కవితా సతి నొసట నిత్యరస గంగాధర తిలకం







కవితా కదన క్షాత్రుడు

అది కాదు,
నాకు తెలియకడుగుతున్నాను
ఏమిటీ ఘోరం?
అబద్ధాలు ప్రకటించడానికి
అలవాటుపడిపోయిన - కాదు
అంకితం అయిపోయిన
ఓ దుర్వార్తా పత్రికలారా! చెప్పండి
ఈ వార్త నిజమేనా?
(బహుశా నిజమే అనుకోవాలి. అప్పుడప్పుడో
భయంకర సత్యం ప్రకటిస్తారు!
అప్పుడే మీ అబద్ధాలకు విలువ. )
సిమెంటనే మారు పేరు ధరించిన
ఇసుకతో నిర్మించబడిన
వంతెనలాంటి ప్రభుత్వమా
ఏమిటీ ఘోరం?
అని నిన్నడిగి ఏం లాభం?
నిద్రపో హాయిగా
వృక్షమా! ఋక్షమా! ద్విపక్షమా!
బదులు చెప్పండర్రా! మీరైనా
జవాబులేదు.
గాలి మూగదయిపోయింది
పాట బూడిదయిపోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
నభస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి
మరి కనిపించడా?
కోకిలవలె కూజించే కలధ్వని
కేసరివలె గర్జించే రణధ్వని
ఇక వినిపించదా
భావి దూర తీరాలకు
చేరువుగా విహరిస్తూ
జీవనాడి స్పందించే
రుధిర మధువు లందించే
యువకవి
లోక ప్రతినిధి
నవభావామృత రసధుని
కవితా సతి నొసట నిత్య
రస గంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్ఛస్పాటిక ఫలకం
నడినింగిని మాయమయాడా
మన మిత్రుడు
కవితా పుత్రుడు
కదన క్షాత్రుడు
సకల జగన్మిత్రుడు!

____శ్రీశ్రీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు