కరోనా కాలం-- వలస కార్మికుల వెతలు

           

"కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన (వలస జీవికి) బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం" అంటూ శ్రీశ్రీ ఏనాడో రాసిన గీతం నేటి కరోనా కాలంలో వలసకార్మికుల వెతలకు అద్దం పట్టింది.వారి యదార్థ జీవన వ్యథార్థ కథలు సోషల్ మీడియాలో టీవీలో చూసే వారందరి హృదయాలను ద్రవింప చేసింది.
          కరోనా వచ్చి వ్యవస్థలనుకూల్చలేదు. వ్యవస్థలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసిందది.
వలస కార్మికుల యథార్థ నడక దృశ్యాలను వారి వేదనా భరిత గాథల్ని చూపడం ద్వారా వ్యవస్థలోని డొల్లతనం బట్టబయలైంది. ఆకాశహర్మ్యా లతో అద్దాలమేడ లతో అలరాలే నగరాల మేడిపండు నగ్న స్వరూపం  లోకానికి తెలిసిపోయింది. హృదయం లేని ప్రభుత్వాల సిగ్గులేని తనాన్ని ఎత్తిచూపింది.ఈ ప్రపంచం డబ్బుతో నడవదని శ్రమతోనే నడుస్తుందన్న సత్యం ఈ కాలంలో అందరికీ బోధపడింది. ఇంకా అనేక పాఠాలను నేర్పింది.
      చైనాలో కరోనా బయటపడ్డాక దానినర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. చైనాలో  కోవిడ్19 లక్షణాలు బయటపడిన వూహాన్ రాష్ట్రమంతా లాక్ డౌన్( దిగ్బంధనం)ను ప్రకటించింది. ప్రజలందరికీ భోజనాలు ఆ ప్రభుత్వమే సరఫరా చేసింది.దీనికోసం రోబోలను డ్రోన్లను ఇతర టెక్నాలజీని ఉపయోగించుకుంది.

       మనదేశంలో మాత్రం ఆ వ్యాధి గురించి సమాచారం ఉన్నా మోడీ ప్రభుత్వం నమస్తే ట్రంప్ మైకంలో ఉండిపోయింది. కరోనావ్యాప్తి నిరోధం పైన దృష్టి పెట్టలేదు. అంతర్జాతీయ విమానాశ్రయాలు పని చేస్తూనే ఉన్నాయి. సంపన్న వర్గాలు కరోనాను తమతోపాటు వెంటబెట్టుకుని దేశంలోకి వస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు మెల్లగా మొదలయ్యాయి. అలా చివరకు ఏమీ లేని నిరుపేద శ్రామికులకు అంటుకున్నాయి.

ఆలస్యంగానైనా ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కరోనాను అడ్డుకోవడానికి చైనా  అవలంభించిన లాక్ డౌన్ పద్ధతిని అమలు చేసింది. దీని అమలు వెనుక ఏదో రహస్య అజెండా ఉందేమోనని పలువురు నేడు భావిస్తున్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించమన్నారు. అందరూ ఒకరోజే కదా అని ప్రజలు స్వాగతించారు. సాయంత్రం చప్పట్లు కొట్టించారు కూడా. మార్చి 24 నుంచి 21 రోజుల పాటు మళ్లీ లాక్ డౌన్ ప్రకటించింది. ఇదీ కొంతకాలమే కదా అననుకున్నారు ప్రజలంతా. మళ్లీ పొడిగించుకుంటూ పోయారు. దీంతో సంపన్నులు, మధ్యతరగతి ప్రజలు పెద్దగా ఇబ్బందులు గురవ కాకపోయినా పేద కార్మికులకు మాత్రం ఇక్కట్లు మొదలయ్యాయి. ఉన్న డబ్బు అయిపోయింది.ఉన్న సరుకులు అయిపోయాయి. పనులు లేవు. అద్దెలు మాత్రం చెల్లించాలి. ఆకలి పెరిగింది.
ప్రజలు లాక్ డౌన్ తో ఇళ్ళల్లో ఉండిపోయారు.బయటికెవ్వరూ రాలేదు.వారిని ఆదుకునే వారే కరువయ్యారు.  బీహార్, పశ్చిమ బంగా, చత్తీస్ గడ్, ఉత్తరప్రదేశ్,రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో, కర్నాటక రాష్ట్రంలో ని బెంగుళూరు లో పనిచేస్తున్న చాలామంది వలస కార్మికులు పనులు లేకపోవడంతో వారికి బతకడమే గగనంగా మారింది.
కరోనా భయం కన్నా ఆకలి భయమే వారిని వేధించసాగిం ది. కంపెనీ యజమానులు కార్మికులను తొలగించకుండా జీతాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాలు నోటిమాటగా చెప్పాయి. కానీ యజమానులు వాళ్లను తొలగించేశారు. బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కొంత మంది భవన నిర్మాణ యజమానులు కార్మికులకు కొంతకాలం భోజనం పెట్టి మెల్లగా తమ బాధ్యతల నుంచి తప్పు కున్నారు.
       ప్రణాళిక లేకుండా అమలు చేసిన లాక్ డౌన్ విపరీత పరిణామాలకు తెరతీసింది. మిన్ను విరిగి మీద పడ్డట్లు వలస కార్మికుల బతుకులు పై పెనుభారం పడింది.అంతో ఇంతో సంపాదించుకోవడానికి వలస వచ్చిన కార్మికుల బతుకుకు భరోసా పోయింది. వారంతా అవసరం తీరాక నాగరికత విసిరేసిన విస్తరాకుల్లా మిగిలారు. తమ ఇళ్ల వద్ద ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉన్నారో నన్న బెంగ మొదలైంది. భవిష్యత్తు అగమ్యంగా  మారింది.కేరళలో విజయం ప్రభుత్వం మాత్రం వారందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంది. వారికి భోజనాలు వసతి పిల్లలకు క్యారం బోర్డు లాంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.భద్ర లోకపు చిత్ర రూపాన్ని బట్టబయలు చేస్తూ భారతదేశ కాన్వాసుపై ఆ కొస నుండి ఈ కొస దాకా మట్టిపాదాలతో ఎర్రటి నెత్తురు సిరా తో సంతకం చేస్తూ నడక సాగించడం మొదలు పెట్టారు.

      పొట్ట చేత పట్టుకొని వచ్చిన జనం తమకాళ్లను చెప్పులు గా చేసుకుని తమ వూరికి దారెటో  తెలియకపోయినాపోలో మంటూ పోటెత్తారు పెట్టె బేడా సర్దుకుని. వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని నడకతో ప్రారంభించిన వారి ధైర్యాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే. కానీ వారి మార్గం కఠినతరమైనది. పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భవతులు,వికలాంగులు ఇలా వేలాది మంది తాము పనిచేస్తున్న చోట నుంచి స్వస్థలాలకు పయన మయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అచేతనంగా ఉండిపోయాయి.కరోనా ఉంది, అందరికీ అంటుకుంటుంది పోవడానికి వీల్లేదంటూ సరిహద్దుల్లో అడ్డుకున్నారు. అమ్మ పెట్టదు అడుక్కో నివ్వదు అన్నట్లు తాము సహాయం చేయకపోగా వారిని చెక పోస్ట్ దగ్గర ఆపేశారు.
      ఎక్కడో విదేశాల్లో నిలిచి పోయిన భారతీయులను తీసుకురావడానికి విమానాలు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. మన దేశంలో ఉంటూ దేశ నిర్మాణానికి మూలస్తంభాలుగా ఉన్న శ్రామికుల అగచాట్లను మాత్రం పట్టించుకో లేకపోయారు.ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఈ వలస కార్మికులు 8 కోట్ల మంది ఉంటారు. వాస్తవానికి వీరు 15 నుంచి 20 కోట్ల మధ్యలో ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆకలి చావుల కన్నా కరోనా చావే నయమన్న నిర్ణయానికి వచ్చి నడక బాట పట్టిన ఈ వలస కార్మికులకు  కనీసం రైలు, బస్సులు ఏర్పాటు చేయలేదు. 4వ లాక్ డౌన్ కాలంలో శ్రామిక రైలును ఏర్పాటు చేసినా చార్జీలు మాత్రం వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.  ఏదిఏమైనా భారతదేశ చరిత్రలో దేశ విభజన తరువాత సాగిన వలసల కంటే అతి పెద్ద వలస ఈ కరోనా సమయంలో జరిగింది.ఇది దేశంపై పడిన అతి పెద్ద మచ్చ.సమాజానికి విసిరిన ఒక సవాలు.
    ‌   గుండెల్ని పిండి చేసే హృదయవిదారక గాథలు రోడ్ల వెంట రైల్వే ట్రాక్ ల వెంట వినిపించాయి.
        బెంగళూరు నుండి పోటెత్తిన వలస కార్మికులు అనంతపురం హైవే మీద నడుచుకుంటూ వెళ్లారు. వందలాదిమంది గుంపులు గుంపులుగా ఎర్రటి ఎండలో నడిచి వెళ్లారు సంకలో బిడ్డను ఎత్తుకుని ఎంతో మంది నడిచారు. రోడ్డుపక్కన నివసించే వారు వారి బాధను చూసి అక్కడక్కడ టిఫిన్లు భోజనాలు పెట్టారు.వీరి బాధను చూసిన సిపిఎం పార్టీ నాయకులు కొడికొండ చెక్పోస్ట్ దగ్గర,రాప్తాడు దగ్గర, అనంతపురం దగ్గర అక్కడక్కడా షామియానా టెంట్లు వేసి వారి ఆకలి దప్పులు తీర్చారు. ఖాళీ లారీలు పోతుంటే వాళ్ళని అడిగి ఈ వలస కార్మికులను ఎక్కించి పంపించారు.
       రోడ్డుపై నడుస్తూ ఎక్కడైనా షేర్ ఆటోలు కనబడితే దానిలో ఎక్కి ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్లేవారు. అలా  అనంతపురం హైవేపై బీహారు కార్మికులు షేర్ ఆటోలో వెళ్తున్నారు. కొంత దూరం పోయాక పోలీసులు కనిపించడంతో ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది.  ఆటోకు వెనుక వైపున కూర్చుని ఉన్న వాళ్ళ కాళ్లు విరిగిపోయాయి. వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సిపిఎం పార్టీ నాయకులు వెళ్లి వారందరినీ పరామర్శించారు. ఆసుపత్రిలో డాక్టర్లు తమ ఆపరేషన్ చేయలేమని, బెంగళూరు తీసుకెళ్ళమని చెప్పడంతో సిపిఎం నాయకులు వారిని బెంగుళూరు  ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.
        హిందూపురం స్టీల్ ప్లాంట్ స్టీల్ ఫ్యాక్టరీ లో పనిచేసే వారంతా బీహారు, పంజాబు, ఒరిస్సా మధ్యప్రదేశ్ కార్మికులే. ఫ్యాక్టరీ ని లాక్‌డౌన్‌ కాలంలో మూసేశారు. కార్మికులకు కనీస జీతం గాని ఆహారాన్ని గాని అందించకుండా నిర్లక్ష్యం చేశారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికుల పరిస్థితీ ఇంతే.దాంతో వారంతా నడకబాట పట్టారు.
         మౌర్య అనే అమ్మాయిది మరో గాథ.  ఈ అమ్మాయి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో  రోడ్డుపై వెళితే పోలీసులు అడ్డుకుంటారని,   రైల్వే ట్రాక్ పై నడిచి వచ్చింది. మణుగూరు దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు. సిపిఎం నాయకులు వారి పరిస్థితిని గమనించి వారికి భోజనాలు పెట్టించి లారీ లో  వాళ్ల సొంతూరు చేరడానికి ఏర్పాటు చేశారు.
          మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్లోని తన సొంత గ్రామమైన సత్నాకు భర్త తో కలిసి  బయలుదేరిందా శ్రామిక మహిళ.ఆమె గర్భవతి కూడా. మార్గమధ్యంలో నొప్పులు ప్రారంభమై బిడ్డకు జన్మనిచ్చింది. రెండు గంటలు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఆమె 150 కిలోమీటర్లు నడిచింది.తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నుంచి మరో శ్రామిక మహిళ కూడా ఛత్తీస్గఢ్లోని రాజ నంద్గాన్ గ్రామానికి నడుస్తూ నార్సింగ్ లోని జాప్తి శివనూర్ గ్రామం వద్ద బిడ్డను ప్రసవించింది. రామాయంపేట ఆసుపత్రిలో తర్వాత ఆమెను చేర్చినారు. ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు చూసిన పాలకుల మనసు కరుగలేదు. రక్తపిపాసుల రాజ్యమిది రక్తాశ్రువుల గాథ ఇది.
        మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి మధ్యప్రదేశ్ కు వెళ్తున్న 16 మంది కార్మికులు నడిచి నడిచి అలసిపోయి రైల్వే ట్రాక్ పై పడుకున్నారు. వారు గాఢ నిద్రలో ఉండగా తెల్లవారు జామున వారిపై గూడ్స్ రైలు వెళ్ళిపోయింది. ఈ సంఘటన మే ఎనిమిదో తారీకు జరిగింది. ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం పై నెత్తుటి మచ్చగా ఏర్పడ్డాయి.
    కర్నూలు జిల్లా ఆదోని మండలం నుంచి బెంగళూరు ముంబై లలో సిమెంటు పనుల కోసం వెళ్లారు. గుంటూరు కు మిర్చి పనిమీద వెళ్లారు. గుంటూరు నుండి ఆదోని కి ఆ కార్మికులంతా నడుచుకుంటూ వచ్చారు. అక్కడ అక్కడ ప్రజలు భోజనాలు పెట్టి వారికి సాయం చేశారు. తెలంగాణ నుంచి ఛత్తీస్ గడ్ పోతూ చాలామంది చనిపోయారు. అలాగే గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంత మంది చనిపోయారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని సిపిఎం పార్టీ నాయకులు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కూడా.
     బొంబాయిలోని వలస కూలీలు శ్రామిక రైలు కోసం పెద్ద ఎత్తున గుమికూడారు.వారిని చెల్లాచెదురు చేయటానికి లాఠీఛార్జి కూడా చేయాల్సి వచ్చింది. అనంతపురం జిల్లాలోని విడపనకల్లు., గుత్తి గుంతకల్లు,పుట్లూరు, యల్లనూరు ,అమడగూరు ప్రాంతాలనుంచి ప్రాంతాలలో ఉన్న బీహార్, యూపీ ,రాజస్థాన్ రాష్టాలకు చెందిన కార్మికులంతా నడకనే బయలుదేరారు. విడపనకల్లు లో కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మాకెవ్వరూ సహాయం  చేయడంలేదు. మా ఊరికి పోనివ్వండంటూ పోలీసులపై దాడికి దిగారు.

    అన్ని దేశాల్లో లాగానే మన దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్థిక ప్యాకేజీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 20 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు.అందులో వలస కార్మికులకు బియ్యం, శనగలు
ఉచితంగా ఇస్తామని చెప్పింది.  చాలామంది ఆర్థిక నిపుణులు ప్రజలకు ఐదువేల రూపాయలు కొన్ని నెలలపాటు ఇవ్వాలని ప్రతిపాదించాయి.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడిగాయి.దీన్ని హెలికాప్టర్ మనీ ఆనికూడా అంటారు.ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది.అయినా కేంద్రం పట్టించుకోలేదు. కనీసం రెండు వేల కోట్లు ఇచ్చి ఉన్నా ఈ కష్టకాలంలో వారిని ఆదుకునేది. అదీ చేయలేదు. ఇదొక నిర్లక్ష్యపూరిత అమానవీయ చర్య. కేంద్ర ప్రభుత్వం తమ దేశ వాసులపట్ల తీసుకున్న నిర్దయాపూర్వక  చర్య. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
       ఇప్పుడు కరోనా ఇంకా విజృంభిస్తూనే  ఉంది దేశంలో. వలస కార్మికులు తమ ఊర్లకు పోవడం వల్ల ఈ కరోనా గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా చేరుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇది లాక్ డౌన్ ను ప్రణాళికాబద్ధంగా చేయకపోవడం వల్ల జరిగిన విపత్తు ఇది.
    ‌   ఇలాంటి విషాదాలు భవిష్యత్తులో జరక్కుండా ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మనమంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కరోనాను పారద్రోలి ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని గుర్తెరగాలి.

పిల్లా కుమారస్వామి,9490122229

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు