స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం



స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం

సమాజంలో లో స్త్రీలు సగభాగం అయినప్పటికీ స్వాతంత్రోద్యమంలో  మహిళల పాత్ర తక్కువగా ఉండేది. 

మహిళలను భాగస్వామ్యం చేయకుండా స్వాతంత్రం సాధించలేమని  నాయకులు గుర్తించారు.దీనికి ఆటంకంగా ఉన్నవి సమాజంలో ఉన్న దురాచారాలు కట్టుబాట్లే నని అర్థం చేసుకున్న నాయకులు సమాజంలో సంస్కరణలకు కట్టారు. ఆర్య సమాజం ,బ్రహ్మ సమాజం మొదలైన సామాజిక సంస్థలు హిందూ ముస్లిం  మతాలలో వున్న మూఢాచారాలను ,కట్టుబాట్లను ఎదిరించాలని అనేక సామాజిక ఉద్యమాలు చేపట్టాయి.హరిజనుల పట్ల వున్న అంటరానితనాన్ని పోగొట్టాలని ప్రచారం చేశారు. స్త్రీ పురుషులు సమానం అన్నారు. దయానంద ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రామకృష్ణ పరమహంస వివేకానంద రాజారామమోహన్ రాయ్ కందుకూరి రఘుపతి వెంకటరత్నం గురజాడ వంటి సంస్కర్తలు స్త్రీ విద్య, బాల్యవివాహాల నిషేధం, సతీసహగమనం, స్త్రీల పునర్వివాహం ,కన్యాశుల్కం రద్దు, వరకట్న నిషేధం వంటి దురాచారాలపై ఉద్యమాన్ని నిర్మించారు .ఈ విషయంలో ఆంగ్లేయుల విద్యా విధానం కూడా తోడ్పడింది.ఈ ఉద్యమాల మూలంగా స్వాతంత్ర్యోద్యమంలో కి చాలామంది యువతీయువకులు అడుగు పెట్టారు. జాతీయ నాయకుల ప్రోత్సాహంతో చాలామంది స్త్రీలు నాయకత్వంలోకి వచ్చారు. అనిబిసెంట్ ,సరోజినీ నాయుడు వంటి మహిళలు కాంగ్రెస్ నాయకులుగా ఎదిగారు.  కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా చాలా మంది స్త్రీలు ముందుకొచ్చారు.

 అరుణా అసఫ్ అలీ, కల్పనా రాయ్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ మొదలైనవారు కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో   చాకలి ఐలమ్మ , మల్లు స్వరాజ్యం లాంటి మహిళలు తుపాకులు వడిసెలు చేతబట్టి  భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు.
         స్వాతంత్రం సాధించాక మన దేశ నాయకుల ఆధ్వర్యంలో   పార్లమెంటును రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు . పార్లమెంటుకు ఎక్కువ భాగం భూస్వాములు పెట్టుబడిదారులు ఎన్నికయ్యారు .వారు తీసుకున్న విధానాల ఫలితంగా స్త్రీలకు అట్టడుగు వర్గాలకు న్యాయం జరగలేదు. అసమానతలు పెరిగాయి. కొద్దిమంది కోటీశ్వరుల చేతుల్లోకి కోట్లాదిఆస్తులు భూస్వాముల చేతుల్లోకి వేల ఎకరాలభూములు  వచ్చాయి. అందరికీ అవసరమైన  విద్య, వైద్యం , తిండి, వసతి చాలామందికి అందని మావిపండుగా మారాయి. మహిళలకు వైద్య సదుపాయాలు అందక ప్రసూతి మరణాలు బాగా పెరిగాయి. చాలామంది మహిళలకు  చదువు దూరమైంది. చదువుకున్న స్త్రీలకు ఉపాధి కరువైంది. మగవాడికి ఇచ్చే కూలి కన్నా స్త్రీలకు ఇచ్చేది తక్కువ. తరతరాల నుంచి వస్తున్న పురుషాధిక్యత  కొనసాగుతోంది. వరకట్న సమస్య తో అమ్మాయి అభిరుచులకు కోరికలకు ఆస్కారం లేకుండా పోయింది. చాలామంది మహిళలు వరకట్న సమస్య కు బలవుతున్నారు.  చాలా మంది ముస్లిం స్త్రీలు భర్తల ద్వారా దగా పడుతున్నారు. ఆడపిల్ల పుడితే శాపం,మగ బిడ్డ పుడితే వరం అనే విధంగా తయారయింది . పున్నామ నరకం నుండి తమను కొడుకు రక్షిస్తాడనే అనే మూఢనమ్మకం ఇంకా సమాజంలో ఉంది. అందుకే అబ్బాయి పుట్టాలని ఇంకా కోరుకుంటున్నారు. హరిజన గిరిజన మహిళలను పూచికపుల్లతో సమానంగా చూస్తున్నారు.

రాజ్యాంగ హక్కులు _మహిళలు

          అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం  మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చింది. 


పురుషాధిక్య సమాజం మాత్రం దీనిని ఇంకా జీర్ణించుకోలేకుండావుంది. సమాజంలో  రాజకీయంగా, కుటుంబపరంగా తీసుకొనే నిర్ణయాలలో మహిళలకు ఎటువంటి భాగస్వామ్యం లేదు. కుటుంబ బాధ్యతలు ఎంత మోస్తున్నా వారి అభిప్రాయాలకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు.సమాన హక్కుల ని ఎంత గొంతు చించుకున్నా మహిళలకు ఇంటా బయట ఎటువంటి అధికారాలు లేకుండా చేస్తున్నారు.    
         పౌష్టికాహారం లేమి కారణంగా రక్తహీనతతో మహిళా వర్గం బాధపడుతోంది .ఇంటి పని తో, బయట పనితో సతమతమవుతోంది శ్రామిక
మహిళ. మహిళలే వంట చేసినా ఆహారాన్ని మగవాడే ఎక్కువభాగం తీసుకోవడం వల్ల ఆమె తక్కువ తీసుకుంటోంది.దాంతో  పోషకాహారం తగ్గి అనేక రోగాలకు గురవుతోంది. ప్రసూతి మరణాలకు,శిశు మరణాలకు ఇది ప్రధాన కారణంగా ఉంది. 2005 ఆరోగ్య  మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం  మగ శిశువుల మరణాలు కన్నా ఆడ శిశు మరణాల సంఖ్య 61 శాతం అధికంగా ఉంది.14 ఏళ్ల లోపు పిల్లలందరికీ విద్య గ్యారెంటీ చేయబడినా, కేవలం 39 శాతం మంది బాలికలు మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. 6 నుండి 17 మధ్య వయసు ఉన్న బాలికల్లో కేవలం 2/3 వంతు బాలికలు మాత్రమే పాఠశాలలకు వెళుతున్నారు. 

దేశవ్యాప్తంగా ఉన్న మహిళల్లో కేవలం 46 శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు.ఇలా చదివిన  అమ్మాయిలకు సరైన ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ భాగం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు వీరు ఉదయం  5 నుంచి 10 వరకు సాయంత్రం 3 నుంచి 6 వరకు పని చేస్తారు .వాళ్ళు ఎంత బాగా పని చేసినా మగవాళ్ళు మాత్రం' ఆడవాళ్ళు బాగా తింటారు .పని మాత్రం చేయరు' అని  అంటుంటారు.25%  మంది మహిళలు పదిహేనేళ్లలోపు వయస్సు లోనే పెళ్లి చేసుకుంటున్నారు .ఈ పెళ్లి చేసుకోవడంలో వారి అభిప్రాయాలకు ఎలాంటి విలువా లేదు. దీనికితోడు వారు గృహహింసకు, దోపిడీకి, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. 2007 తర్వాత మహిళల స్థితిగతుల్లో కొంత మార్పు వచ్చింది. 


1950 లో రిపబ్లిక్ గా మారిన తర్వాత దేశ చరిత్రలో ప్రతిభా పాటిల్  మొట్టమొదటి మహిళారాష్ట్రపతి  అయ్యారు. 

1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో 33 శాతం నుండి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల దాదాపు 14 లక్షల మంది మహిళలు రాజకీయ బాధ్యతలు తీసుకున్నారు.


అలాగే 1996 నుండి  చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఆందోళన చేస్తున్నా దానికి సంబంధించిన బిల్లు ఇంకా పెండింగ్ లోఉంది. 15వ లోక్ సభలో మహిళా ప్రాతినిధ్యం 543 మంది లో 61 ఉండగా రాజ్యసభలో 240 గాను 20మంది మాత్రమే ఉన్నారు. మనకన్నా ఆఫ్రికా దేశాలైన రువాండా, ఉగాండా, సుడాన్ పార్లమెంటుల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది.

ప్రపంచీకరణలో స్త్రీలు

యంత్రాలు కనుగొన్నాక వచ్చిన పరిశ్రమలతో ఉత్పత్తి పెరిగి పెట్టుబడిదారీ విధానం బాగా అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ విధానంలో అన్ని వస్తువులతో పాటు స్త్రీ కూడా ఒక సరుకుగా మారిపోయింది. ఒక డబ్బు సంపాదించే పనిముట్టుగా అయింది.సమాజంలో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగాక డబ్బు స్త్రీ పురుష సంబంధాలను నిర్ణయించే పరిస్థితి వచ్చింది. స్త్రీ పురుష సంబంధాలను వారివురి అభిరుచులు, ఇష్టాయిష్టాలు బట్టి గాక డబ్బులను బట్టి నిర్ణయించి నిర్వహించడం జరుగుతోంది. పెట్టుబడి విస్తరణలో భాగంగా వచ్చిన ప్రపంచీకరణ మహిళలు పురుషుల లైంగిక అవసరాలను తీర్చే సరుకులుగా, ఉత్పత్తుల ప్రచార సాధనాలుగా  మార్చివేసింది. సరికొత్తగా సరోగసి (గర్భాన్ని అమ్ముకోవటం )కూడా ఎగుమతి అవుతున్న సేవ గా నిలిచింది .మగవారి మితిమీరిన లైంగిక దాహం మహిళల జీవితాల్లో చీకట్లను నింపుతోంది .వీధుల్లో రక్షణ కరువవుతోంది .మద్యం మత్తులో మహిళల పై యువత చేస్తున్న హత్యాచారాలకు అంతులేకుండా ఉంది.   ఢిల్లీలో జరిగిన  నిర్భయ ఉదంతం ,హైదరాబాదులో జరిగిన దిశ ఉదంతం
భారత దేశాన్ని కుదిపేసింది. ఈఉదంతాలు మన దేశంలో మహిళల పట్ల పురుషులకున్న భావాలను తేట తెల్లం చేస్తోంది. ఇంకో పక్క స్త్రీ అనుభవాన్ని బజార్లో కొనుక్కోగలిగే వ్యభిచారం అమలులోకి వచ్చింది. అశ్లీలత ,అందాల పోటీలు పెరిగాయి బహుళజాతి సంస్థలు వ్యాపారాల కోసం స్త్రీని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాయి. ప్రపంచీకరణ విస్తరణకు సాధనంగా ఉన్న టీవీ ,ఇంటర్నెట్ ,సెల్ ఫోన్, సోషల్ మీడియా లలో అనేక  అశ్లీల చిత్రాలను చూపించడం ద్వారా మహిళలపై అనేక అఘాయిత్యాలు పెరుగు తున్నాయి. ఇవి నేరాలు-ఘోరాలు ,కుతంత్రాలు నేర్పించే సాధనాలుగా మారాయి .ఇవన్నీ మహిళలపై విపరీత ప్రభావం కలిగిస్తున్నాయి. పైగా టీవీలలో స్త్రీలను విలన్లుగా చూపిస్తూ స్త్రీకి స్త్రీయే శత్రువు అని ప్రచారం చేస్తున్నాయి.
ప్రపంచీకరణ ప్రభావం తో వినిమయతత్వం బాగా పెరిగింది .వాయిదాల పద్ధతిలో ఇంటినిండా సామాన్లు కొనడం, ఆ తర్వాత ఆర్థిక సమస్యలు పెరిగి కుటుంబంలో కలహాలు రావడం ,అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం పరిపాటి అయింది. ఇదంతా ఎక్కువగా మధ్య తరగతి వర్గం లో జరుగుతోంది.
ఈ వర్గం లో నుంచే అమ్మాయిలు సేల్స్ గర్ల్ గా కూడా పని చేయడం మొదలైంది .వ్యవసాయ రంగంలో పని చేస్తున్న మహిళలు వ్యవసాయం సంక్షోభంలోకిపోవడం కారణంగా పనులు లేక  వలసలు పోతున్నారు. పట్టణాలకు వలస వెళ్లిన  వారిలో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కొంతమంది మహిళలు పనుల కోసం కువైట్, మస్కట్ మొదలైన విదేశాలకు  వెళ్లడం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. వలస వెళ్లిన కుటుంబాల పిల్లలకు గ్రామాలలో సరైన ఆదరణ లేక అనేక చెడు అలవాట్లకు లోనై దారి తప్పుతున్నారు.

                      __పిళ్లా కుమారస్వామి



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు