మార్క్సిస్టు దృక్పథం

         మార్క్సిస్టు దృక్పథం                                                       
         గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని మార్క్సిజం అంటారు దీనిని మార్క్స్ ప్రతిపాదించారు కాబట్టి దీన్ని మార్క్సిజం అన్నారు.గతి అనగా చలనం. ఆ చలనం వల్ల ఏర్పడే మార్పుల గురించి చేసే తర్కాన్ని  గతితర్కం అన్నారు.
          గతితార్కిక భౌతిక వాదం అంటే   
ప్రకృతిలో మార్పుకు సంబంధించినదని అర్థం. చారిత్రకభౌతికవాదం అంటే సామాజమార్పుకు సంబంధించినదని అర్థం.

ప్రకృతిలో ఏది శాశ్వతమైనది కాదు. ప్రకృతిలో ప్రతి పదార్థంలోనూ చలనం ఉంటుంది. అది మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఏది స్వతంత్రంగా ఉండలేదు. అది ఇంకొక దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలో ప్రతిదీ పరస్పర ఆధారితం. పైగా రెండు వస్తువుల మధ్య ఆకర్షణ వికర్షణ ఉంటుంది. అలాగే పాతవి నశిస్తూ కొత్తవి వస్తుంటాయి.

ప్రకృతిలో ప్రతిదీ  క్షణక్షణం  మారుతూ ఉంటుందని  బుద్ధుడు క్రీ.పూ. 500 లోనే చెప్పినాడు.పరస్పర విరుద్ధ శక్తుల మధ్య జరిగే  సంఘర్షణే మార్పుకు కారణం అని  హెరాక్లిటస్ అన్నాడు.వీరిద్దరూ దాదాపు సమకాలికులే. ప్రకృతిలో ఉన్న పదార్థాలలో వున్న ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు మొదలైనవన్నీ చలనంలో ఉంటాయని ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అదే సమయంలో ప్రతి  రెండు పదార్థాల మధ్య ఆకర్షణ,  వికర్షణ  సమానబలాలతో ఉంటుంది.దీనినే వైరుధ్యాలు అన్నారు. మన సౌరకుటుంబంలో భూమికి సూర్యునికి మధ్య ,భూమికి ఇతర గ్రహాలకు మధ్య ఆకర్షణ వికర్షణ  సమాన బలాలతో ఉంది.

పదార్థంలో మార్పును పరిశీలించడానికి తోడ్పడే వాటి ని గతితార్కిక చలనసూత్రాలు అంటారు. ఇవి ప్రధానంగా 
1. పరిసరాలకు పదార్థానికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది .ఆ పదార్థం గురించి తెలుసుకోవాలంటే బాహ్య ప్రపంచంలో దానితో సంబంధం ఉన్న అన్ని అంశాలను పరిశీలించాలి .దీనిని సంపూర్ణంగా మనం ఎప్పటికీ చేయలేం.
 కానీ అన్ని కోణాల్లో పరిశీలించాలన్న సూత్రం మాత్రం మనల్ని తప్పులు చేయనీకుండా  చేస్తుంది. 
2. పదార్థాన్ని దాని అభివృద్ధి క్రమంలోనే ,దాని మార్పుల్లోనే గుర్తించాలి. అంటే పదార్థాన్ని  పరిశీలిస్తున్నప్పుడు దానిలో సూక్ష్మంగా జరిగే మార్పులను, ఆ మారుతున్న పరిస్థితులను గమనించాలి. ఉదాహరణకు ఒక జామకాయ ను మనం పరిశీలించినప్పుడు ఆ జామకాయ లోపల జరుగుతున్న మార్పులను మనం పరిశీలించాలన్న మాట. ఆ జామకాయ తో సంబంధం ఉన్న గాలి వెలుతురు నీటిని గురించి కూడా మనం పరిశీలించాలి. 
3. పరిమాణం గుణం గాను గుణం పరిమాణం గా మారుతూ ఉంటుంది. ఒక పదార్థం బాహ్య లక్షణాలను తెలియజేసే దానిని పరిమాణం అంటారు దీనిని సంఖ్యల్లో, డిగ్రీలలో చెప్తారు. ఆ పదార్థం అలా ఎందుకు ఉందో అది ఇతర పదార్థాలతో ఎలా విభేదిస్తుందో తెలిపే లక్షణాలను గుణం అంటాం.  పిందె పండుగా మారడం, గొంగళిపురుగు సీతాకోక చిలుకగా మారడం, కోడిగుడ్డు పిల్లగా మారడం ఇవన్నీ పరిమాణం గుణంగా మారడం లాంటివి. వీటన్నిటిలోనూ  వాటి పరిమాణం మారుతున్న కొద్దీ వాటి గుణంలో కూడా మార్పు వస్తుంది. అలాగే డబ్బు పరిమాణం పెరిగితే పెట్టుబడిగా మారిపోతుంది. పరిమాణంలో మార్పు దాని గుణంలో మార్పు కు దారితీస్తోంది. విత్తనం మొక్కగా మారడం కూడా అంతే. గోరువెచ్చని పాలల్లో మజ్జిగ వేస్తే పెరుగుగా మారి పోవడం, పసుపులో సున్నం కలిపితే అది ఎర్రగా మారి పోవడం ఇవన్నీ కూడా  పరిమాణం గుణంగా మారడం లాంటివి.ఇలా  మార్పు చెందడంలో అనేక లోపల బయట అనేక శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కోడిగుడ్డు పిల్లగా మారడానికి కోడి గుడ్డుకు తగినంత ఉష్ణోగ్రత బయటనుంచి అందజేస్తేనే అది వీలవుతుంది. అలాగే విత్తనం ఒక చెట్టు గా మారాలన్నా , ఒక పిందె కాయగా  మారాలన్నా, ఒక కాయ పండు గా మారాల న్నా  బయటనుంచి తగినంత నీరు , వెలుతురు, గాలి లభించాలి.అలాగే ఆ కాయ లోపల కూడా అనేక శక్తులు పనిచేస్తుంటాయి .ఒక  దుర్మార్గుడైన వ్యక్తి సన్మార్గునిగా మారాలంటే అనేక బాహ్య పరిస్థితుల ప్రేరణ ఉంటేనే సాధ్యమవుతుంది .అలాగే అంతర్గతంగా అతని లో మార్పులు జరుగుతున్న క్రమంలోనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకు మన పురాణాల్లోని వాల్మీకిని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

 అది భౌతిక వాదులు మార్పును అంగీకరించరు. పాతది కొత్తది వస్తుంది అని  అంటారు. కానీ అది మళ్లీ మళ్లీ జరుగుతుందంటారు.  గుణాత్మకమైన మార్పును అంగీకరించరు .వేదకాలం నుంచి ఏ మార్పు లేదని చెబుతుంటారు .ఈనాడు అభివృద్ధి చెందిన విజ్ఞానం కూడా గతంలోనే ఉన్నదని ఇప్పుడు కొత్తగా కనుగొన్నదేమీ లేదని కూడా చెబుతుంటారు.
కొంతమంది పరిమాణాత్మక మార్పులను గుర్తిస్తారు. గుణాత్మక మార్పును వీరు గుర్తించలేరు. మరికొంతమంది గుణాత్మకమైన మార్పునే  గుర్తిస్తారు. పరిమాణాత్మక మార్పు ను గుర్తించరు. ప్రకృతిలో జరుగుతున్న పరిణామక్రమమే పరిమాణాత్మక మార్పు. ఉన్నట్టుండి  కొత్త గుణాలు సంతరించుకొనే మార్పే గుణాత్మకమైన మార్పు. దీనినే విప్లవాత్మకమైన మార్పు అంటారు. పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులు రెండు కలిసి వైరుధ్య క్రమం అవుతుంది.

       ఒక పదార్థంలోగానీ, ఒక పరిణామంలో గాని రెండు పరస్పర వ్యతిరేక అంశాలు ఉంటాయి.వాటి మధ్య ఘర్షణ,ఐక్యత ఉంటాయి ఈ రెండిటి వల్లనే ఆ పదార్థంలో చలనం ఉంటుంది. ఈ ఘర్షణ ఐక్యత లనే వైరుధ్యం అంటారు. సహజంగా ఉండే వ్యతిరేకతలను వైరుధ్యం అనరు .వాటిని మార్చడానికి కూడా వీలు పడదు. అసహజంగా ఉన్న వైరుధ్యాలను తప్పకుండా మార్చడానికి వీలు అవుతుంది. పగలు రాత్రి , చలి వేడి ,ఎండా వాన, వెలుతురు చీకటి, నలుపు-తెలుపు, జననం మరణం ఇలాంటివి సహజమైన వైరుధ్యాలు. వీటిని మార్చడానికి వీలు కాదు.  కలిమిలేములు పేద ధనిక, కష్టసుఖాలు ,కులాలు, మతాలు మధ్య అంతరాలు మొదలైన వైరుధ్యాలను మార్చుకోవడానికి వీలు అవుతుంది. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ శాశ్వతమైంది ఐక్యత మాత్రం తాత్కాలికంగా ఉంటుంది .అది సాపేక్షంగా కూడా ఉంటుంది. ఒక పదార్థం లోపలవున్న వైరుధ్యాన్ని ఆంతరంగిక వైరుధ్యం అంటారు. రెండు పదార్థాలు లేదా రెండు వస్తువుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని బాహ్యవైరుధ్యం అంటారు. వైరుధ్యంగా ఉన్న అంశాల లో ఏది ప్రధానాంశమో గుర్తించాలి. అందులో ఏదో ఒకటి తన ఆధిక్యం కోసం మరొక దానితో పోరాడుతూ ఉంటుంది .ఈ రెండింటి మధ్య ఉన్న పోరాటమే అభివృద్ధికి మూలం .ఈ పోరాటం లేనిదే అభివృద్ధి లేదు. సమాజంలో కూడా వైరుధ్యాలు ఉంటాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శత్రు వైరుధ్యం. రెండోది మిత్ర వైరుధ్యం. రెండు  విభిన్న శక్తుల మధ్య  పొత్తు కుదుర్చుకోవడం వీలైతే అది మిత్ర వైరుధ్యం ,పొత్తు కుదుర్చుకోవడం  వీలు లేకపోతే అది శత్రు వైరుధ్యం. స్త్రీ పురుషుల మధ్య ,రైతు వ్యవసాయ కార్మికుల మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యం. వీరి మధ్య సామరస్యం కుదుర్చుకోవచ్చు. పెట్టుబడిదారులకు కార్మికులకు మధ్య , భూస్వాములకు రైతులకు మధ్య ఉన్నది శత్రువైరుధ్యం.

            ప్రతి పదార్థానికి స్థలం, కాలం ముఖ్యమైనవి. ఒక విషయాన్ని చెప్పడానికి దాని కాలాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి  చెప్పాలి .దాన్ని అర్థం చేసుకోవాలన్నా దాని స్థల కాలాదుల్లోనే అర్థం చేసుకోవాలి. ఐన్ స్టెయిన్ చెప్పిన సాపేక్షతా సిద్ధాంతం ఇదే చెపుతుంది. ఏ పదార్థాన్ని (విషయాన్ని) గురించి చెప్పాలన్నా కాలం ప్రధానమైనది . అలాగే చారిత్రక సందర్భంలో దాన్ని చెప్పాలి.
            ఇంతవరకు చర్చించిన విషయాలను గతి తార్కిక సూత్రాలు అంటారు. ఇవి విజ్ఞాన శాస్త్రం అందించిన విషయాలు వీటిని సమాజానికి వర్తింప చేస్తే దానిని చారిత్రక భౌతికవాదం అన్నారు. సమాజాన్ని గానీ ,
ఏదైనాఒక పదార్థాన్ని గాని ,వస్తువులు గాని లేదా పరిశీలించే అంశాన్ని గాని మన భావాల ప్రమేయం లేకుండా వాస్తవాలను తీసుకొని  గతితార్కిక సూత్రాల వెలుగులో చర్చిస్తే దాన్ని మార్క్సిజం అన్నారు. మార్క్సిజం చెప్పిన పై సూత్రాలను   పరిశీలించే అన్ని అంశాలకు వర్తింపజేయవచ్చు. అలా చేసినప్పుడు పరిశీలకునికి సరైన ఆలోచనా క్రమం  ఏర్పడటమే కాక ఆ అంశం పట్ల వాస్తవిక దృష్టి ఏర్పడుతుంది.
       మన సొంత భావాలను పరిశీలించే అంశంలోకి చొప్పిస్తే సరైన ఫలితం రాదు. దీనిని స్వీయ మానసిక ధోరణి అంటారు. అలా కాకుండా పరిశీలించే  అంశాన్ని అన్ని వైపుల నుంచి, ఆ అంశానికి ఉన్న ఇతర సంబంధాల గురించి , కాలమాన సామాజిక సందర్భాలలో పరిశీలిస్తే మనకు సరైన ఫలితం వస్తుంది. ఇదే విధమైన పరిశీలనను తెలుగు సాహిత్యం పై చేస్తే అది మార్క్సిస్టు ఆలోచనా విధానం  అవుతుంది.ఈ ఆలోచన విధానాన్ని  క్రిస్టఫర్ కాడ్వెల్, జార్జి థాంప్సన్, జార్జ్ లూకాస్, ఎర్నెస్ట్ ఫిషర్ ,రేమండ్ విలియమ్స్ మొదలైన వాళ్లు అభివృద్ధి చేశారు. తెలుగు సాహిత్యంలో మార్క్సిస్ట్ దృక్పధాన్ని ప్రవేశపెట్టిన వారిలో 
రా రా ,మద్దుకూరి చంద్రశేఖరరావు ,కొ.కొ., శ్రీ శ్రీ., కె.వి రమణ రెడ్డి ,త్రిపురనేని మధుసూదనరావు ,చేకూరి రామారావు మొదలైనవారు  కీర్తిశేషులైన వారిలో ప్రసిద్ధులు.
సాహిత్యం సమాజానికి దర్పణం వంటిది .సాహిత్యం ఒక సామాజిక ఉత్పత్తి. సమాజం లేందే సాహిత్యం లేదు .సాహిత్యానికి స్వతంత్రంగా ఉండే లక్షణం లేదు. సమాజంలో అది ఒక భాగం . ప్రతి పదార్థం లో రెండు విరుద్ధ శక్తులు ఉన్నట్లే సమాజంలో కూడా రెండు విరుద్ధ వర్గాలు ఉంటాయి. అవి ఒకటి పీడిత వర్గం .రెండు పీడించే వర్గం. వాటి మధ్య ఘర్షణ , ఐక్యత ఉంటుంది. ఈ సమాజం నుంచి వచ్చిన సాహిత్యకారుడు కూడా ఏదో ఒకవర్గం వైపు మొగ్గు చూపుతాడు ..అందువల్ల సాహిత్యకారులకు ఉన్న వర్గ దృక్పథం బట్టే సాహిత్యం పుడుతుంది. సమాజానికి   ఆర్థికం పునాది వంటిది. సమాజంలో  మానవుని అవసరాల రీత్యా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ఉంటాయి. దీని అభివృద్ధిని బట్టే సాహిత్యం కళలు ,ఉత్పత్తి అవుతాయి. సమాజంలో ఉన్న రెండు వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మనదేశంలో  కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు, మతాల మధ్య వైరుధ్యాలు, దోపిడీ వర్గం పీడితవర్గం మధ్యనున్న వైరుధ్యాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి..
    
         సాహిత్యకారుడు తన రచన కోసం,  తనకున్న కుల దృక్పథంతోనూ, వర్గ దృక్పథంతో నో,మత దృక్పథంతోనో,ఆరోజుల్లో సమాజంలో నెలకొన్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి , ఒక వస్తువును స్వీకరిస్తాడు. తనకున్న ప్రత్యేకమైన శైలితో ఆ రచనను పూర్తి చేస్తాడు. ఆ రచనను అధ్యయనం చేసేటప్పుడు పైన చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయడాన్ని మార్క్సిస్టు దృక్పథం అంటారు. భారతాన్ని  పరిశీలిస్తే వ్యాసుడు అందులో బ్రాహ్మణ క్షత్రియ వర్గాలను సమర్థిస్తూ రాశాడు. రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని వేమారెడ్డి హరివంశాన్ని మామిడి సింగన్న శృంగార నైషధాన్ని రాయలు మనుచరిత్రను కవులతో రాయించడం వెనుక వారి వర్గ ప్రయోజనాలు ఉన్నాయి అందువల్లనే ఆయా రచనలు వచ్చాయి పీడితవర్గం వైపు నిలబడిన చెరబండరాజు ప్రపంచ పురోగతి మొత్తం శ్రమజీవి నెత్తుటి బొట్టులో ఇమిడి ఉందని అన్నాడు. అలాగే శ్రీశ్రీ  తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరని ప్రశ్నించాడు.ఇలా సాహిత్యకారుడు ఏదో ఒక వర్గ దృక్పథం కలిగి ఉండడానికి అతని సామాజికచైతన్యం తోడ్పడుతుంది. మానవ చైతన్యం భౌతిక ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాదు దానిని సృష్టిస్తుంది కూడా అని లెనిన్ అన్నాడు. సమాజంలోని వైరుధ్యాలను గుర్తించడంలో మార్క్సిస్టు దృక్పథం దోహదపడుతుంది రచయిత చైతన్యం అతను తీసుకున్న వస్తువును బట్టి తెలిసిపోతుంది ఆ రచయితకున్న అవగాహన నుకూడా తెలియజేస్తుంది. రచయితకు చైతన్యం ఎలా వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా రచయిత ప్రాపంచి దృక్పథం,అతను నమ్మిన విలువలు, అతని నిబద్ధత  ఇవన్నీ అతని చైతన్యాన్ని పెంపొందిస్తాయని రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి చెపుతారు. చైతన్యాన్ని బయట నుంచి అందించాలని లెనిన్ చెప్పినారు. రచయిత స్వానుభవం కొంత తోడ్పడుతుంది. రచయిత సామాజిక చైతన్యం పెంపొందించుకుని క్రమంలో అభివృద్ధికరమైన ఆలోచనలు చేస్తాడు .వాటిని సమాజ పురోగతి కోసం ప్రజా ప్రయోజనాల కోసం తన రచనలో వ్యక్తీకరిస్తాడు. ఈ వ్యక్తీకరణ కళాత్మకంగా ఉండాలి. సామాజిక వాస్తవికతను చెప్పడమేగాక భవిష్యత్ పరిణామాన్ని గుర్తించగలిగే శక్తి మార్క్సిస్టు దృక్పథం తోనే సాధ్యం అవుతుంది దీనినే సామ్యవాద వాస్తవికత అని కూడా అంటారు. రచయిత తన రచనలో నవ్యత,గాఢత,క్లుప్తత తీసుకురావాలని తెలకపల్లి రవి చెపుతారు. పూర్వం చెప్పని విషయాలను ఆధునిక భావాలను రచనలో ప్రవేశపెట్టాలన్నారు.
పాఠకుని హృదయాన్ని  కదిలించి, మనసును స్పందించిన జేసి భావప్రక్షాళన చేసేదే ఉత్తమ రచనగా అరిస్టాటిల్ పేర్కొన్నారు. దీన్నే శిల్పం అని కూడా అంటారు.  కళాత్మక రచన అని కూడా అంటారు. రచయిత తన రచనకు తీసుకునే వస్తువును తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులే నిర్ణయిస్తాయి.
శిల్ప ప్రాధాన్యత కోసం తపన చెందినప్పుడు  వస్తువుని పక్కన పెట్టేస్తారు. దాంతో రూపం ముందుకొస్తుంది రూపం .అంటే చెప్పే విధానం. వస్తువు,రూపం లో రూపం ప్రధానమనే భ్రాంతి లో   పడి పోతాడు రచయిత. పద్యంలో చెప్తేనే బాగుంటుందని ,వచనం సరైంది కాదని , నానీలు మంచివని ఇలా రూపాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. రచనలో సామాజిక స్వభావం లేనప్పుడు రూప వాదం మొదలవుతుందని ఫ్లెఖనోవ్  అంటారు. జీవిత సంక్షోభాలను గుర్తించి పరిశీలించి పరిష్కారం సూచించి మనిషిని మరింత చైతన్యవంతుల్ని చేసేదే గొప్ప సాహిత్యం అవుతుందంటారు. పాపినేని శివశంకర్.సాహిత్యం మనిషిని సంస్కారవంతుని చేస్తుందని గురజాడ అన్నారు.
సాహిత్యం చేసే పని భావ ప్రచారమేనని అమెరికా రచయిత ఆప్టన్ సింక్లెయిర్ అంటారు. సాహిత్యం ఒకవైపు భావ ప్రచారం  చేస్తూనే మానవ సంస్కారం లోనూ ,ఆలోచనా ప్రవాహంలోనూ మార్పు తీసుకువస్తుందని బాలగోపాల్ అన్నారు. ఇది ఒక రకంగా బయటనుంచి చైతన్యం అందించే  ఒక విధానం.
సాహిత్యకారులు చాలామంది మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్లే. మధ్యతరగతి బుద్ధిజీవులలో ఎక్కువ భాగం ద్వంద్వ స్వభావం ఉంటుంది . దీని వల్ల  వారిలో మానసిక సంఘర్షణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది . ఈ సంఘర్షణలో  ఏది పైచేయి సాధిస్తే అటు వైపు మొగ్గు చూపుతారు మధ్యతరగతి బుద్ధిజీవులు. ఇలాంటి సంక్లిష్ట సామాజిక జీవితం నుంచి వచ్చిన కవులు రచయితలు తమ రచనలకు సమాజం నుంచి వస్తువులను తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత ప్రపంచీకరణ ప్రపంచంలో సామాజిక జీవితం సంక్షోభంలో ఉంది దీనికి సరైన పరిష్కారాన్ని గుర్తించి అందించాల్సిన బాధ్యత సాహిత్యకారులదే. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో   అసమానతలు,పేదరికం, మూఢనమ్మకాలు, దోపిడీ, అజ్ఞానం మొదలైన వాటిని పోగొట్టడానికి రూపుమాపడానికి సాహిత్యకారులకు మార్క్సిస్టు దృక్పథమే సరైన సాధనం.



__పిళ్లా కుమారస్వామి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు