మఖ్దూం మొహియుద్దీన్
*చార్మినార్ కి “చాంద్ “.హైదరాబాద్ కి “షాన్"
మఖ్దూం మొహియుద్దీన్ పుట్టినరోజు నేడు..!!
*ఇంట్లో “ పేదరికం “ కొలువైవున్నా…...
కవిత్వంలో మాత్రం “ కోటీశ్వరుడు “!!
*కటిక దారిద్ర్యం లోనుంచి ఆణిముత్యంలా….
ఎదిగొచ్చాడు మఖ్దూం సాబ్ !
*అరె భాయ్ ఈహోటల్ కూడా అచ్చం…
మా ఇల్లు లానే వుంది “
”చీకటి మూకటి మినహా ..ఏమున్నది
రాత్రి వద్ద ?
*ఇదంతా కేవలం సూర్యతేజం ఉదయించే
వరకేరాత్రి చేతిలో చీకటి తప్ప మరేమీ లేదు"
*చమేలీకి మండవే తలే దో బదన్….”!!
కమ్యూనిజం ఆయన నైజం...పోరాటం ఆయన ఇజం..సాహిత్యం ఆయన ప్రాణం.ఆయనెవరోకాదు..
*షాయర్ ..ఎ మాహిర్ మఖ్దూం మొహియుద్దీన్ "!!
ఈ తరం వారిలో చాలా మందికి మఖ్దూం సాబ్ గురించి తెలియక పోవచ్చు.కానీ హైదరాబాద్ పురానా షహెర్ లో పాత తరం వారినెవరినడిగినా షాయర్ మఖ్దూంసాబ్ గురించి కథలు కథలుగా చెబుతారు.అంతెందుకు ? పాతబస్తీ లోని
ఏ గల్లీలో చూసినా మఖ్దూం సాబ్ అడుగు
జాడలు ,ఇంకా పచ్చిగానే కనిపిస్తాయి.ఆయన
జ్ఞాపకాలు ఆకుపచ్చగా ఇంకా జనం ❤️ గుండె ల్లో
అలాగే వున్నాయి
మఖ్దూం...విప్లవ వీధిలో ఎగిరే ఎర్ర జెండా…
మఖ్దూం...జ్వలత్ప్రభా దీప్తి జ్వాల
మఖ్దూం.. కార్మిక విప్లవ కాహళి
మఖ్దూం...మంజీర ఝణం ఝణా రవళి
మఖ్దూం...సామాన్యుల్లో అతిసామాన్యుడు
మఖ్దూం...మాన్యుల్లో అసమానుడు
మఖ్దూం...నూరుపాళ్ళూ తెలంగాణ బిడ్డ
మఖ్దూం...వేనోళ్ళు కొనియాడిన విప్లవ అడ్డా
మఖ్దూం…కవి,విమర్శకుడు,నాటక కర్త.
మఖ్దూం…కార్మిక నాయకుడు,కమ్యూనిస్టు నేత,మానవతా వాది..
*మఖ్దూం జీవితం.!!
మఖ్దూం పూర్తి పేరు' అబూసయీద్ హమ్మద్మఖ్దూం
మొహియుద్దీన్ ఖుద్రీ.'
1908 , ఫిబ్రవరి 4 నతెలంగాణ లోని కుగ్రామం ఆందోల్ లోజన్మించాడు.పిన్నవయసులోనే తండ్రి మరణించడం,తల్లి పునర్వివాహం చేసుకొని వెళ్ళి
పోవడంతో మఖ్దూం తల్లిదండ్రుల ప్రేమకు నోచుకో
లేదు.పినతండ్రి బషీరుద్దీన్ పెంపకంలో పెరిగాడు. ఎన్నోబాధలతో బాల్యం గడిచింది.హైదరాబాద్ లోనే
మఖ్దూం ఉన్నతవిద్యాభ్యాసం జరిగింది.అప్పటికే విద్యార్థిఉద్యమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి
మఖ్దూం వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు.
మఖ్దూం మొహియుద్దీన్ గురించి ఎంతైనాచెప్పొచ్చు
బురదలోంచి కమలం పుట్టినట్లు కటిక దారిద్ర్యం లోనుంచి ఆణిముత్యంలా ఎదిగొచ్చాడు మఖ్దూం సాబ్ !
అలాగని ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల
మోతేం లేదు.కవిగా,కార్మిక నాయకుడిగా,సిసలైన
కమ్యూనిస్టుగా ,ఉత్తమ అథ్యాపకుడిగా బహు
ముఖీన పాత్రలు పోషించినా,జీవితమంతా పోరా
టాలతోనే సరిపోయింది.మఖ్దూం సాబ్ జీవితాన్ని
చూస్తే..ఓ మనిషికి “ఇన్ని'కష్టాలుకూడావుంటాయా? అనిపిస్తుంది.చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు
దూరమయ్యాడు .పినతండ్రి చేయూతిచ్చి కొంతవ
రకు ఆదుకున్నా, పేదరికం మాత్రంమఖ్దూం సాబ్
ను వదలకుండా అంటిపెట్టుకునే వుంది.కడుపు
నిండ తిండి లేదు.ఉంటానికి ఇల్లులేదు.కంటిపై కునుకు లేదు. ఎగుడుదిగుడు దారిలోనే జీవన ప్రయాణం చేయాల్సి వచ్చింది.
కొన్ని రోజులు మశీదుల్లో తలదాచుకున్నాడు.
బాల్యంలో ధార్మిక సంస్కృతికి అలవాటు పడటం
వల్ల మఖ్దూంకు ఓ రకంగా మంచే జరిగింది.మశీదు
ల్లో కసువు చిమ్మటం,మంచినీళ్ళుపట్టడం, వంటి పనులు చేశాడు . భుక్తికోసం ఇంకా ఎన్నో చిన్న
చిన్న పనులు చేశాడు.పెయింటింగ్స్,సినీతారల బొమ్మలు అమ్మాడు.పిల్లలకు ట్యూషన్లుచెప్పాడు.
అయితే.ఏనాడుకూడా తాను చేసే పనుల్ని”న్యూన
తగా “భావించలేదు:.డిగ్నిటీ ఆఫ్ లేబర్ ' అంటే ఆయనకు ఎంతో ఇష్టం.గౌరవం.మఖ్దూంసాబ్ పేదరికం,కష్టాల గురించి ఇప్పటికీ హైదరాబాద్
పాతబస్తీలోకథలు,కథలుగాచెప్పుకుంటారు.
అలాంటి వాటిలో ఓ చిన్న సంఘటనను చూద్దాం!
మఖ్దూంసాబ్ హైదరాబాద్లో ని ధర్మవంత్ హైస్కూల్లో చదివాడు.ప్రస్తుతం హైకోర్టు వున్న చోట పూర్వం
ఓ పాత బస్తీ వుండేది.అందులో మఖ్దూం నివాసం.
అందరు పిల్లలు స్కూలుకు టిఫిన్ బాక్స్ (లంచ్ )
తెచ్చుకునేవారు.ఒక్క మఖ్దూం మాత్రమే పేదరికం కారణంగా లంచ్ బాక్స్ తెచ్చుకునేవాడు కాదు.
ఇంటినుంచి స్కూలు రెండు మైళ్ళ దూరంలోవుండే
ది. రోజూ నడుచుకుంటూనేవెళ్ళేవాడు.ఆరోజుల్లో ఇంటినుంచి స్కూలుకు రాకపోకల కోసం నిజాం సిక్కాలో మూడు పైసలుఅయ్యేవి.అంత సొమ్ము మఖ్దూం దగ్గర ఎక్కడిది!?అందుకే కాళ్ళకు పనిచెప్పే వాడు.ఆరోజుల్లోభోజనానికి మూడు పైసలు ఖర్చ
య్యేవి.మఖ్దూంకు అదే ఎంతో కష్టంతో సమకూరేది.
ఇందులో ఒక పైసాతో తందూరి రొట్టెతీసుకునేవాడు.
అందులో నంజుకోడానికి రెండు పైసలతో మాంసం
కూర తీసుకునే వాడు.ఓ పూట భోజనమే.దాంతోనే సరిపెట్టుకునేవాడు.బహుశా ఈ పేదరికమేఆయన్ను
పీడిత జనాలకు దగ్గర చేసిందేమో? బాల్యంలో... శ్రోత్రియుడుగా వున్న మఖ్దూం ,పెద్దయ్యాక కామ్రేడ్
గా మారాడు.
1937లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మే పట్టభద్రుడయ్యాడు మఖ్దూం.ఉర్దూ నాటకంపై
పరిశోథనా పత్రం సమర్పించాడు.అప్పటికీ పేదరికం వెక్కిరిస్తూనే వుండింది.జీవిక కోసం సినిమా తారల
బొమ్మలు అమ్మాడు.ట్యూషన్లు చెప్పాడు.అంతేకాదు నవాబుగారి విదేశీ ప్రేయసికి ఆంగ్లంలో ప్రేమ ఉత్త
రాలురాసే ఉద్యోగం కూడా చేశాడు.ఈ ప్రభావం ఏమో గానీ “గోథే ప్రేమ లేఖలు “ రాశాడు.చివరకు
“ సిటీకాలేజీలో," ఉర్దూ లెక్చరర్ ఉద్యోగంలోచేరాడు.
ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి,పూర్తికాలం పార్టీ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు.
"కవిత్వం:..'!!
సామ్రాజ్యవాదాన్ని,ఫ్యూడలిజాన్ని వ్యతిరేకిస్తూ... మఖ్దూం తొలి కవితను రచించాడు.
“ఫగ్ పూర్ ఆత్మ “ పేరుతో రచించిన కవిత అగ్గి
పుట్టించింది.ఆ తర్వాత “ఆజాదియే వతన్ “.
(దేశ స్వాతంత్య్రం) పేరుతోరచించిన గేయం లో లేలెండని యువతను ప్రబోధించాడు.“హవేలి”
అనే గీతంలో ఫ్యూడలిజం,మత మౌఢ్యాల్ని తీవ్రంగా తూర్పార పట్టాడు.ఫ్యూడల్ వ్యవస్థపై రచించిన వ్యంగ్య విప్లవ గీతిక “మౌత్ కా గీత్ “(మృత్యుగీతిక)
మంటలు పుట్టించింది.1939 లో సామ్రాజ్యవాద యుధ్ధం మొదలైంది.మఖ్దూం తనకలాన్ని కత్తి చేసి యుధ్ధం మీద యుధ్ధం ప్రకటించాడు.
”జుల్ఫేచలీపా “అనే గేయంలోపెట్టుబడీదారీ విధానా
న్ని వ్యతిరేకించాడు.మఖ్దూం గేయాల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది.“అంధేరా"(చీకటి).ఫాసిజానికి వ్యతిరే
కంగా రచించిన గేయమిది.’చీకటి మూకటి మినహా
ఏమున్నది రాత్రివద్ద’? అంటూ ఫాసిజం వ్యవస్థలోని లోపాలను,పాపాలను నిరసించాడు.
ఫాసిస్టు వ్వస్థకు వ్యతిరేకంగా ఆరోజుల్లో యువకులు స్థాపించిన”కామ్రేడ్స్ అసోసియేషన్” లో మఖ్దూం సభ్యుడు. ఎర్రజెండా ఒక్కటే ఈ ప్రపంచాన్ని మార్చ
గలదని గట్టిగా నమ్మాడు.మఖ్దూం.ఉర్దూ సాహిత్యం
లో మఖ్దూం తడమని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు.
*షాయర్ (కవి) గా….!!
కవిగా మఖ్దూం ఎక్కని ఎత్తుల్లేవు.అందరిలానే ఆయన కూడా ప్రేమ కవిత్వం రాశాడు.భావకవిలా
ఊహాజగత్తులో విహరించాడు.ఆయన ప్రేమ కవి
త్వానికి ఫిదా కానీ వారు లేరంటే అతిశయోక్తి కాదు.
బాధల్లోంచే కవిత్వం పుడుతుందనటానికి మఖ్దూం సాబ్ ను మించిన ఉదాహరణ ఏముంటుంది?
“”పీలాదుషాలా “ (పచ్చ శాలువా ) మఖ్దూం తొలి కవిత.1933..34 లోమఖ్దూం ప్రేమ కవిత్వం మొద
లైంది.ఉర్దూ,ఫారసీ భాషల్లో ఆయన దిట్ట.మఖ్దూం .
ప్రేమ కవితలకు పరవశించని పాతబస్తీ శ్రోతలేడు.
ఆయన ముషాయిరాల్లో పాల్గొంటున్నాడని తెలిస్తే చాలు పాతబస్తీ రసికులు,కవిత్వ ప్రెమికులంతా విధిగా హాజర య్యేవారు.అయితే కాలంతో పాటు మఖ్దూం దృక్పథంలోనూ మార్పు వచ్చింది.ప్రేమ కవిత్వం పాడుకుంటూ పరవశించే రోజులు కావని మఖ్దూంతొందరగానే గ్రహించాడు.ఫ్యూడలిజానికి,
ఫాసిజానికి వ్యతిరేకంగా గళం విప్పాడు.అభ్యుదయ గీతాలురాయడం మొదలు పెట్టాడు.
” ఫగ్ పూర్ ఆత్మ “ (ఫగ్ పూర్ ఓ దుర్మార్గుడైన
చైనా చక్రవర్తి )అనే కవితలోసామ్రాజ్యవాదాన్ని నిరసించాడు.”ఆజాది యే వతన్ “లో యువకుల్లో స్వాతంత్రేఛ్ఛను రగుల్కొలిపాడు.
1934లో “హోష్ కే నాఖూన్ “అనే నాటకాన్ని రాసి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలోహైదరాబా
ద్లో ప్రదర్శించాడు.ఠాగోర్ మెప్పు పొందాడు1935 లో టాగోర్..అతని కవిత “ గ్రంధాన్ని రాసి,స్వయంగా
ప్రచురించాడు.“హవేలీ “ ( దయ్యాల మేడ ) లో
ఫ్యూడలిజాన్ని దుయ్యబట్టాడు.“ మౌత్ కా గీత్ ",
“(మృత్యుగీతి ) లో ఫ్యూడలిజమ్, సామ్రాజ్యవాదా
న్ని తూర్పారా బట్టాడు .పెట్టుబడిదారీ వికృత
రూపాల్ని ఆవిష్కరిస్తూ..“జుల్ఫే చలీపా “ గేయం రాశాడు.” సిపాయి “ అనే గేయంలోయుధ్ధోన్మాదం
,యుద్ధం వికృత లక్షణాల్నివర్ణించాడు.ఇక మఖ్దూం మార్క్ కవితగా ముద్రఫపడిన “అంథేరా “(చీకటి ) గేయంలో శ్రీశ్రీ చెప్పినధ్వంసన చణ..హింస రచన
ను ఇందులో చూపించాడు మఖ్దూం సాబ్.
”చీకటి మూకటి మినహా ..ఏమున్నది రాత్రి వద్ద ? అంటూ,చీకటిని మన దుర్భర వ్యవస్థతో పోలు
స్తాడు.ఆ తర్వాత” గోథే ప్రేమ లేఖల్ని “ రచించాడు
సిటీ కాలేజ్ లో ఉర్దూ లెక్చరర్ అయ్యాక చాలా
కవి.తలు తరగతి గదిలోనే రాశాడట.1051లో
జైల్లో వున్నప్పుడు “జైలు “ అనే గేయాన్ని….
రచించాడు.
మఖ్దూంసాబ్ ప్రళయ కవిత్వమే కాదు ప్రణయ కవిత్వం కూడా రాశాడు.
*ప్యార్ కే ఆగ్ మే జల్ గయే
ప్యార్ హర్ఫె వఫా ,ప్యార్ ఉన్ కా ఖుదా
ప్యార్ ఉన్ కీ చితా
యే బతా చార్ గర్
తేరీ జంబీల్ మేం
నుస్ఖాయే కీమియాయే ముహబ్బత్ భీ హై
కుఛ్ ఇలాజ్ వ మదావాయే ఉల్ఫత్ భీ హై “!!
…..(మఖ్దూం.1960!!)
తన అభిమాన గాయినీ షకీలాబానోను
ఉద్దేశించి మఖ్దూం ఈ గజల్ రాశారు.
*సాహిత్య ప్రక్రియలు:
1.గోథే ప్రేమలేఖలు
2.జమాలుద్దీన్ జోక్స్
3.పీలాదుషాలా (పాట)
4.టూర్ (మొదటి భావగీతం )
5.హోష్ కే నాఖూన్ (నాటకం)ఈ నాటకాన్ని
రవీంద్రనాథ్ టాగూర్సమక్షంలో హైదరాబాద్లో
ప్రదర్శించారు.
6.టాగోర్,అతని కవిత (విమర్శ)
7.ముర్షదే కామిల్ (సమర్థ పురోహితుడు నాటకం )
8.జంగేఆజాదీ (స్వాతంత్ర్య సమరం)..కవితా
ఖండిక
9.బెంగాలు కరువు (కవితా ఖండిక )
10.స్టాలిన్ కి ఆవాజ్ (అనువాదం )
11.తెలంగాణ (గేయం)
12.ఖైదు (గేయం )
13.గులెతర్ (తాజా రోజా ...గీత సంపుటి )
14.చాంద్ తారోంకా బన్ (తారాచంద్రుల కారడవి
గీతం )
15.చారగల్ ( గేయం)
అనువాదం…!!
మఖ్దూం ఉర్దూ, తెలుగు కవులకు ఉభయ కవి మిత్రుడు.ఉర్దూ నుంచి తెలుగులోకి అనువదించడం అంత సులువు కాదు.అందులో మఖ్దూం కవితను తెలుగు చేయడం కత్తిమీద సాము లాంటిది.ఉర్దూ,
తెలుగు కవిత్వాలపై పట్టు వుంటే గానీ అనువాదం రుచించదు.సినారె,గజ్జెల మల్లారెడ్డి,రాంభట్ల,దాశరథి కౌముది,వంటి వారు అనువాదం లో .." మఖ్దూం "
కవితాహృదయాన్ని ఆవిష్కరించారు.
మఖ్దూంసాబ్ ఉర్దూ కవి కాబట్టి తెలుగు సాహితీ కారులకు ఆయన కవిత్వ రుచి చాలాతక్కువగా
తెలుసు.మఖ్దూం కవితల్ని గజ్జెల మల్లారెడ్డి,దాశరథి వంటి మహామహులు మఖ్దూం ఉర్దూ కవితల్ని తెలుగు లోకి అనువదించడం వల్ల కనీసం తెలుగు
లో మఖ్దూం కవిత్వ మాధురిమ ఈ మాత్రమైనా…
తెలుస్తోంది .
*గజ్జెల మల్లారెడ్డి గారి అనువాదాలు..!!
*కాల పరిమితి లేని
కారాగృహమ్ములో
దమనకాండను గూర్చి
తర్కించగా నేల
నిశ్శబ్ద ఏకాంత
నిశలలో చెరసాల
ప్రాకారముల కవల
బహుదూరమున నగరి
గుండెలోతులనుంచి
ఘూర్ణిల్లు నినదించు
ఘంటారవాలతో
కంపించు నా మేధ “..(మూలం.కైద్ ,!! )
*అక్షయ పాత్రను బట్టుక
భిక్షాటన చేయు నిశికి
దొరికిన బిచ్చపు గింజలు
అరువు కాంతితో మురిసే
ఆ చుక్కలు చందమామ
అవేదాని మధుపర్కా
లవే అంతిమచ్ఛాదన. “!!
( ..మూలం.అంథేరా !)
*ఈలోకం నీకోసం
ఎంత పరితపించెనో
ఈ ధరిత్రి నీ రాకకు
ఎంత నిరీక్షించెనో?
తోరణాలు తీర్చి జనం
దారుల్లో నిలిచిరే
పదపదవే గీతమా!
పదవే నాద ప్రాణమా!”
(..మూలం..ఇన్ఖిలాబ్…!!)
*చక్రవర్తుల ముద్దుబిడ్డ
విధ్వంసాల అంతరాత్మ
మృత్యుదేవతకు సహచరి
శ్మశానాంగణ విహారిణీ
దారిద్ర్యం మూర్ఖత్వాల
తఖ్తునెక్కిన మహారాణి “
( ..మూలం.షగ్ఫూర్ ఆత్మ !!)
*దాశరథి గారి ..అనువాదాలు !!
*వస్తున్నది వస్తున్నది
వస్తున్నది వస్తున్నది
దడదడలాడే గుండెల
శబ్దం వినవస్తున్నది
చీకటిదారుల,అడుగుల
సవ్వడి వినవస్తున్నది
యెవ్వరిదో? ఎక్కడిదో?
పిలుపు వినవస్తున్నది “!!
..మూలం..ముస్తఖ్బిల్..(భవిష్యత్తు !!)
*మెలిక తిరిగిన పొలం గట్టుల మీద ,
మెలికలు తిరుగుతూ…
మెత్త మెత్తని తియ్యతియ్యని
నవ్వులను వెదజల్లుతూ…
చేతిగాజులళగలగలలో సిగ్గులను కలగలుపుతూతెలుగు పిల్లా….
పాడవే.!వలపొలకబోస్తూ పాడవే “.
…….మూలం .:తెలంగన్ !!
*మన నగరం
మహా విచిత్రం
నిశిరాతిరి రోడ్డు మీద నడుస్తోంటే
నీతో గుస గుసలాడుతుంది నగరం
గుండెలోని రహస్యాల వలె
పుండుపడిన తనను విడమరిచి చూపుతుంది “”
మూలం..అప్నా షహెర్ (మన నగరం )
*కౌముది అనువాదం..!!
"పోయినవి శృంఖలలు
పోయెను బానిసత్వము
మెరుగు పెట్టిన వజ్రమై
మిరుమిట్లు గొలిపెను మానవత్వము “
మూలం..చుప్ న రహో. (ఉపేక్షించకు )
మఖ్దూం ప్రణయ కవి. ప్రళయకవి.మఖ్దూంకుస్వేఛ్ఛా
ప్రణయం మీదకానీ,ప్రణయ స్వేచ్ఛమీద కానీ నమ్మ
కం లేదు. ఆయన ప్రణయ కవిత్వం,సాంప్రదాయక
భావ కవిత్వం కన్నా భిన్నమైంది.ఉత్తమ మైంది కూడా. ఇక అభ్యుదయ కవిత్వానికి ఆయన రథ
సారథి.సమకాలీన సామాజిక సమస్యలపై ఆయన
కలం నిప్పులు కక్కింది.ఆయన గళంవిప్లవ గీతాల్ని
ఆలపించింది.!! భూస్వామ్య,'ఫాసిస్ట్ సామ్రాజ్య ',
విధానాలపై మఖ్దూం సాబ్ మొదటి నుంచీ ఎత్తిన కత్తి దించలేదు.దుర్భర దారిద్ర్యం లో కూడా ఎక్కడా
రాజీ పడని వ్యక్తిత్వం ఆయనది.ఆరోజుల్లో సినిమా
పాటలు రాస్తే వేల రూపాయలు ఇస్తామని సినీపరిశ్ర
మలోని ప్రముఖులు వెంటపడినా..తాను సినిమాల.
కు పాటలు రాయనన్నాడు.జేబులో చిల్లిగవ్వ లేకు
న్నా...సినిమా ఆఫర్ ఊరిస్తున్నా.. మఖ్దూంసాబ్ మాత్రం ఆడిన మాట తప్పలేదు.చివరకు మఖ్దూం రాసిన గజళ్ళలో రెండు మూడింటిని సినిమాల్లో పాటలుగా మలుచుకున్నారు.
మళ్ళీ ఇటీవల 'వాహెద్ ‘ మఖ్దూం సాబ్
కవిత్వాన్ని తెలుగులో అనువదించారు.
మచ్చుకు మఖ్దూం కవితను వాహెద్
అనువదించిన తీరు చూడండి.
"చీకటి."(అంథేరా ).... మఖ్దూం
(షాయరె తెలంగాణా మఖ్దూం మొహియుద్దీన్ జీవితం - కవిత్వం నుంచి..అనువాదం : వాహెద్)
*రాత్రి చేతిలో భిక్షపాత్ర
వెలుగుతున్న చంద్రుడు, మెరుస్తున్న తారకు
భిక్షగా దొరికిన వెలుగులో, కాంతి అడుక్కోవడంలో నిమగ్నం
ఇదే వారి నూతనవధు అలంకరణ, ఇదే వారి
చీకటిలో మరణిస్తున్న శరీరాల మూల్గులు
దుష్టశక్తి పెంపుడు కుక్కలు మాటు వేసిన చోటు
ఆ నాగరికత గాయాలు
కందకాలు
వరదల దారాలు
వరద దారాల్లో చిక్కుబడిన మానవశరీరాలు
మానవ కళేబరాలపై కూర్చున్న గద్ద
చిట్లుతున్న తలలు
కాళ్ళు తెగిన, చేతులు తెగిన దేహాలు
ఇక్కడి నుంచి అక్కడి వరకు శవాల కట్టడాలు
చలిగాలి
ఆర్తనాదాలు, హాహాకారాలు, విజ్ఞప్తులు
రాత్రి నీరవంలో రోదన ధ్వనులు
పసిపాపలు, తల్లుల ఏడ్పులు
చంద్రుడు, నక్షత్రాల విషాదగీతాలు
రాత్రి నుదుటిపై వినిపించే తారక బృందం"!!
*చమేలీకి మండవే తలే..
అనువాదం….!!
*ఓ మల్లెపందిరికింద
మద్యశాలకు దూరంగా ఆ మలుపు వద్ద
రెండు శరీరాలు
ప్రేమాగ్నిలో కాలిపోయాయి
చెప్పు..ఓ వైద్యుడా
నీవస్వస్థల సంచిలో
ప్రేమకు ఔషథం లాంటిదేమైనా వుందా?
అసలు ప్రేమరోగికి చికిత్సంటూ వుందా?
ఏక్ చమేలీకి మండవే తలే
కేవలం అనువాదంతోనే సరిపెట్టకుండా మఖ్దూంపై
ఓ సమగ్ర పుస్తకానికి కర్త అయ్యాడు.ఈ పుస్తకంలో మఖ్దూం జీవితం...కవిత్వం గురించే గాక , మఖ్దూం జీవిత,సాహిత్యాల్లోని వివిధ కోణాల్ని స్పృశించాడు
కవిగా,వ్యక్తిగా,కార్మిక శక్తిగా,కమ్యూనిస్టునేతగా,
తెలంగాణసాయుధ పోరాట యోధుడిగా,ఫాసిజమ్,
ఫ్యూడలిజమ్, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకుడిగా
మఖ్దూం వహించిన భూమికను ఆవిష్కరించే…. ప్రయత్నం చేశాడు వాహెద్.
మఖ్దూం కవితాహృదయాన్ని ఆవాహన చేసుకొని వాహెద్ ఇంద్రజాలం చేశాడు.
మఖ్దూం పై ఇంతవరకు తెలుగులో సమగ్రమైన పుస్తకంలేని కొరతను ఈ పుస్తకం తీరుస్తుందని ఆశిద్దాం.శ్రీశ్రీ భుజాలపై పెట్టుకొని మోసిన కామ్రేడ్లు మఖ్దూం మొహిద్దీన్ ను నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ వుంది.మఖ్దూంపై వాహెద్ రాసిన పుస్తకాన్ని ప్రచురిం
చి ప్రజాశక్తి ప్రచురణలవారు ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు.అందుకు వారు అభినందనీయులు..
*తెలంగాణ అంటే ప్రాణం….!!
మఖ్దూం సాబ్ కు తెలంగాణ అంటే ప్రాణం.నిజాం చెర నుండి తెలంగాణ విముక్తి..ప్రజాస్వామ్య ముక్తి కోసం మఖ్దూం కలలు కన్నాడు.దానికోసం తెలంగా
ణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాడు.తెలంగా
ణ గురించి గజల్ గానం చేశాడు.
“దాయరె హింద్ కా వో రహ్బర్ తెలంగాణా
బనారహాహై నయీ ఏక్ సహర్ తెలంగాణా
బులా రహా హై బా సిమ్తె తెలంగాణా
వో ఇంక్విలాబ్ కా పైగంబర్ తెలంగాణ “.
.(మఖ్దూంసాబ్)
“భారతదేశపు మార్గదర్శి నా తెలంగాణా
నవోదయాలను సృష్టిస్తుంది నా తెలంగాణా
కొత్తలోకపు పిలుపిస్తోంది తెలంగాణా
విప్లవ నాదం వినిపిస్తోంది తెలంగాణా “.!!
...అనువాదం ( వాహిద్ )…!!
*హాస్య ప్రియత్వం…!!
‘ఓరోజు మఖ్దూం సాబ్ తన స్నేహితుడ్ని వెంట
బెట్టుకొని ఓ హోటల్ కు వెళ్ళాడట.మెనూ కార్డు చూసి “పాయ" (మేక కాళ్ళ కూర ) తెమ్మన్నాడట దానికి సర్వర్ “మాఫ్ కీజియే సాబ్..పాయనైహై”
(క్షమిఃచండి.పాయ లేదు ) అన్నాడట.”జానేదో భాయ్ ఖీమా లాలో “(పోనీలే.ఖీమా తీసుకు రా.!)
అని మరో ఐటమ్ ఆర్డరిచ్చారట మఖ్దూం. దానికి మళ్ళీ ఖీమా కూడా లేదన్నాడు సర్వర్.అంత ఫ్రస్టే
షన్ లో కూడా మఖ్దూం నవ్వుతూ..” అరె భాయ్
ఈహోటల్ కూడా అచ్చం మా ఇల్లులానే వుంది “
అన్నాడట.అంటే ఇంటి దరిద్రం అంతగా వుండేదన్న మాట.’
*హాస్యానికి మఖ్దూం బ్రాండ్!!
'జమాలుద్దీన్ జోక్స్ '!!
మఖ్దూంసాబ్ ఎన్ని కష్టాల్లో వున్నా,,మొఖం పై
చిరునవ్వును చెరగనిచ్చేవాడు కాదు.మఖ్దూం
ఎక్కడవుంటే అక్కడ జోకుల పంటే.తరగతి గది
లో కూడా….ఆయన తలుపులు మూసి పాఠం చెప్పేవారట.ఆయన జోకులతో ఆయన పాఠం చెబుతుంటే క్లాస్ లో ఒకటే ...నవ్వుల సందడి వుండేదట.పక్క క్లాస్ ల కు ఇబ్బంది కలగకూడ
దని,తలుపులు మూయమనే వారట.అంతెందుకు మఖ్దూం సాబ్ “జమాలుద్దీన్"పేర జోక్స్ సృష్టించే
వాడు చాలా మంది జమాలుద్దీన్ జోక్స్ను ప్రచారం చేసే వారట.ఇప్పటికీ పురానా షెహర్ లో జమాలు
ద్దీన్ జోక్స్ అంటే చెవికోసుకునే వారున్నారు.
ట్రేడ్ యూనియన్ స్థాపించారు.మఖ్దూంఅందులో
భాగస్వామి.ఒకపక్క దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ మాత్రం నిజాం ఏలుబడిలోనే వుండింది.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో మఖ్దూం పాల్గొని ఎన్నోమార్లు జైలుకెళ్ళాడు.
1958లో పార్టీ మీద నిషేధం వచ్చింది.మఖ్దూం అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయాడు.
తెలంగాణలో సాయుధ పోరాటానికి పిలుపిచ్చాడు మఖ్దూం...తుపాకీ పట్టి పోరాటం చేశాడు.
రజాకార్లకు వ్యతిరేకంగా ఎన్నో వ్యూహప్రతి
వ్యూహాలు పన్నాడు.
*కార్మిక / రాజకీయ నాయకుడిగా…!!
1951 సంవత్సరాంతంలో సాయుధపోరాటాన్ని ఉపసంహరించారు.1952లో ఎన్నికలొచ్చాయి.
మఖ్దూం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.
ఆ తర్వాత హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ
చేసి గెలిచాడు.పార్టీ ఆదేశాల మేరకు వియన్నా
లోని ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన
కార్యాలయంలో పనిచేశాడు.1957లో మెదక్
పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాడు.ఆతర్వా
త శాసనమండలికి ఎన్నికయ్యాడు.తను జీవించి వున్నంత కాలం ఎర్రబావుటా నీడలోనే వున్నాడు.
సినిమాల్లో పాటలు రాసే అవకాశాలొచ్చినా. వదులుకున్నాడు.తన భాష కమ్యూనిజం.తన
శ్వాస కమ్యూనిజం.తనదేహం..గేయం జనం
కోసం అంకితం చేసిన మహాకవి..మహోన్నత
వ్యక్తి మఖ్దూం సాబ్!!
*మఖ్దూం సాబ్ స్మృతి లో…!!
మఖ్దూం సాబ్ కు నివాళిగా హైదరాబాద్ సిటీకాలేజ్ లో ఓ సమావేశ మందిరానికి “మఖ్దూం హాల్ “అని
నామకరణం చేశారు.అలాగే హైదరాబాద్లో ని సిపిఐ కార్యాలయానికి మఖ్దూం భవన్ అన్న పేరు పెట్టారు.
హైదరాబాద్ సిటీ కాలేజీ తరపున మఖ్దూం స్మారకం గా ఏటా జాతీయ అవార్డు ఇస్తున్నారు.ప్రముఖ నవలా రచయిత సలీం ఈ అవార్డు కోసం 50వేల రూపాయలను విరాళంగా అందించారు.
మఖ్దూంసాబ్ ను ఓ వ్యక్తిగా కంటే ఓ శక్తిగానే గుర్తిం
చాలి.ఏక కాలంలో ఆయన ఇటు పాఠం చెబుతూనే
అటు కవిత్వం రాసేవాడట.వెంటనే కార్మిక సంఘాల మీటింగ్ లలో పాల్గొనే వాడు. ఇక పార్టీ కార్యకలా
పాలు సరేసరి.ఆయన ఎంత బిజీగా వున్నా….
కుటుంబాన్ని మాత్రంనిర్లక్ష్యం చేయలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే. మఖ్దూం సాబ్ జీవి
తంలో దారిద్ర్యం వుందేమో గానీ,' భావ దారిద్ర్యం'
మాత్రం ఎన్నడూ లేదు…
అందుకే ఆయన హైదరాబాద్ కీ "షాన్.'..
చార్మినార్ కి " చాంద్ " అయ్యారు !!
*ఎ.రజాహుస్సేన్..!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి