కటారుపల్లిలో వేమన సమాధి
2000 వేలకు పైగా సరళ తెలుగులో పద్యాలు రాసి, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను ఎలుగెత్తి ప్రశ్నించిన వేమన ప్రజాకవి. వేమన పుట్టిన ఊరు ఏదన్న విషయంలో పరిశోధకుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వేమనది కడప జిల్లా అన్నది అత్యధికుల మాట. వేమన పేరుతో కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పారు. మరి వేమన కడప జిల్లాకు చెందినవాడు అనడానికి రుజువులు ఏమిటి ? వేమన పద్యాలను సేకరించి వెలుగులోకి తెచ్చిన బ్రౌను వేమన పుట్టుపూర్వోత్తరాల గురించి చెపుతూ వేమన కాపు కులస్థుడని కర్నూలు ప్రాంతానికి చెందినవాడని, కాదు గుంటూరు ప్రాంతానికి చెందినవాడని, అది కూడా కాదు కడప జిల్లాలోని చిట్వేలి గ్రామంలో పుట్టడని కొన్ని వాదనలు ఉన్నాయని అయితే ఖచ్చితంగా ఇదీ వేమన జన్మస్థలం అని నిర్ధారించే సమాచారం ఏదీ దొరకలేదని అంటాడు. (వేమన పద్యాలు -The Verses of Vemana - Moral, Relivious and Spiritual - Translated by Charles Philip Brown ) 1875లో విడుదల అయిన కడప మాన్యువల్ (The Manual of The District of Cuddapah In the Presidency of Madras ) వేమన గురించి ప్రస్తావిస్తూ కదిరి ప్రాంతంలో (అప్పటికి అనంతపురం...