మొరగదు కదా!
అది పెద్ద కొండను చూసే
ఊరికే అలా మొరుగుతుంటుంది!
అకారణ ద్వేషంతో నిన్ను ఎవడైనా నిందిస్తున్నాడు అంటే
నీ ఎదుగుదలే వాడి మానసిక అశాంతికి కారణమై ఉంటుంది!
వాడు శత్రురూపంలో ఉన్న మిత్రుడే అన్న మాట!
పాపం వాడు తన విలువైనకాలమంతా నీ గురించే ఆలోచిస్తున్నాడంటే... నీకర్తవ్యపు నెగళ్ళను ఎగదోస్తూ
నిన్నో మండే సూర్యుడిని చేస్తున్నాడన్నమాట!
ముళ్ళకంచె లేకుంటే
పూలతీగ ఎలా పైకెగబ్రాకుతుంది?
ఎవడు ఏ రంగంలో ఎదగాలన్నా
వాడికో శత్రువుండాలి సుమా!
గాలి ఎక్కువైన టైర్ ప్రేలిపోతుంది
ఏది ఎక్కువైనా మనిషి కూలిపోతాడు!
టైరులో ఎంతగాలి ఉండాలో
మెకానిక్ కు తెలుసు!
నీకేమిచ్చి బతుకుచక్రం తిప్పాలో పైవాడికి తెలుసు!
నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించేమిత్రునికన్నా
నిన్ను ద్వేషించే శత్రువే నయం!
వాడి ద్వేషం నీగుండెబెలూన్ లో పౌరుషపు ఆక్సిజన్ గా మారి
నీమనోబలం రెట్టింపు శక్తితో పైకెగురుతుంది!
పై పైకెదుగుతుంది!
ఎంత ఎక్కువమంది శ్రువులుంటే
నువ్వు అంత జాగ్రత్తపడుతూ శక్తిమంతుడివై పోతావు!
రావణుడే లేకపోతే రాముడు దేవుడైపోయేవాడా?
శత్రువులేకుంటే నీవు
మైకులేని స్పీకర్ లా మిగిలిపోయేవాడివి!
నీ ఓటమికి కారణం ఎరనుకుంటావు?
నీ మనసుశత్రువే!
నీ దేహం కూడా నీ శత్రువే!
ఎద్దుకు ముకుతాడువేసి లొంగదీసుకొన్నట్టు...నీపై కోరికలవల విసిరేసి నిన్నో పిచ్చివాణ్ణిచేసి నీ మనసు లొంగదీసుకుంటుంది!
శత్రువు నీలోనే ఉన్నాడని గుర్తించడమే ఎరుక!
అడుగడుగునా శత్రువులుంటేనే
నీది సరైన నడక!
ఈతనేర్చినవాడిని బావినీళ్ళెలా ముంచేస్తాయి?
కష్టాలకు భయపడనివారిని కన్నీళ్ళేం చేస్తాయి?
లోతుగురించి ఆలోచిస్తే నదినీళ్ళలో దూకలేవు!
శత్రువుగురించి ఆలోచించకుండా ముందుకు సాగిపోవడమే
నీ ధైర్యపునడక!
అదే జీవితపు ప్రతిమలుపులో గెలుపు పతాక!
మేఘం చినుకై వర్షించే ముందు
ఆకాశాన్ని ఉరుములు మెరుపులు భయపెట్టినట్టే...
నీ జీవితం కలలను స్వప్నించి సాకారం చేసుకునేవేళ
శత్రువులు గర్జిస్తూనే ఉంటారు!
తాటాకు మంటల్లా మెరుస్తూనే ఉంటారు?
తిమింగలాలు మింగేస్తాయని
పడవ భయపడి ముందుకుసాగి పోకుండా ఉంటుందా?
జీవితం కూడా ఓ పడవే!
నీ శత్రువే తిమింగలం!
కాలమే సముద్రం!
తీరం చేరడమే నీ
సాహస పయనం!
ధైర్యమే విజయరహస్యం!
కవిత్వమైనా...వ్యక్తిత్వమైనా
భాస్వరం లా మండి వెలగాలంటే
అగ్గిపుల్లగీసేసే ఓ అదృశ్యపుచేయి ఉండాలి!
నీకైనా..నా కైనా...
ఒక శత్రువు ఉండాలె!
-కళారత్న డా.బిక్కికృష్ణ
సెల్ :8374439053
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి