ప్రేమంటే
పండగ సందర్భంగా భర్తకు ఓ బహుమతి కొనాలనుకుంటుంది ఆమె. తన దగ్గర డబ్బు లేదు. ఏం చేయాలాని ఆలోచిస్తున్న సమయంలో- రాగి రంగులో పైనుంచి దూకే జలపాతపు అలల లాగా మోకాళ్ల వరకూ నిగనిగలాడుతున్న ఆమె జుట్టు కనిపిస్తుంది. ఆమె నేత్రాలు కాంతితో ప్రకాశిస్తాయి. విగ్గుల తయారీ దుకాణానికి వెళ్లి తన అందమైన జుట్టును అమ్మేస్తుంది. తాత తండ్రుల నుంచి భర్తకు సంక్రమించిన బంగారపు గడియారానికి వున్న తోలు గొలుసుకు బదులుగా ప్లాటినం గొలుసును కొంటుంది. అదే రోజున తన భార్యకు మంచి బహుమతి కొనాలనుకుంటాడు భర్త. జలపాతపు అలలను తలపించే జుట్టుకు పెట్టుకోడానికి అందమైన, ఖరీదైన హెయిర్ క్లిప్పును బహుమతిగా తెస్తాడతను. అందుకోసం తన చేతికున్న బంగారపు గడియారాన్ని అమ్మేస్తాడు. కానీ... హెయిర్ క్లిప్ పెట్టుకోడానికి ఆమెకు జుట్టు లేదు, ఆమె తెచ్చిన ప్లాటినం గొలుసు పెట్టుకోడానికి అతని వద్ద గడియారమూ లేదు.'' ఇది ప్రముఖ అమెరికన్ రచయిత ఓ.హెన్రీ రాసిన 'ది గిఫ్ట్ ఆఫ్ ది మ్యాగి' కథ. ఈ కథ చదివితే- అయ్యో! అనిపిస్తుంది మనకు.
✔ అదే సమయంలో వారిదెంత అపురూపమైన ప్రేమో అని, ఒకరికోసం ఇంకొకరు అని అనిపిస్తుంది కదూ!! 'కొన్ని హృదయాలు/ ఎప్పటికీ బ్రతికుంటాయి/ అయితే-/ అమృతాన్ని తాగి కాదు/ ప్రేమను ధారపోసి' అంటాడో కవి. ఈ కవి భావన హెన్రీ కథలోని పాత్రలకు చక్కగా సరిపో తుంది.
ప్రేమంటే తీసుకోవడం కాదు... ఇవ్వడం. మనవైపు నుండి ప్రవహించే ఒక కాంతిపుంజం. యుగయుగాలుగా, తరతరాలుగా ఏ భాషకు, మరేభావానికి లొంగని అనిర్వచనీయ పదం. భావ వ్యక్తీకరణకు భాష పుట్టక ముందే చిగురించి వసివాడని కుసుమం ప్రేమ.
ప్రేమంటే ఆకర్షణ కాదు. గంధపు చెక్క అరగదీసేకొద్దీ పరిమళాలను వెదజల్లినట్లు, వేణువు తనువు నిండా గాయాలైనా తలపులూరే గానామృతాన్ని పంచినట్లు- ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికోసం ఒకరుగా... ఇద్దరూ ఒక్కరుగా బతకడమే ప్రేమ. అందుకే అంటారు- 'ప్రేమనిచ్చిన... ప్రేమ వచ్చును' అని. 'మనసుచే, వాక్కుచేత, కర్మంబుచేత/ కలుషితములు కాదగిన వీ వలపు లవని,/ తపసుచే, తాల్మిచే, ధ్యానధారచేత/ లీనమై యైక్య మీయ జాలినది ప్రేమ' అంటూ 'తృణకంకణము' కావ్యంలో వలపుకన్నా నిర్మల ప్రేమ ఉదాత్తమైనదని, 'వలపు నశియించియును ప్రేమ నిలువగలదు' అని ఘంటాపథంగా చెప్పారు రాయప్రోలు.
✔సరళీకరణ శకంలో ప్రేమ ఒక వ్యాపార వస్తువుగా మారింది. ప్రేమను వ్యక్తిత్వంతో కాక, శరీరంతో, అందంతోను కొలవడం మొదలయ్యాక... ఆ ప్రేమ మార్కెట్ అయింది. సున్నిత పార్శ్వాల్ని కోల్పోయింది. అందుకే ఓ పెద్దాయన చెప్పినట్లు- 'ప్రేమ ఫ్రాన్స్‌లో ఒక కామెడీ... ఇంగ్లండులో ఒక ట్రాజెడీ... ఇటలీలో ఒక ఓపెరా... జర్మనీలో ఒక మెలోడ్రామా... ఇప్పుడు ప్రేమ ఒక మార్కెట్ సరుకు'. ప్రేమికులరోజున పెద్ద వ్యాపారమే నడుస్తోంది.
🔅దేశంలో ఒక్క 'వాలెంటైన్స డే' నాడే రూ.1300 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని భారత వాణిజ్య మండలి అంచనా. 'ప్రేమను కొనలేవు. కాని దాని కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది' అని హెన్రీ యంగ్‌మన్ చెప్పింది నిజమేనని ప్రపంచీకరణ తేల్చింది. మరోవైపు ప్రేమ భావనకు కులాలు, మత నమ్మకాలు, ఆచారాలు అడ్డుగోడలుగా నిలిచాయి.
కన్నబిడ్డలను 'పరువు' పేరుతో కడతేర్చే తండ్రులు, ప్రేమించలేదని ప్రియురాలిని కడతేర్చే ఉన్మాదులు ప్రేమకు కంచెలు కడుతున్నారు. 'ప్రేమంటే కలిసుండటమే కాదు... దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం' అని, 'ప్రేమను ప్రేమిస్తే తప్ప జీవితం జీవించదు' అని తెలుసుకోలేకపోవడం అవివేకం.
'స్నేహం నీడనిచ్చే చెట్టు అయితే, దానికి పూచే పువ్వు ప్రేమ' అన్నాడు కవి కాలరిడ్జ్. అలాంటి 'ప్రేమ... ఋతువులతో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా మొగ్గ తొడిగి, వికసించే అపురూపమైన పుష్పం' అని అభివర్ణించాడు ఖలిల్ జిబ్రాన్. అలాంటి ప్రేమను ఒక్కరోజుకే పరిమితం కాదు. బలవంతంగా తీసుకునే వస్తువు కాదు. అందుకే అంటాడు గురజాడ- 'మరులు ప్రేమని మది దలంచకు/ మరులు మరలును వయసు తోడనె/ మాయ మర్మములేని స్నేహము, బ్రతుకు సుకముకు రాజమార్గము' అని.
ప్రేమంటే ఒకరోజుతోనో, రెండు రోజాపూవులివ్వడంతోనో ముగిసిపోయేది కాదు. జీవితకాలం కొనసాగే సజీవ స్రవంతి. విఫలమైన ఎదలోనూ ప్రేమను అంకురింపజేసుకోవాలి. అందుకే అంటారు ప్రేమ గెలిచినా ఓడినా మధురంగానే వుంటుందని. ప్రేమంటే కేవలం ఒకరి కోసం బతకడం లేదా చావడం కాదు. ప్రేమను పంచుకున్న వ్యక్తుల ఆశయాలను, సిద్ధాంతాలను కూడా పంచుకోవాలి. బలాలను, బలహీనతలనూ ప్రేమించగలగాలి. అంతటి మధురమైన ప్రేమ జెన్నీ- మార్క్స్‌లలో కనిపిస్తుంది.
✔'పెట్టుబడి' గ్రంధంతో ప్రపంచ గతినే మార్చిన మార్క్స్... గొప్ప ప్రేమికుడు కూడా. 'ఈ జగతి నందించు/ కీర్తి భాగ్యములైన/ కొరగావు/ నీ కనుల కొస మెరుపుకూ/ సరిగావు/ నీ ఎద యిచ్చు నెలివెచ్చకూ/ నా గీతి నీలోన స్పందనలు కలిగించి/ ఆవేశమున నీ నయన ద్వయంబు/ జాలు వార్చే బాష్పకణములేమిన్న/ ఆ కీర్తి కన్నా...' అంటూ జెన్నీకి మార్క్స్ అందించిన ప్రేమ సందేశం ఇది. ప్రేమనే భ్రమల్లో కొట్టుమిట్టాడుతున్న నేటి యువతకు జెన్నీ-మార్క్స్‌ల ప్రేమ ఆదర్శనీయం.
మానవాళిని మార్క్స్ ప్రేమించినంత గాఢంగా మరెవరూ ప్రేమించ లేదంటే అతిశయోక్తి కాదు. చివరి శ్వాస వరకూ తన మేధస్సునూ ఆచరణనూ మానవాళి విముక్తి కోసమే ధారపోసిన మహనీయమూర్తి ఆయన. అన్నీ తానై మార్క్స్ వెన్నంటి నిలిచి, వారి ప్రేమ అనన్యమని.. అనుసరణీయమనీ ప్రపంచానికి చాటిచెప్పిన ప్రేమమూర్తి జెన్నీ. అలాంటి ఆదర్శమూర్తుల ప్రేమబంధమే యువతరానికి ఆదర్శం కావాలి.
( ప్రజాశక్తిసంపాదకీయం)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి