నా కవితల మల్లెతీగ

1.శార్వరీ! నువు తేవద్దు చీకటి
           ____పిళ్లా కుమారస్వామి
                   9490122229

శార్వరీ కొన్నాళ్ళు రాకు
ఇక్కడ కరోనా రాకాసి తిరుగుతోంది
నువ్వు వస్తున్నావన్న ఆనందమే కరవైంది
మేమిప్పుడు క్వారంటైన్లో వున్నాం
అప్పుడెప్పుడో తెగిపోయిన బంధాలపోగుల్ని అతికించుకొంటున్నాం
ఎక్కడో తప్పిపోయిన జీవితాన్ని వెతుక్కుంటున్నాం
శార్వరీ నువ్విప్పుడు  రాకు
వికారి నిన్ననే శెలవు తీసుకొంది
పోతు పోతూ కోవిడ్ను మాకిచ్చి పోయింది
దారి తప్పిన  జీవన విధానాన్ని గాడిలోకి తెచ్చుకోవాలి
ఒకరినొకరు కరచాలనాలు మరచి అలాయ్  బలాయ్ లొదలి
ఆప్యాయతా ఆలింగనాల్ని వదలి
మాలో మేము చూసుకుంటూ
ఎక్కడ వారక్కడ గప్ చుప్ ఆటలాడాలి
ఓ శార్వరీ 
ఈ విషాదసమయం లో నిన్ను ఆహ్వానించలేము
మేమెలాగూ తిప్పలు పడుతున్నాం
కోయిల చావు గీతం పాడిందే
వసంతం కరోనాగీతం ఆలపిస్తోందే
నీకు వినిపించలేదా
ఇక్కడిప్పుడు జనాభా లెక్కల సేకరణ ఆపేశారు
యన్ పి ఆర్ ను వాయిదా వేసినారు
దేవళాల తలుపులు వేసినారు
ఊర్లోకి దారులు మూసినారు
ఇప్పుడు బతుకుపోరు కాదు
మాముందున్నది
బతికేందుకు పోరాటం
తోటివారిని బతికించే పోరాటం
దీనికి ఒకటే మార్గముంది
అది
నేనొక్కడినే ఒంటరినైపోవడం 
మళ్ళీ మరీ మరీ కోరుతున్నా
దయచేసి నువు రాకు
శార్వరీ నువు బాగుండాలి
అందరినీ బాగుపరచాలి.

2.సరిహద్దులు మూసివేయండి
    ___ పిళ్లా విజయ్
          9490122229


కరోనాకు హద్దులు లేవు
చావులకు ఏ ఎల్లలు లేవు
మనిషికి మనిషికి మధ్య మమతల కోసం తన సరిహద్దులను మూసివేసుకోక తప్ప దు.
ఇదొక భయంకర విష రాక్షసి
ఇది కమ్ముకొంటే జ్వరం వస్తుంది దగ్గూ వస్తుంది
ఊపిరితిత్తుల్లో చేరి ఊపిరాడనివ్వక నిను ఉక్కిరిబిక్కిరి చేసి
నరకం అంచులో నిలబెడుతుంది దాని కన్నా చావే నయమనిపిస్తుంది
జీవితానికో ముగింపు కోసం మది కలవరపడుతుంది
నువు ప్రేమగా మృదువుగా తాకిన చేయి ఇప్పుడొక భస్మాసుర హస్తమవుతుంది 
కోవిడ్ నీ ప్రేమికున్నీ నీ ప్రేమ ను
నీ శత్రువు ను సమానంగా పద్నాలుగు రోజులు ప్రేమిస్తుంది.
ఆపై రాక్షసి లా కౌగలించుకొని
నిను ఒక్కో క్షణం నములుతూ ఉంటుంది
నీలో తిరస్కరించే  శక్తివుందో లేదో అది పరీక్ష చేస్తుంది
నువు ఆవాహన చేసుకున్నావో
అన్ని కణాల్లో కి అది చొరబడుతుంది
ఒక్కో అవయం శిథిలమై పాతళం అంచులో నిలబెట్టి
సమాధై నిలబడుతుంది
నీవింతకాలం కండరాలను సాయుధం చేసి వుంటే
ఆకులను కూరలను కాయలను నమిలి నమిలి నీలో ఐక్యం చేసివుంటే నీలో ని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి
యాంటీ బాడీలు అప్పటికప్పుడు ఉత్తేజితమై కోవిడ్ పై కత్తికట్టి దునుమాడి
స్వేచ్ఛా వాయువులు పీలుస్తాయి
నిన్ను అజేయుని గా లోకానికి చాటుతాయి
అందుకే నీ కరచాలనం
నీ ముద్దు మురిపాలు గట్టున పెట్టు
తుమ్మినా దగ్గినా గుడ్డ అడ్డం పెట్టు
నువ్వు బయట తిరగక
నిన్ను నువ్వు ఏకాంతంలో ఉంచుకో
మనిషిని అజేయునిగా నిరూపించు
కోవిడ్ విషవలయాన్ని  చేధించే ఆయుధం చేతికందే వరకు.


3.స్వీయ నిర్బంధం
        __ పిళ్లా విజయ్ 9490122229
________________________


ఏకాంతం
నీలో నువ్వే మాట్లాడుకునే ఏకాంతం
ఎవరితో కలవకుండా
ఎవరితో మాట్లాడకుండా
నీతో నువ్వే చేసుకునే యుద్ధం
ఎక్కడో చైనాలో పుట్టిన భయంకర  కరోనా ఒక వైరస్
అది ప్రపంచమంతా వెంటాడుతోంది 
అందరికి జ్వరం తెప్పిస్తోంది
శ్వాస బిగబెట్టి ప్రాణం తోడేస్తోంది
దానికి పేద ధనిక తారతమ్యం లేదు
లింగ వివక్ష అసలేలేదు
అదొక ముసలం
అదృశ్య నరహంతకి.
మానవ తప్పిదమో
కొందరి వికృత విన్యాసమో
ఏదైతేనేం
భూగోళం విలవిలలాడుతోంది
కరోనా కోవిడ్ గా నామకరణం చేసింది
ఎందెందు వెదికిన అందందే ఉన్నానంటూ
కనిపించని కుట్రలా
చాపకింది నీరులా 
అందరినీ కబలిస్తోంది
నాతో చెలగాటం ఆడొద్దొంటూ
అందరినీ వణికిస్తోంది
కరచాలనం విడిచి నమస్కారం తో యుద్ధం మొదలైంది
నిన్ను నువ్విప్పుడు  శుద్ది చేసుకోవాలి
ఇప్పటికైనా మేలుకొని
బలవర్ధక ఆహారం తీసుకోవాలి
నీవు బతికితే చాలదు
తోటివారి బతుకులకు ఆలంబన కావాలి
మీ ఆత్మీయులకు ఆదర్శంగా నిలవాలి
ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుకుంటూ 
ఇంటికే పరిమితమై
జగతిని మరవాలి 
శ్రమైకజీవులు తమ పనులు సైతం త్యాగం చేస్తున్నారు
ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా సైతాన్ ను తరిమేందుకు.
నువ్వొక్కడివే 
కాదు కాదు 
మీ కుటుంబమంతా  
కరోనాతో యుద్ధం చేస్తుంటారు
ఈ యుద్ధం ఒక ప్రపంచ యుద్ధం                                    కనిపించని వికృతితో పోరాడే ప్రచండ యుద్ధం
మానవుడు అజేయుడని నిరూపించే యుద్ధం
ఒక సరికొత్త యుద్ధం 
చేతులు చేతులు కలవని 
ఒక సంఘీభావ మానవాహార యుద్ధం
నీకోసం నీవారి కోసం
అందరినీ బతికించే ఒకానొక  నిశ్శబ్ద సంగీతం
_________________________

4.షాహీన్ బాగ్ స్ఫూర్తిగా

ఎగిరే పతంగం మానవాళి స్వేచ్ఛకు సంకేతం
విరిసే హరివిల్లు రంగురంగుల ఐక్యతకు చిహ్నం 
మతాలు వేరైనా జాతులు వేరైనా కలిసిమెలిసి సాగే భారతావని ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఒకటే
అదే సమైక్య భారతం
విచ్చిన్నకర విన్యాసాలు విద్వేషాలు రెచ్చగొట్టే చట్టాలు మనుషుల్ని మానవత్వాన్ని చీల్చే పన్నాగాలు 
ఎవరి కోసం ఎందుకోసం చేస్తున్నారీ విద్వేషాలు?
హిట్లర్కు ఘోరీ కట్టాము ఐక్యతకు పట్టంగట్టాం
మళ్ళీ జాత్యహంకారం నెత్తి కెత్తుకోవడం  ఎందుకు?
మనువాదం ప్రవచించేదెందుకు?
నువ్వు ప్రవచించే వేదం ఏకాలానిది
కాలం మారినా మారని నీ నాదం
ప్రజలందరికీ తెస్తోంది శిరోభారం
ఎక్కడ మానవత్వం పురివిప్పుతుందో 
ఎక్కడ మనుషులంతా ఒక్కటై లేచి 
ముక్తకంఠంతో ఎలుగెత్తుతారో
అక్కడే అభ్యుదయం వికసిస్తుంది
ఆనందం తాండవిస్తుంది. పౌరసత్వ సవరణ చట్టం ఎవరి కోసం? ఎందుకోసం ?
ఎవరిని విభజించడానికి?
విభజన సంగీతం కర్ణ కఠోరమని తెలియదా? కలిసిమెలిసి పాడిన  విభావరి వినసొంపని మరిచావా?
మేము కలిసి పాడుదాం ఓకే గీతం
మేం కలిసి పాడుతాం
 ఒకే గీతం
మేం కలిసి ఆడుతాం ఓకే నృత్యం
నువ్వెన్ని విద్వేష రాగాలు పలికినా 
పల్లవించే స్వరాలే లేవిక్కడ?
నువ్వెన్ని కొత్త విన్యాసాలు చేసినా 
చప్పట్లు కొట్టే చేతులే లేవిక్కడ.
మానవత్వం పరిమళిస్తున్నదీ పూదోటలో
మహోన్నతిని సాధిస్తుందీ నేలలో
నువ్వు వేసిన పాచికలు పారవిక్కడ
దృఢ సంకల్ప మానవహారం నిలిచిందిక్కడ షాహీన్ బాగ్ స్ఫూర్తిగా.


పిళ్లా విజయ్
9490122229


5.వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు
           _ పిళ్లా విజయ్
            9490122229

ఇక్కడ ఎవరూ తమ ఆకలి తీర్చలేరని తెలిసిపోయింది చుట్టూ ఎన్నో భవనాలు ఉన్నా వాటికి మనసు లేదని వాళ్ళకు తెలిసిపోయింది
ఎక్కడో దూరాన ఉన్న పేగుబంధం గట్టిగా లాగింది ఒక్కో అడుగు వేసుకుంటూ
ఎర్రటి ఎండల్ని నెత్తిమీద మోసుకుంటూ 
మట్టి పాదాలతో నెత్తుటి అడుగుల్ని  కొలుస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు
చిల్లులు పడ్డ గిన్నె తాళం లేని పెట్టెలతో దేశం కాని దేశం విడిచి సొంత ఊర్లకు వెళ్ళిపోయారు.
బస్సులు లేవు రైళ్లు లేవు 
ఆకలితో చావడం కన్నా కరోనాతో చావడం మేలనుకున్నారు వాళ్లంతా
ఈ నిర్భాగ్యపు లోకాన్నివాళ్లు నిద్రలోనే సెలవు తీసుకున్నారు
రైలు పట్టాలపై
నిండు చూలాలు దేశానికి బిడ్డను ఇచ్చి రక్తపుమడుగుల్లో రక్తాశ్రువులు చిందిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇవెక్కడ జాడలు
ఇవెక్కడి నీడలు
ఇరవై లక్షల కోట్లు విదిలించారు వాళ్ళు.
ఏ ఒక్కరి కడుపునింపని ఖజానా అది
ఇప్పుడు వాళ్ళు తమ అస్తిత్వాన్ని వెదుక్కుంటారు
పదునెక్కిన భావాలతో 
వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు
చరిత్రను తిరగ రాస్తారు.

6.పిడికిలెత్తిన పతాకం
                     __ పిళ్ళా విజయ్
_________________________

భారతదేశ పౌరులమైన మేము
దేశ సమైక్యతకు
దేశ సమతకు
మతసామరస్యానికి
నిరంతరం పాటుపడతామని
ప్రతిన చేస్తున్నాం
కా.. కా.. అంటూ 
పట్టిక లంటూ 
మమ్మల్ని విభజిస్తే
మేం సహించం
మేం ఊరుకోం
రాజ్యాంగం మాకు ఆదర్శమని ఎలుగెత్తి చాటుతాం
గాంధీ నడచిన
పరమత సహనం  బాట భారతీయ సజీవలక్షణం
అది పూలదండలో దారంలా
దేశభక్తుల గుండె లోతుల్లో
నిలిచి వుంటుంది
ఈశ్వర్ అల్లా తేరే నామ్
పలికినదీ నేల
సబ్ కో సమ్మతి కై సత్యాగ్రహం
చేసిందీ జనసంద్రం
నాజీలబాటలో నడిచే వారికి
కత్తులతో కుత్తుకలు కోయడం మాత్రమే తెలుసు
ధర్మాగ్రహులకు న్యాయం కోసం నిలబడడం తెలుసు
రాజ్యాంగం కోసం సత్యాగ్రహం చేయడం తెలుసు
బలిదానం కోసం బలిపీఠం ఎక్కడం తెలుసు
అందరినీ కలుపుకొని నింగిలోకి ఏక్తా పతాకం ఎగురేయడం తెలుసు
భారతీయత లో కనిపించే ఏకత్వం చూడని జాతి పీఠమెక్కినా
పాతాళానికి జారిపోయినట్లే
అది జారుడు మెట్లపై నిలిచిన
పీఠమే

పలుకుల శిల్పం7(2016)

భావం నిశ్శబ్దం లో పుట్టి 
శబ్దంగా  మారి సంకేతమైంది 
సంకేతానికి సౌందర్యమబ్బి 
భావాల ఆకృతిగా భాష వచ్చి నిలిచింది 
భాష ప్రజల సమైక్య సృష్టి 
ప్రకృతిలో తానొక బిందువై 
సింధువుగా మారేందుకు వెఅసిన పోలికేకలలో  
వికసించిన సౌందర్యాత్మక ధ్యానం భాష 
భాష ఒకర్నోకర్ని మరోకరిలోకి ప్రవహింపజేస్తుంది 
భాష ఆత్మీయ అనుభూతుల కోటల్ని నిర్మిస్తుంది 
రోబో లయినా 
గ్రహాంతర వాసులైనా 
భాష కోసం తహతహ లాడతారు 
భాష మన ఆయువుపట్టు 


అల్లుకు పోవడం8(2016)


చేస్తున్న పని ప్రధానమే 
చేసిన పనీ  ప్రధానమే 
చేసిన దాని కన్నా చేయాల్సిన పని ఎంతో ప్రధానం
 చేసిన దాన్ని డంభాలు చెప్పుకోకు 
చేసింది చరిత్ర లోకి వెళ్లి పోయింది 
అరిగి పోయిన రికార్దాయిపోతుంది 
చేసేదే నీకు కొంత మిగిలిస్తుంది 
తాడును పేని నట్లు
 దివ్యంగాన జడను అల్లినట్లు
 భవిష్యత్తు లోకి ప్రతి నిమిషాన్ని పట్టుకొని 
అల్లుకు పోవడం 
ఒక సాలె గూదు తనం 
మజా అంతా రేపేటి ఉషస్సులో వుంది  

 సహజ సూత్రం9(2016)


గ్రహాలు సౌరకుటుం బాలు నక్షత్ర మండలాలు 
నెబ్యూలాలు కృష్ణబిలాలు 
ఒకటేమిటి సమస్త బ్రహ్మాండం 
విస్వాకారమై ఎటో వెళ్ళిపోతోంది 
మనిషి మనసు విశ్వంతో లయమై 
కళ్ళెం లేని గుర్రపుడేక్కల చప్పుడులో కలిసి పోయింది 
కాలాన్ని పట్టుకునేందుకు విశ్వయత్నం చేసి 
మహావిస్పొటనం వద్ద కాలాన్ని అధిరోహించాడు 
ఏదో శక్తి 
అదే గురుత్వాకర్షణ తరంగశక్తి 
ఆకర్షణ వికర్శణల  వైరుధ్యశక్తి 
సౌరకుటుంబాన్ని ఒకే కుటుంబంగా నిలబెడుతోంది 
ఏదో బంధం 
అదే ఆత్మీయతానుభంధం 
ప్రేమద్వేషాల సమన్వయం 
మానవ కుటుంబానికి ఏకసూత్రమై 
వసుధైక కుటుంబాన్ని ఆవిష్కరిస్తోంది 
మానవ అస్తిత్వానికి తొలివెలుతురు 
 భూగొళం పై సముద్రం లో ఏకకణరూపమై వెలసింది 
పంచ భూతాల లయలో 
ఏక కణం బహుకణమై 
ప్రొటో ప్లాజం నుంఛి ప్రాణస్పందన పొందింది 
లతలు తరులు సరీ సృపాలు సూక్ష్మ స్తూల జీవులు
బహు ముఖాలుగా జీవం విస్తరించింది 
జీవకోటి  ఇతిహాసం లో 
హోమో సెపియన్ నిలుచున్నాడు  మానవుడై 
ప్రకృతిలో తననుతాను చూసుకుంటూ 
తన మస్తిష్కం లొ జరిగే కల్లోలాలను 
ఒడిసి పట్టుకునేందుకు ఎన్నోఎన్నెన్నో విన్యాసాలు చేశాడు 
ప్రకృతిలో విలీనమౌతూ 
సరిగమల గమకాలలో కవితాగానం చేశాడు 
చిత్రాను భూతుల స్పందనలను చిత్రం లో బంధించాడు 
ప్రకృతితో అలీనమౌతూ 
అదుపు సాధిస్తూ ఎదిగాడు మృత్యుం జయుడై 
ఒక్కోసారి అదుపు కోల్పోయి దిగంతాల కావల నిలబడి అర్తిస్తున్నాడు మహాశక్తికై 
చక్రం మనవ పురోగమన చరిత్రలో ఒక మైలురాయి 
కదలిక జీవకోటికి  ప్రాణ ప్రదం 
చక్రం తిప్పిన మనిషి 
జగతిని మరోమలుపు తిప్పేందుకు 
కేంద్రకాన్ని బద్దలు కొట్టాడు 
ఎలక్ట్రాన్ ప్రోటానుల విన్యాసంలో 
పరస్పరవైరుధ్యం లో తన్ను తానుఆవిష్కకరించుకున్నాడు   
తన గతికి పురోగతికి 
మూలం మార్పేనని రూడీ పరుచుకున్నాడు 
మార్పు సార్వజనీననం 
ఒక సార్వత్రిక సత్యం 
కొత్తగా చిగురించేపుష్పం 
కాల సూత్రానికి కట్టుబడి ఫలంగా  మారుతూ వుంటుంది 
ఫలం తననుతాను సమర్పిచుకుని
మరో వృక్షంగా మారి ఫల పుష్పాదులను జగతికందిస్తుంది 
పంచభూతాలు అంతసూత్రమై
కాలసూత్రానికి అనుబందమై ప్రపంచాన్ని అలరిస్తాయి 
మనిషి మనుగడ గతితార్కిక సూత్రానికి నిబద్దమై 
 నిత్య నూతనంగా భాసిస్తోంది 
 ప్రకృతి నిరంతరం మారుతూ 
విశ్వ యవనిక పై  కొత్త దృశ్యాలను చూపుతుంది 
మనిషి మాత్రం   గతాన్ని మరువలేక 
భవిష్యత్తును పట్టుకునేందుకు పరిబ్రమిస్తున్నాడు 
తనచుట్టూ తాను ఒక శకలంగా 

అలిగితివా!10

ప్రియా అలిగితివా
అలిగితివా ప్రియా!
నువ్వు నాపై అలిగితివా?
ఎందుకో చెప్పు  నా నేరం.

నాకు తెలుసు
నీ అందమైన మనసు
సొగసైన నీ మది భావాల ఉషస్సు
 
చెదరని బెదరని
నీ నడకలలో హొయలు


నువ్వలగనేలనొ?
నన్ను బంధించి నీ కళ్ళలో దాచి,
అల్లరి చేసావు.

కారణమడిగాన?
చెప్పకనే చూపుతున్నావు బుంగమూతి,
ఎఱ్ఱని చెక్కిళ్ళతొ.


నువ్వలిగితివేని?
సంశయంబులో చూడదలిచితె, సఖీ-
-నా మాట నమ్మవ?


సకస :2937
సహస్రకవి పేరు:పిళ్లా కుమారస్వామి
కవిత సంఖ్య 1

నిరీక్షణ

ఒక్కో క్షణం ఒక్కో యుగం లా సాగి
నీ అడుగుల సవ్వడికోసం
కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ నేను
తడిలేని నేల మొయిలు పలకరింపుకు పలవరించినట్లు

నీ వీణలాంటి స్వరం వినాలని
గంటల తరతరబడి నీ నిశ్సబ్ద తరంగాల కోసం
ఎదురుచూస్తూ ఒక వేకువలో ఒక మెలుకవలో
పచ్చని నేలను ముద్దాడటానికి   నింగి ఇంద్రధనసుకు వేలాడినట్లు


గుండె గదిలో తీయనిరాగం పలికినప్పుడు
నీ హృదయ పు కోవెల తలుపు తట్టి
ఒక కాలాన్ని ఆకులా రాలుస్తూ అలా అలా
ఒక్కో తార నేలకు మెల్లమెల్లగా దిగినట్లు

వాట్సాప్ నిండా ఎన్నో వర్తమానాలు
ఎన్నెన్నో పద చిత్రాలు
ఎన్నెన్నో గుసగుసల రహస్య సందేశాలు
రెండు తలకట్లకోసం ఎన్నిసార్లు తడుములాటలో
ఒక చినుకు కోసం మట్టిమనిషి తహతహ లాడినట్లు


మారెదెన్నడు?

క్షణంలో ఎక్కడెక్కడో వున్నవాల్లతో మాట్లాడుతూంటారు
పక్కనే వున్న మనిషితో మాట్లాడలేక పోతున్నారే?
మగువలు అన్నిరంగాల్లో దూసుకుపోవాలంటారు
ఎవరైనా తెగించి దూసుకొస్తే
లేనిపోనివి అంటగడ్తారే?
అందరూ సమానమని చెపుతూవుంటారు
అంటరానివాడవనో కులం తక్కువనో గుడిలోకి          రానివ్వరే?
అవి చేస్తాం ఇవి చేస్తామంటారునాయకులు
తీరా గెలిచాక ఒక్కపనీ చేయరే?
డేరాబాబల్ని చూశాక బాబాల బండారం బయట పడ్దాక
మళ్లీ బాబాల్ని నమ్ముతుంటారే?
సమాజం మారాలని బిగ్గరగా అరుస్తుంటారు
తాము మాత్రం ఒక్క అడుగైనా వేయరే?
తాము మాత్రం కొంచమైనా మారరా?
మనిషి మారేదెన్నడు?
ఈ సమాజం అడుగు ముందుకు పడేదెన్నడు?



 
 
 
  
 
 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు