ఆలూరి బైరాగి
"నాలో లోకం కొరకై లోకంలో నా కొరకై ఏకైక మహోద్రేకం ఉరికించాలని కోరిక’’ అంటూ తనకు లోకంలో గత అద్వైత భావాన్ని కవిత్వీకరించిన కవిని పట్టి చూస్తే అతను వేరూ కవిత్వం వేరూ అన్పించదు. అతని విషయంలో కవిత్వం ఒక ఆవేశం, అభినివేశం కాదు. అతనే నిలువెల్లా కవిత.
‘‘ఆమ్రపాలి హస్తాన్ని చుంబించని వారెవ్వరు? ద్రోహులు కాని వారెవ్వరు’’ అంటాడు చేదుగా.అవును అతడన్ని సమస్యల్ని అన్ని కోణాలనుంచీ అర్థం చేకున్న సర్వజ్ఞ సింగభూపాలుడు. ‘‘కక్కురీతి నగుబాటు పాపపు పుట్ట మానవదీన గాత్రం’’ అని తీర్మానిస్తూ అంటాడు. ‘‘మనుగడల తిరునాళ సందడి తల్లి ఎక్కడ పిల్లడెక్కడ ఎవరికెవ్వరు సాయమిక్కడ ఈ అపరిచిత ముఖాటవిలో’’ అని తేల్చిపారేస్తాడు బైరాగి.
తన అపారమైన జీవితానుభవంతో మానవుని ఉద్వేగాలూ, సహజాత సంజాతాలూ అన్నీ హృదయంతో ఆలోచించి (రారా అన్నట్లుగా) జీవితానికి అటువైపున వున్న వికృత పార్శ్వాన్ని మనకి చేదుమాత్ర చేసి మింగిస్తాడు. ఎట్లాగొట్లా ప్రయత్నం చేసి ఆ చేదుమాత్ర మింగితే ఇక అంతటా అలజడిలేని ప్రశాంతత అన్నమాట! గాయపడిన ఆత్మ అతడి కవిత, ఆవేదన అతని చిరునామా.అతనే ఆలూరి బైరాగి.
బైరాగి, తెనాలి లోని ఐతానగరంలో 1925, నవంబర్ 5వ తేదీన సరస్వతి, ఆలూరి వెంకట్రాయుడు దంపతులకు మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. బైరాగి రెండవ తరగతి వరకే తెలుగులో చదువుకున్నాడు. ఆయన తండ్రి హిందీ చదవమని ప్రోత్సహించడంతో 1935 ప్రాంతాల్లో యలమంచిలి వెంకటప్పయ్య స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన ఉత్తరాది వెళ్లారు. పదిహేనో ఏట ఆయన హిందీలో కవితలు రాసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తన కవితా వ్యాసంగపు తొలినాళ్లలోనే పలాయన్ అనే పేరుతో హిందీ కవితా సంకలనం ప్రచురించారు. ఎం.ఎన్.రాయ్ నెలకొల్పిన ర్యాడికల్ డెమోక్రాటిక్ పార్టీకే అంకితమయ్యారు. స్వతహాగా ఇంగ్లీషు నేర్చుకొని ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1946లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగా చేరారు. తెలుగులో బైరాగి మొదటి కవితా సంకలనం చీకటి నీడలు ప్రచురించారు. బైరాగి పినతండ్రి, చందమామ వ్యవస్థాపకులలో ఒకరైన చక్రపాణి (ఆలూరు వెంకట సుబ్బారావు) హిందీ చందమామకు సంపాదకత్వం వహించమని కోరడంతో మకాం మద్రాసుకు మార్చారు. తొలినుంచీ స్వేచ్ఛాజీవి అయిన బైరాగి చందమామలో కొనసాగలేక బయటకు వెళ్లిపోయారు. నూతిలో గొంతుకలు, దివ్యభవనం కథా సంపుటిని ప్రచురించారు. బైరాగి రచనలలో కెల్లా నూతిలో గొంతుకలు ఆయన ఉత్కృష్ట రచన.
బైరాగి స్వతంత్ర భావాలుగల వ్యక్తి. ఆయన తన పంథా మార్చుకోవాలని ఎవరైనా సలహాలు ఇచ్చినా నవ్వి ఊరుకొనేవారే తప్ప తన భావాలను మార్చుకునేవారు కాదు. చాలా నిరాడంబరంగా జీవించారు. 1978లో క్షయవ్యాధికి గురయ్యారు. మిత్రులు ఎంత బతిమాలినా వైద్యంపట్ల ఆసక్తి చూపలేదు. చివరిరోజుల్లో ఆయన తన మకాం హైదరాబాదుకు మార్చారు. ఆంగ్లంలో ఒక మంచి నవల రాశారు. ఆయన నవల, నాటకం, కొన్ని అముద్రితాలుగానే మిగిలిపోయాయి. బెంగాలీ భాష కూడా నేర్చుకున్నారు. బెంగాలీలో జీవనానంద దాస్ అనే కవి ఆయనకి చాలా ఇష్టం. ఆజన్మ బ్రహ్మచారి అయిన బైరాగి 1978 సెప్టెంబరు 9న మరణించారు. బైరాగికి మరణానంతరం 1984లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.చీకటి నీడలు,
ఆగమ గీతి (కేంద్ర సాహిత్య ఆకాడెమీ పురస్కారం),
నూతిలో గొంతుకలు,
దివ్య భవనం (కథలు) ఆయన రచనలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి