కథలు రాయటం ఎలా?


'కథలు రాయటం ఎలా? అన్న ప్రశ్నకు సరియిన సమాధానము: నేనెలా కథలు రాశానోచెప్పటమే అనుకుంటాను.

ప్రతి మనిషి జీవితంలో 'ఈ అనుభవం ఆధారంతో ఓ కథ రాస్తే బావుండును అనుకునే క్షణాలు ఎన్నో ఉంటాయి. అయితే చాలామంది అలా అనుకోవటంతోటే ఆగిపోతారు. వారిలో కొద్దిమంది మాత్రమే నిజంగా కథలు రాస్తారు. ఇంకా కొద్దిమంది మాత్రమే తాము రాసిన కథల్ని ప్రచురించుకోగల్గుతారు.

కథ రాయాలని ఎప్పుడనిపిస్తుంది? ఎందుకనిపిస్తుంది? అన్న అంశాన్ని పరిశీ భించాలి. ఎందుకంటే ఏ గొప్ప కథకైనా కథ రాయాలని ఓ కథకుడికి అనిపించటంతోటే బీజం పడ్తుంది.

ఏదైనా ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. లేదా ఓ అసాధారణ వ్యక్తి కనిపిస్తాడు. వీటిని కొందరు ప్రత్యక్షంగా చూస్తారు. కొందరు పక్కవాళ్ళు చెప్పుగా వింటారు. కొందరు పత్రికల్లో చదువుతారు. ఆ సంఘటన పట్ల లేక ఆ వ్యక్తిపట్ల ఒక్కొక్కరూ ఒక్కొన్న రకంగా స్పందిస్తారు. ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవాళ్ళు దానిని గూర్చి ఇతరులకు చెబుతున్నప్పుడే అదొక కథగా మారుతుంది. ఎవరూ తాము చూసిన సంఘటనను పూర్తిగా జరిగింది జరిగినట్టుగా చెప్పరు. ఆ చెప్పటంలో తమదైన వ్యక్తిత్వాన్ని కొంత జోడిస్తారు. ఆ సంఘటన అలా జరగటానికి కారణాలేమిటో, అందులో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో. వ్యాఖ్యానిస్తారు. తన ఊహాబలంతో ఆ సంఘటనను విశ్లేషించటానికి ప్రయత్నిస్తారు. చెప్పే విషయాన్ని వినేవాడికి సాధ్యమైనంత ఆసక్తిదాయకంగా ఉండేటట్టుగా మార్చి చెప్పటానికి ప్రయత్నిస్తారు. ఆ సంఘటన ద్వారా తాము తెలుసుకున్న ఏదో ఒక జీవిత సత్యాన్ని కూడా వివరిస్తారు.

సరిగ్గా కథకుడు చేసే పనికూడా ఇదే. తను చూసిన వ్యక్తుల్ని గానీ లేదా సంఘటనల్నిగానీ తన కల్పనా శక్తితో కథలుగా మలచటానికి కృషి చేస్తాడు. చదివే వాళ్ళకు ఎక్కడా విసుగు కల్గకుండా, తను చెప్పబోతున్న దాన్ని వాళ్ళు ముందే ఊహించకుండా జాగ్రత్తపడ్తాడు. తమ రాసిన కథ ద్వారా ఏదో ఒక జీవిత వాస్తవాన్ని ఆవిష్కరించటానిక్కూడా ప్రయత్నిస్తాడు.

కాబట్టి కథకు ముడిసరుకు జీవితమే ఎంతో వైవిధ్యంతో కూడుకున్న మానవుల ప్రవర్తనే రాయగల్గిన శక్తి, ఓపికా ఉంటే అందరూ కథలు రాస్తారు. రాయగల్గిన శక్తిలేని వాళ్ళు కనీసం కథలు చెబుతారు. తన జీవితంలో గానీ లేదా తమ పక్కవాళ్ళ జీవితంలో గానీ జరిగిన సంఘటనల్ని ఒక వరస క్రమంలో తమ స్నేహితులకో, బంధువులకో ఎప్పుడో అప్పుడు అందరూ చెబుతారు. కాబట్టి కథలు చెప్పని వారంటూ ఎవరూ ఉండరు. కాకపోతే కలంపట్టి కథలు రాయటం మాత్రం అందరూ చెయ్యలేదు.

కలంపట్టి రాయటానికి ప్రతిభావ్యుత్పత్తులు మాత్రమే సరిపోవు. కఠోరమైన శారీరక శ్రమ చెయ్యటానికి కావలసిన శక్తి, ఓపికా కావాలి. అందుకే ఎంతో నేర్పుగా నోటితో కథలు చెప్పేవాళ్ళను ఒకచోట కూర్చొని తాము చెప్పినదాన్నే యధాతధంగా రాయమంటే రాయలేదు. ఇందుకు కారణం భాష రాకపోవటం, కల్పనాశక్తి లేకపోవటం అని చెప్పటానికి వీల్లేదు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు పుష్కలంగా కనిపిస్తాయి. ఇందుకు కారణం ఒకటే. రాయటం మాట్లాడినంత సులభం కాదు. రాయటం అనేది బుర్రతో మాత్రమే చేసేపనికాదు. చేతితో చేసేపని ఐదారుగంటలు స్తిమితంగా ఒకచోట కూర్చొని రాయటం ఎంతో శారీరక శ్రమతో కూడుకున్నపని. కవితా ఖండికలు రాసెయ్యగలడు. కానీ కథ రాయటం కవితా ఖండిక రాసినంత సులభం కాదు. ఐదారుగంటలు రాయటం-మొదటిసారి రాసింది సంతృప్తికరంగా లేకపోతే మళ్ళీ ఐదారుగంటలు కూర్చొని రెండోసారి రాయటం-కొన్నిసార్లు మూడవసారి కూడా రాయటం-ఇది అందరికీ చేతనయ్యే పనికాదు. కాబట్టి కొంత కఠినమైన భౌతిక శ్రమకూడా చెయ్యగల్గిన వాడే కథలు రాయగలదు.

కథలు రాయటానికి కావలసిన ఒక ప్రాథమికమైన అవసరం ఏమిటంటే కథకుడిలో కథలు రాయాలన్న ఒక సహజమైన తపన, పట్టుదల ఉండటం. ఏదన్నా రాయాలని ఎవరికైనా ఎందుకనిపిస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఓ భావకవి అన్నట్టుగా కోకిలకు కూయాలని ఎందుకనిపిస్తుంది? మేఘానికి వర్షించాలని ఎందుకనిపిస్తుంది? అని చెప్పటమే ఈ రాయాలన్నది, కొత్తగా ఏదో చెప్పాలన్నది కొంతమందిలో చాలా ప్రగాఢంగా ఉంటుంది. అలా చెప్పటం ద్వారా సాహిత్యాన్ని, తద్వారా సమాజాన్ని కొంత మరమ్మత్తు చేస్తున్నామని వాళ్ళనుకుంటారు.

అయితే కథకుడు కావటానికి ఈ రాయాలన్న తహతహ ఒక్కటే సరిపోదు. ఇంతకుముందే చెప్పినట్టుగా రాయటాన్నొక కఠోరపరిశ్రమగా స్వీకరించి గంటలకు గంటలు ఈ రాయటం మీద తన శక్తినంతా కేంద్రీకరించగల్గ ఓపికా, పట్టుదలకూడా కథకుడికి కావాలి. వీటితోబాటు పరిస్థితులు కూడా అనుకూలించాలి. తను ఎంతో శ్రమించి రచించిన కథ ప్రచురించబడి, దాన్ని పదిమందీ చదివి దానిలోని గొప్పతనాన్ని గుర్తిస్తే ఆ కథకుడు ఇంకా ఎన్నో మంచి కథలు రాయగల్గుతాడు. నిజమయిన రచయిత అయిన వాడెవ్వడూ తన రచనలు ప్రచురించబడ్తున్నాయా? లేదా? అన్న విషయానికి ఏ మాత్రం కూడా ప్రాముఖ్యం ఇవ్వకూడదని కొందరు విమర్శకులు అంటూ వుంటారు. కానీ నేనీవాదనను అంగీకరించలేను. తాను పడ్డ శ్రమకు ఎంతో కొంత పారితోషికం లభించాలని ప్రతివ్యక్తీ ఆశిస్తాడు. రచయిత దీనికి అతీతుడు కాడు. అయితే రచయిత ఆశించే పారితోషికం డబ్బు కాదు. తన రచనను పదిమందీ చదివి బావుందనో, బాగాలేదనో అనుకోవటమే రచయిత ఆశించే పారితోషికము, రచించిన కథలన్నీ తిరిగొస్తోంటే ఏ కథకుడు కూడా తనలోని కథకుడిని సజీవంగా కాపాడుకోలేదు. నిజమైన ప్రతిభ ఏనాటికైనా గుర్తించబడుతుందన్న వాదన మీదకూడా నాకు నమ్మకంలేదు. సకాలంలో గుర్తింపు పొందని ప్రతిభ అణగారిపోతుంది.

ఇక కథ అనేది ఎలా రూపొందుతుందో చూద్దాం.
వాస్తవ జీవితంలోని ఏదో ఒక సంఘటన లేదా ఎవరో ఒక వ్యక్తి లేదా రచయితలో కల్గిన ఏదో ఒక భావం, లేదా ఏదో ఒక ఆలోచన కథగా రూపకల్పన చెందుతుంది. ఉదాహరణకు నేను రాసిన మొదటికథ ఎలా రూపొందిందో చెబుతాను.

నేను వరంగల్ పి.యు.సి. చదువుతున్న రోజులు. ఒకరోజు అర్థరాత్రి దాటాక సెకండ్ సినిమా చూసి రిక్షాలో వరంగల్ నుండి నేనుంటున్న హనుమకొండకు వెళ్తున్నాను. వరంగలకూ హనుమకొండకు మధ్య ఉన్న బ్రిడ్జి ఎక్కుతూ రిక్షా అతడు ఆకస్మాత్తుగా కిందపడిపోయాడు. రిక్షా కొంతదూరం వెనక్కి వచ్చి ఆగిపోయింది. నేను వెంటనే రిక్షా దిగి అతని దగ్గరకు వెళ్ళి చూశాను. అతని దగ్గర్నుండి విపరీతమైన సారాయి వాసన వస్తోంది. అతడు స్పృహతప్పిపోయాడని అర్థమైంది. అతడప్పుడు లేపినా లేవడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అతన్నలాగే వదిలేసి నడుచుకుంటూ నేను నా గదికి చేరుకున్నాను. నా రాత్రంతా నిద్రపట్టలేదు. ఈ సంఘటన ఆధారంగా ఓ కథ రాయాలనిపించింది. రాత్రంతా ఆలోచించాక ఆ కథకొక స్వరూపం ఏర్పడింది. ఇది జరిగిన ఆరుమాసాల తర్వాత ఈ సంఘటన ఆధారంగా "చితికిన జీవితం" అనే కథ రాశాను. ఆ రిక్షావాడు ఎందుకు తాగుడుకు బానిసై పోయాడు అన్న ప్రశ్ననన్ను వేధించింది.

బహుశా అతన్నెవరో చాలా ఘోరంగా వంచించారు. పల్లెటూర్లో బతకలేక పట్నానికి వచ్చి ఉంటాడు. పట్నంలో రిక్షా తొక్కుతూ ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడగల్గాడు.

సరిగ్గా అప్పుడే అతనికి అతడుంటున్న ప్రాంతంలోనే ఉంటున్న ఓ అమ్మాయితో
పరిచయమైంది. ఆ అమ్మాయిని ప్రేమించాడు పెళ్ళి కూడా చేసుకున్నాడు. కానీ ఆమె అతన్ని
మోసం చేసింది. బాగా సంపాదించలేక పోతున్నావని, తన కోరికల్ని తీర్చలేక పోతున్నావని అతన్ని నిందించి అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇతడు భగ్న ప్రేమికుడయ్యాడు. పూర్తిగా ఒంటరివాడైపోయి తాగుడుకు బానిసై పోయాడు. తాగితాగి చివరకు ఓప్రమాదకరమైన
వ్యాధికి గురై చనిపోయాడు. ఇదీ కథ.
ఈ కథలో పెద్ద కొత్తదనమేమీ లేదు. అప్పట్లో నేను చూసిన సినిమాలు, చదివిన కొన్ని నవలలు, కథలు నా ఆలోచనల్ని ప్రభావితం చేశాయి. అయితే ఈ కథను నేను. చెప్పిన పద్ధతి మాత్రం ఈ కథను చదివిన చాలా మందిని ఆకర్షించింది. ఈ కథను నేనుస్వయంగా నేను నా కళ్ళతో చూస్తున్నట్టుగా 'నేను' అంటూ ఉత్తమపురుషలో చెప్పాను. "నేను ఆ రోజు వరంగల్కు సెకండో సినిమా చూడటానికి వెళ్ళానంటూ” కథ మొదలెట్టాను. సినిమా అయిపోయాక రిక్షా మాట్లాడుకొని హనుమకొండకు వస్తోంటే తాగిన మత్తులో రిక్షా అతడు స్పృహ తప్పి పడిపోయాడని, అతన్ని తీసికెళ్ళి ఆసుపత్రిలో చేర్పించానని, అప్పటికే అతనిలో జబ్బు ముదిరిపోయి ఆ మర్నాడు చనిపోయాడని, అతన్ని గూర్చి అతనితోడి రిక్షావాళ్ళను అడిగినప్పుడు అతని గత జీవితాన్ని గూర్చి చెప్పారని - ఇలా కథను నడిపించాను. ఈ కథ చదివిన చాలా మందికి ఈ కథలో చెప్పిన విషయాలన్నీ నిజంగానే
జరిగాయన్న భ్రమ కల్గింది. కథ మొదలెట్టగానే చకచకా చదివించేసింది. 'చితికిన జీవితం' అన్న ఈ కథకు రూపకల్పన ఎలా జరిగిందో పరిశీలిస్తే మూడు అంశాలు స్పష్టంగా అర్థమవుతాయి. మొదటిది: కథకు వస్తువును ఎన్నుకోవటం. కథకుడు తన అనుభవంలోంచిగానీ లేదా తనకు చాలా దగ్గరివాళ్ళయిన వారి అనుభవంలోంచి గానీ కథా వస్తువును ఎన్నుకోవాలి. అలా ఎన్నుకున్న కథావస్తువు కొంతకాలం అతని చేతనలో నలుగుతూ ఉండాలి. ఆ అనుభవం పూర్తిగా తనదై పోయేంత వరకు అలా నలుగుతూనే ఉండాలి.

రెండవది తన అనుభవంలో యధార్థంగా జరిగిన సంఘటనకు రచయిత కల్పనాశక్తిని జోడించి దాన్నొక సంపూర్ణమైన కథారూపంలో దర్శించటం. అదొక చిన్న సంఘటన కావొచ్చు-లేదా ఒక అసాధారణ సంఘటన కావొచ్చు. విచిత్రంగా ప్రవర్తించే ఓ స్త్రీగానీ పురుషుడుగానీ కావొచ్చు. మామూలు వాళ్ళ దృష్టిలో ఆ సంఘటనలో ఎలాంటి విశేషంగానీ, ప్రత్యేకతగానీ లేకపోవచ్చు. కానీ కథకుడి మనస్తత్వం కల్గిన వాళ్ళకు దాంట్లోంచి ఒక మంచికథను రూపొందించుకోవచ్చునన్న భావన కల్గుతుంది. ఇలాంటి సంఘటనల్ని కథకుడైనవాడు తన మనస్సులో ఓ మూల భద్రంగా దాచుకుంటాడు. అది అతని మనసులోనలిగి నలిగి పూర్తిగా అతని స్వంతమైపోతుంది. దాన్నొక కథగా దర్శిస్తాడు. అప్పుడతని మనసులో ఎన్నో పాత్రలు, ఎన్నో సన్నివేశాలు, ఎన్నో వర్ణనలు, ఎన్నో సంభాషణలు, ఎన్నో వ్యాఖ్యానాలు పుంఖాను పుంఖానులుగా చోటుచేసుకుంటాయి.

మూడవది కథచెప్పే పద్ధతి. దీన్నే శిల్పం అంటారు. శిల్పం ద్వారా రచయిత సాధించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. తన కథను పాఠకుల చేత ఎక్కడా విసుగులేకుండా చదివించటానికి శిల్పం ఒక ముఖ్యమైన సాధనం. కథను ప్రారంభించటం-దీన్నే ఎత్తుగడ అంటారు పాత్రల్ని పరిచయం చెయ్యటం, పాత్రల మధ్య జరిగే సంభాషణల ద్వారా కథను ముందుకు తీసికెళ్ళటం, యథోచిత పరిసరాలను, వాతావరణాన్ని సృష్టించడం, కథను ముగించటం-ఇవన్నీ శిల్పంలోని అంతర్భాగాలే పైన నేను వివరించిన సంఘటన ఆధారంగా నేను రాసిన కథలో ప్రధాన పాత్ర.

రిక్షా అతడు. కానీ ఆ కథ రిక్షా అతడితో ప్రారంభంకాదు. "సెకండో సినిమా చూద్దామని వరంగల్ కెళ్ళాను. సినిమా అయిపోయేటప్పటికి అర్ధరాత్రి దాటింది. ఓ రిక్షా మాట్లాడుకొని. హనుమకొండకు బయల్దేరాను... "కథ ఇలా ప్రారంభమౌతుంది. కథంతా నేనే నా కళ్ళతో చూసినట్టుగా రాశాను. ఆ రిక్షా అతడి గతాన్ని అతనికి బాగా తెలిసిన అతడి తోడి రిక్షావాళ్ళు నాకు చెప్పినట్టుగా చెప్పించాను. కథను ఇలా 'నేను' ద్వారా చెప్పించటంలో ఒక ముఖ్యమైన ప్రయోజనం నెరవేరుతుంది. రచయిత కథనంతా తాను ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా చెప్పొచ్చు. కథను చదువుతున్న పాఠకులకు ఇదంతా రచయిత అనుభవంలో నిజంగా జరిగిందే అన్న భ్రమ కల్గుతుంది. తెలుగు కథల్లో బుచ్చిబాబు ఈ పద్ధతిలో కొన్ని గొప్ప కథలు రాశాడు. ఇంగ్లీషులో అయితే "నేను" అంటూ కథ చెప్పడంలో సోమర్సెట్ మామ్ ఆద్వితీయుడు.

కథకు అత్యంత ప్రాణప్రదమైన గుణం ఇదే: కథ చదుతున్న వాళ్ళకు ఇదంతా నిజంగా జరుగుతున్నది అన్న భ్రమను రచయిత కల్గించాలి. కథను చదువుతున్నంత సేపూ పాఠకుడు ఆ కథలోని పరిసరాలతో, పాత్రలతో, సంఘటనలతో తాదాత్యాన్ని పొందాలి. కథ ఎక్కడా అసహజంగా గానీ, అభూతకల్పనలాగానీ పాఠకుడికి కన్పించకూడదు. దీన్ని రచయిత తనలోని శిల్ప నైపుణ్యం ద్వారానే సాధించగల్గుతాడు.

రచయిత కథకు కావలసిన వస్తువును ఎన్నుకోవటం, దానికి తన కల్పనా శక్తిని జోడించి సంపూర్ణమైన కథా రూపంలో దర్శించడం, అలా దర్శించిన కథను అక్షరాల్లోకి అనువదించటానికి అనువైన శిల్పాన్ని రూపొందించుకోవటం- ప్రతిభావంతుడైన కథకుడు. ఈ మూడింటిని ఒకేసారి సాధించగలడు. ఇందుకు ఉదాహరణగా నేను రాసిన మరో కథను గూర్చిచెబుతాను.

వరంగల్ ఆర్ట్స్ కాలేజిలో చదువుకుంటున్న రోజులు... నల్గురు మగపిల్లలు ఒకచోట చేరారంటే వాళ్ళ సంభాషణ తప్పనిసరిగా ఆడపిల్లల మీదకే మళ్ళుతుండేది. చాలా వరకు అమ్మాయిలను గూర్చి చెడ్డగానే మాట్లాడుతుండేవాళ్ళు. ఫలానా అమ్మాయికి ఫలానా వాడితో సంబంధం ఉందని..... ఫలానా లెక్చరర్ ఫలానా అమ్మాయికేసే ఎప్పుడూ చూస్తుంటాడని..... వాళ్ళిద్దర్నీ ఫలానా లాస్ట్లో చూశానని ఒకడు... ఫలానా గార్డెన్లో చూశానని మరొకడు. ఫలానా సినిమాహాల్లో చూశానని ఇంకొకడు... ఇలా ఒకర్ని మించి ఒకరు చెప్పటానికి ప్రయత్నించేవాళ్ళు. ఇవన్నీ వట్టి పుకార్లేనని అందరికీ తెలుసు. అయినా ఇలాంటి పుకార్లను కొందరు మగపిల్లలు పనిగట్టుకొని ప్రచారం చేసేవాళ్ళు. గోడల మీద రాస్తుండేవాళ్ళు. ఇలాంటివి ఎంత వినకూడదనుకున్నా నేను వింటుండేవాడిని. గోడలమీది రాతల్ని చదవకూడదనుకుంటూనే చదువుతుండేవాడిని. నాలో ఒక సంఘర్షణ: ఆడపిల్లల్ని గూర్చి -నాతోడి మగ పిల్లలు ఎందుకింత అసహ్యంగా మాట్లాడతారు? వీళ్ళకు అక్కా చెల్లెళ్ళు. లేరా? అనుకునే వాడిని....

ఒక రోజు హనుమకొండ చౌరస్తా నుండి నేనుంటున్న నక్కలగుట్ట ప్రాంతానికి సైకిల్ మీద వస్తున్నాను. కొంతదూరం వచ్చాక మెయిన్ రోడ్ మీద నాకు మా కాలేజిలో పనిచేసే ఇంగ్లీషు లెక్చరర్ కనిపించాడు. అతనికి వెనకాలే కొంచెం దూరంలో మా క్లాసులోనే చదివే నళిని అనే అమ్మాయి కూడా కనిపించింది. వాళ్ళిద్దరూ ఒకరి వెనకాలే మరొకరు అలా కనిపించటంతో నా బుర్ర తీక్షణంగా పనిచెయ్యటం మొదలెట్టింది. ఆ రోజుల్లో మా కాలేజిలో ఒక పుకారుండేది. అప్పుడు నేను చూసిన ఆ ఇంగ్లీషు లెక్చరరకూ, నళనికీ సంబంధం ఉందని. మురళి అనే మా క్లాస్మేటొకడు వీళ్ళిద్దర్నీ గూర్చి రకరకాల కథలు చెబుతుండేవాడు. గోడల మీద వీళ్ళిద్దర్నీ గూర్చి నానా చెత్త రాస్తుండే వాడు. నేను వాడి మాటల్ని పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. నళిని చాలా అమాయకురాలనే అనుకునేవాడిని. కానీ ఈరోజు ఆ ఇంగ్లీషు లెక్చరరు, నళినిని పక్కపక్కనే చూసేటప్పటికి మురళి చెప్పేదంతా నిజమేనేమొ అనిపించింది. వెంటనే మురళి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి "నువ్వు చెప్పింది. నిజమేరా! నేను వాళ్ళిద్దర్ని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా చూశాను" అని చెప్పాలనిపించింది. మళ్ళీ నాలో నేనే "ఇదేమిటి? నేనింత ఘోరంగా ఆలోచిస్తున్నానేమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను చూసింది వాళ్ళిద్దరూ చెట్టపట్టాలేసుకొని నడుస్తుండగా. కాదు. ఇద్దరి మధ్య చాలా ఎడముంది. వాళ్ళిద్దరూ అక్కడలా ఒకరి వెనకాలే మరొకరు కనిపించటం కేవలం యాదృచ్ఛికం కావచ్చు. అయినా నేనూ అందరిలాగే చాలా చిన్న విషయాన్ని గోరంతల్ని కొండంతలు చేసి ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నానని అర్ధం చేసుకున్నాను. ఆరంభయౌవనంలోకి ప్రవేశిస్తున్న మగపిల్లలు ఆడపిల్లలపట్ల ఇలా ప్రవర్తించటానికి కారణం ఈర్ష్య అనిపించింది. నేను పొందలేనిదాన్ని ఆ ఇంగ్లీషు లెక్చరర్ పొందుతున్నాడన్న జెలసీ నన్నలా ఆలోచించేట్టు చేసిందనుకున్నాను.

చాలా రోజుల వరకు నేనీ సంఘటనను గూర్చి ఆలోచించాను. ముఖ్యంగా ఈ సంఘటన ఆధారంగా నన్ను నేను తీవ్రంగా విశ్లేషించుకోవటం మొదలెట్టాను. అప్పుడే చదువుతున్న ఫ్రాయిడ్ మనో విశ్లేషణా సిద్ధాంతాలు కూడా నన్ను చాలా ప్రభావితం చేశాయి. ప్రతి మనిషిలోనూ అథోలోకం అనేదొకటుంటుంది. దాన్నే ఫ్రాయిడ్ సుప్తచేతన అంటాడు. సుప్తచేతనలో చాలా భయంకరమైన శక్తులు విహరిస్తూ ఉంటాయి. మనిషి వాటిని ఎంత అణచుకోవాలని ప్రయత్నించినా అవి ఒక్కొక్కసారి బయటపడ్తూనే ఉంటాయి. నా అధోలోకంలోని అలాంటి శక్తులే ఇంగ్లీషు లెక్చరరు, నళినిని ఒకచోట చూసినప్పుడు బయటపడ్డాయని అర్థమైంది. ఈ సంఘటన జరిగిన దాదాపు రెండేళ్ళ తర్వాత నేను ''అధోలోకం' అనే కథ రాశాను. నేను ఈ కథను మామూలు పద్ధతిలో కాకుండా 'చైతన్య స్రవంతి' అనే ఒక వినూత్నమైన శిల్ప పద్ధతిలో రాశాను. ఈసంఘటన ఆధారంగా ఒక కథ రాయలనిపించటం, మానసిక విశ్లేషణ ప్రధానంగా సాగే ఈ కథను చైతన్య స్రవంతి శిల్ప పద్ధతిలో రాయాలనిపించటం ఒకేసారి జరిగాయి.

ఈ కథంతా ఈ కథలోని ప్రధానపాత్ర బుర్రలోనే జరుగుతుంది. రచయిత పాత్రల్ని పరిచయం చెయ్యటంగానీ, పరిసరాల్ని వర్ణించటంగానీ, సన్నివేశాల్ని కల్పించటంగానీ ఇవేవీ ఈ కథలో ఉండవు. కథా కేంద్రం ప్రధానపాత్ర మేధస్సీ, ఇలాంటి ఒక వృత్తాన్ని కథగా మలచటానికి చైతన్య స్రవంతి శిల్పం చాలా అనుగుణంగా ఉంటుందనిపించింది. చైతన్య స్రవంతి శిల్పం అనేది పాత్రల బుర్రలో మెదిలే అనేక రకాలయిన ఆలోచనల్ని, స్కృతుల్ని, వికారాల్ని చిత్రించే ఒక వినూత్న రచనా పద్ధతి. కాబట్టి వస్తువూ, శిల్పమూ అనేవి పూర్తిగా వేర్వేరు ప్రక్రియలు కావు. మనం ఎన్నుకున్న వస్తువును బట్టే శిల్పం కూడా. నిర్ణయమౌతుంది. చెప్పదల్చుకున్న విషయాన్ని ఎలా చెబితే పటిష్టంగా ఉంటుందో నిర్ణయించుకొని అలా చెప్పటంలోనే ఒక కథకుడి ప్రతిభ వ్యక్తమౌతుంది.

బుచ్చిబాబు అన్నట్టు బాహ్య జగత్తులోని సంఘటనలేకాక కొందరు వ్యక్తులు కూడా. కథల్ని ప్రేరేపిస్తారు. ఒక్కచూపు, ఒక్కమాట, కంఠంలో ధ్వని, నడిచిన విధం వీటిల్లో
ఏదన్నా ఆకర్షించి, కూతూహలాన్ని రేకెత్తించి కథకు పురికొల్పటం నాకు చాలాసార్లు అనుభవమే.

నేను నల్గొండలో పనిచేసే రోజుల్లో నేను పనిచేస్తున్న కాలేజి ఆఫీసులో ఓ క్లర్కు ఉండేవాడు. ఎప్పుడు చూసినా నిద్రపోతూ కనిపించేవాడు. ఏ పని కూడా ఉత్సాహంగా చేసేవాడు కాడు. అతడు చెయ్యాల్సిన పనుల్ని అతని పక్కవాళ్ళే చేస్తుండేవాళ్ళు. అప్పుడున్న ప్రిన్సిపాల్ కూడా అతని కేమీ పనిచెప్పేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత ఆ కాలేజిలో ఓ పెద్ద మార్పు జరిగింది-ఏమీ పట్టించుకోని ప్రిన్సిపాల్ ట్రాన్స్ఫర్ అయిపోయి అన్నీ పట్టించుకునే ఓ టాస్క్ మాస్టర్ ప్రిన్సిపాల్ గా వచ్చాడు. ఈ కొత్త ప్రిన్సిపాల్ దృష్టి వెంటనే ఈ నిద్రపోతుండే క్లర్క్ మీదపడింది. అతనితో కూడా పనిచేయించాలని కొత్తప్రిన్సిపాల్ తీవ్రంగా ప్రయత్నించాడు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఆ సంఘర్షణ నన్ను చాలా ఉత్తేజితుడ్ని చేసింది. పాపం ఆ క్లర్క్ ఈ కొత్త ప్రిన్సపాల్ ధాటికి తట్టుకోలేకపోయాడు.

ఈ ఆధారంతో నేను 'హత్య' అనే కథ రాశాను. ఆ క్లర్ను ఆఫీసులో టేబుల్మీద తల పెట్టి నిద్రపోతున్న దృశ్యాన్ని చూసిన క్షణంలోనే నా కతనిమీద కథ రాయాలనిపించింది. అలాగే బుచ్చిబాబు అన్నట్టు 'ఒక్క చూపు' కూడా నన్నో కథ రాయటానికి పురికొల్పింది.

ఓ దగ్గరి మిత్రుడు అమెరికాకు వెళ్ళిపోతున్నాడు. అతడు వెళ్ళిపోయే ముందు అతనితో కొన్ని గంటల్ని సరదాగా గడపటానికి కొందురు మిత్రులం అతడు వెళ్ళటానికి ఒక రోజు ముందుగానే హైదరాబాద్ లోని వాళ్ళింటికి వెళ్ళాం. మా మిత్రులందరికేసి అమెరికాకు వెళ్ళబోతున్న మా మిత్రుడి భార్య ఎంతో గర్వంగా చూసిన ఓ చూపు నా చేత రెండో పెళ్ళి' అనే కథను రాయించింది.

అలాగే 'ఒక్క మాట' నా చేత కథ రాయించిన ఉదంతం కూడా చెబుతాను. ఏదో
పనిమీద విజయవాడకు వెళ్ళి ఓ లాద్లో ఉన్నాను. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో

లాస్ట్లోంచి బయటకొచ్చి రోడ్డు మీద నిల్చున్నాను. చాలా సేపట్నించి నాకేసే చూస్తున్న ఓ వ్యక్తి నా దగ్గర కొచ్చి "మంచి పిల్లుంది, తీసుకురమ్మంటారా సార్!" అన్నాడు. కొన్ని సెకన్ల దాకా అతదేమన్నాదో.

నా కర్ధం కాలేదు. 'అక్కర్లేదు' అంటూ నేను నా రూమ్లో కొచ్చి ఆలోచించటం మొదలెట్టాను. ఆ రాత్రే నా బుర్రలో ఓ కథకు రూప కల్పన జరిగింది. ఇది జరిగిన ఓ సంవత్సరం తర్వాత రాశానాకథ "ఫ్రమ్ అనూరాధ... విత్ లవ్...” 'అన్న పేరుతో.

ఒక్క 'కంఠధ్వని' నా చేత ఓ నవలే రాయించింది. కరీంనగర్ కాలేజిలో పనిచేస్తున్న రోజుల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఓ వక్తృత్వ పోటీ నిర్వహిస్తున్నాను. బోయ్స్ ఎక్కువమంది. ఉన్న ఆ కాలేజిలో గర్ల్స్ ఎవరూ ఇలాంటి పోటీల్లో పాల్గోనే వాళ్ళు కాదు. కానీ ఆ రోజు ఒక అమ్మాయి చాలా ధైర్యంగా నేను ఉపన్యాసం ఇస్తానని ముందుకొచ్చింది. ఆమెను మాట్లాడమన్నాము. ఆమె వేదిక ఎక్కి మైక్ ముందు నిల్చొని మాట్లాడటం మొదలెట్టింది. అంతవరకూ చాలా గందరగోళంగా ఉన్న ఆ హాల్ ఆ అమ్మాయి మాట్లాడటం మొదలెట్టగానే పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. బోయ్స్ అందరూ ఆమె ఏదన్నా పొరపాటు చెయ్యకపోతుందా అన్నట్టుగా అతురతగా ఎదురుచూడసాగారు. కానీ ఆ అమ్మాయి చాలా చక్కని ఇంగ్లీషులో చాలా స్పష్టమైన, శ్రావ్యమైన ఉచ్చారణతో ఎలాంటి జంకూ గొంకూలేకుండా మాట్లాడుతుంటే ఆ హాల్లో ఉన్న ఓ వంద మంది బోయ్స్ నిశ్శబ్దంగా చెవులప్పగించి వినసాగారు. ఆ కాలేజిలో ఓ అమ్మాయి మాట్లాడటం ఎంతో అసాధారణ విషయం... బోయ్స్ ఎంత గోలచేస్తారోనని భయపడ్డ లెక్చరర్లందరూ బోయ్స్ అలా మంత్ర ముగ్ధులైపోయి నిశ్శబ్దంగా మారిపోవటంతో ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఆ అమ్మాయి అలా ఓ ఆరేడు నిముషాలు మాట్లాడిన తర్వాత వెనక సీట్లో కూర్చున్న ఓ అబ్బాయి 'మ్యావ్' అని అచ్చం పిల్లిలా అరిచాడు. అలాంటి అవకాశంకోసమే ఎదురుచూస్తున్న మిగతా బోయ్స్ అందరూ గొల్లున నవ్వారు. అయినా ఆ అమ్మాయి తొణక లేదు-బెణకలేదు. అలాగే మాట్లాడింది. ఈ ఒక్క దృశ్యం ముఖ్యంగా నిశ్శబ్దమైన వాతావరణంలో అతడు 'మ్యావ్' అని అరచినప్పటి అతని కంఠ ధ్వని నన్ను అమితంగా ఉత్తేజితుడ్ని చేసింది. అప్పటి అతని ఆ కంఠ ధ్వనే నన్ను 'సౌజన్య' అనే నవలను రాయటానికి పురికొల్పింది.

కథలు రాయటానికి కావలసిన ప్రాథమిక అంశం ఇదే: బాహ్య ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలతో వ్యక్తులతో కథకుడు ఉత్తేజితుడై పోవటం. వాటిల్లోంచే కథకు కావలసిన ఇతివృత్తాలను ఏరుకోవటం... చాలాకాలం ఆ అనుభవాన్ని తన మనస్సులో భద్రపరచుకొని దానికి తన కల్పనా శక్తిని జోడించి దాన్నొక కథగా మలచటానికి అనువైన కథా కథన పద్ధతిని నిర్ణయించుకోవటంతో ఆ కథ కాగితంమీద ఆవిష్కరించబడాలి.

మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే తను రాస్తున్న కథను ఎందుకు రాస్తున్నాడో, ఆ కథ ద్వారా తనుచెప్పదల్చుకున్న జీవిత సత్యం ఏమిటో కథకుడు నిర్దేశించుకోవాలి. దీన్నే కథలో పాయింట్ ఉండటం అంటారు. దీన్నే కథ యొక్క ప్రయోజనం అని కూడా చెప్పొచ్చు. కథ పూర్తిచేశాక పాఠకుడికి "ఓహో! రచయిత ఈ కథ ద్వారా ఈ విషయం. చెప్పదల్చుకున్నాడన్నమాట!" అని అర్ధం కావాలి. వెంటనే కాకపోయినా కాస్సేపు ఆలోచించాకనయినా పాఠకుడికి రచయిత ఆ కథను ఏ ప్రయోజనాన్ని ఆశించి ఏ జీవిత సత్యాన్ని చెప్పటానికి రాశాడో అర్ధం కావాలి. ఉదాహరణకు 'హత్య' అన్న కథను నేనెందుకు రాశాను? ఆత్మ న్యూనతా భావం ప్రబలంగా ఉన్న ఓ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో చూపించటానికి- 'ఆథోలోకం' అన్న కథను ఎందుకు రాశాను? స్త్రీలమీద పుకార్లను ప్రచారం చేసే మనస్తత్వం చాలా మంది పురుషుల్లో ఎందుకుంటుందో చెప్పటానికి కొన్ని కథల్ని చదివాక చప్పున ఆ కథను రచయిత ఎందుకు రాశాడో వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ చదివి ఆలోచిస్తే అర్ధమౌతుంది. బుచ్చిబాబు రాసిన కొన్ని కథలు చదివిన వెంటనే అర్థం కావు. మళ్ళీ మళ్ళీ చదివి ఆలోచిస్తే అర్థమవుతాయి. అప్పుడు కల్గి ఆనందం నిజంగా వర్ణనాతీతం.

ప్రతి కథలో ఒక సందేశం ఉండాలని నేను చెప్పను. కానీ ప్రతి కథకూ ఒక ఉద్దేశ్యం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కథాగమనమూ కథ ముగింపు ఆ ఉద్దేశాని కనుగుణంగానే ఉండాలి.

(అంపశయ్య నవీన్)
(నవీన్ సాహిత్య వ్యాసాలు నుండి)






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు