అరసవిల్లి



        సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా చాలా ప్రసిద్ధి చెందింది.

ఆలయ విశేషాలు

ఈ దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయాలలో ప్రసిద్ధమైనది. ఇది అరసవల్లి లో ఉంది. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కి.మీ దూరం ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయం. ఇది మన దేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపరయుగం నాటి ఆధారాలు లభిస్తాయి.

*ఆలయ చరిత్ర*

ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరస వల్లి. ఆ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారని కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయం   తొలుత దేవేంద్రుడు నిర్మించాడని పురాణ ప్రవచనం చెపుతోంది.

చారిత్రకంగా పరిశీలిస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాల యాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయాన ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరస వల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం క్రీస్తు శకం 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాధునికి కొంతభూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు. క్రీస్తు శకం 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు.

అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంథం దొరికిందని, అందులో సూర్యదేవుని పూజా విధానాలు ఉన్నాయని వారు మహారాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది.

వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు. క్రీస్తు శకం 1599 లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయా త్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్ గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్ ను ఒక బావిలో పడేశారట. క్రీ.శ.1778 లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్ ను కనుగుని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేసారు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం ఆలుదు గ్రామస్ధులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని (గోపురం) పడ గొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో నిర్మించారు.

 పురాణాల గాథ

        కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడలేక బలరాముడు తీర్థయాత్ర లకు బయలు దేరతాడు.. వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమింఛి మాధవ వనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసిస్తాడు. 
    ఆ సందర్భంలో     కళింగ ప్రాంతంలో కరువు కాటకలు వస్తాయి.ప్రజల   బాధను  చూసి చలించి బలరాముడు  తన ఆయుధమైన హలము (అనగా నాగలి వలన) తో భూమి ని తవ్వి  జలధార వచ్చినట్లుగా చేస్తాడు.  నాగలితో  ఉధ్బవించినది కాబట్టి ఆ నదిని నాగావళి (దీనినే లాంగుల్య నది) అని పిలుస్తున్నారు. 
      నాగావళి నది తీరంలో బలరాముడు ఐదు  శివాలయాలను నిర్మించాడని చెబుతారు.అందులో ఒకటి శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో   ఇంద్రుడు కూడా వస్తాడు. కానీ అప్పటికే చీకటి పడి ఉంటుంది. అప్పుడు నందీశ్వరుడు,శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు అనే  ద్వారపాలకులు  స్వామివారిని దర్శించుటకు ఇది తగు సమయం కాదని చెప్పారు. దీంతో ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగుతాడు. అపుడు నందీశ్వరుడు ఆగ్రహంతో  తన దగ్గర ఉన్న కొమ్ములతొ ఒక విసురు విసురుతాడు. ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడతాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలాన్ని ఇంద్ర పుష్కరిణి అంటారు. 
     ఇంద్రుడు  సూర్యుని ప్రార్థించగా సూర్యుడు "నీవు పడిన చోట నీ వజ్రాయుధముతో త్రవ్వమని" చెపుతాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యని విగ్రహం, ఉష,ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా దొరుకుతాయి. దాంతో ఇంద్రుడు వాటికి దేవాలయమును కట్టిస్తాడు.  అదే ఈ నాటి అరసవెల్లి దేవాలయం. 
     అనంతరం ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శించుకొంటాడు. ఇదీ  అక్కడి  ‌‌‌‌‌‌‌పురాణగాథ.

విశిష్టత
      ‌‌ సూర్యదేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించారు. 
       శ్రీకాకుళం జిల్లాలోని  ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని కూడా సూర్య కిరణాలు తాకుతాయి. 
        అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకుతున్న సందర్భాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు అరసవెల్లికి తరలివస్తారు.   మాములు రోజుల కన్నా  మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది.  ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది. 
   ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబరు 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకించి ఆనందం పరవశులవుతారు భక్తులు.

ఆలయ దర్శన సమయాలు
సర్వదర్శనం,ఇతర కార్యక్రమాలు
ఉదయం 6.00 గం.ల. నుండి 12.30 గం.ల. వరకు
సాయత్రం 3.30 గం.ల. నుండి రాత్రి 8.00 గం. వరకు
సుప్రభాతం - ఉదయం 5 గం.కు
నిత్య అర్చన - ఉదయం 5.30 గం.కు
మహానివేదన - మధ్యాహ్నం 12.30 గం.కు

సేవలు

అష్టోత్తర సేవ
సహస్ర నామార్చన
క్షీరాన్న భోగం : ప్రతి ఆదివారం సాయంత్రం 3.00 లకు
క్షీరాభిషేక సేవ
తిరువీధి సేవ : ప్రతి ఆదివారం సాయంత్రం 6.00 లకు
కళ్యాణ సేవ
సూర్యనమస్కారాలు : ప్రతి ఆదివారం ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు

పండుగలు,ఉత్సవాలు

రథ సప్తమి : ఇది సూర్యనారాయణస్వామి వారి విశేష పర్వదినం.
కళ్యాణోత్సవం: ఇది చైత్ర శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు 6 రోజులు జరుగును.
మహాశివరాత్రి : ఈ రోజున ఈ ఆలయ క్షేత్రపాలకుడైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వరస్వామికి ఈ పర్వదినం రోజున ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేక అభిషేకాలు రాత్రి జరుగుతాయి.
డోలోత్సవం : హోలీ పండగ రోజున సాయంత్రం కామదహనం పండగని జరుపుతారు.

ప్రత్యేకతలు

దేవాలయ ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకలతో ఏడు గుర్రాలతో ప్రక్క పద్మ, ఉష, చాయా దేవేరులతో కూడుకొని ఉంటుంది.
విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులగు పింగళ, దండులతో పాటు సనక సనందాది ౠషుల విగ్రహాలు ఉన్నాయి. సూర్య రథం, కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి.
ప్రతి రథ సప్తమికి సూర్య కిరణాలు మూలవిరాట్ పాదాలపై ప్రసరిస్తాయి. ప్రస్తుత దేవాలయం రథం నమూనాలో చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు.
బయటకు పోవు మార్గ ద్వారం వద్ద ఆలయానికి సంబంధించిన మూడు శాసనాలను నిక్షిప్తం చేసారు.

ఆలయానికి చేరుకొనే మార్గాలు

బస్సు ద్వారా
శ్రీకాకుళం జిల్లా ముఖ్య కేంద్రమైన శ్రీకాకుళానికి అన్ని ప్రాంతాలనుండి విరివిగా బస్సులు లభిస్తాయి. విశాఖపట్నం నుండి ప్రతి 30 నిమిషాలకు నాన్‌స్టాప్ బస్సు సౌకర్యం ఉంది.

రైలు ద్వారా
శ్రీకాకుళానికి సుమారు 13 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇచట అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఆగుతాయి. ఈ రైల్వే స్టేషను నుండి విరివిగా బస్సులు శ్రీకాకుళానికి ఉంటాయి. నేరుగా అరసవిల్లి వద్దకు చేరుకోవచ్చు.

విమానం ద్వారా
శ్రీకాకుళానికి సుమారు 106 కి.మీ దూరంలో విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి బస్సుల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు