కార్తెలు ( kārte)

       pc: oneindiatelugu.com 

There are 27 stars according to Telugu Astrology. Each has its own unique way. These are decided by the entry of the Surya or Sun.
   సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా చేశారు. వాటికి ‘కార్తె’ అనే పేరు నిర్ణయించారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు రెండు వారాల పాటు ఉంటాడు. దీనిప్రకారం ఒక్కో కార్తె సుమారుగా 13 లేదా 14 రోజులు ఉంటుంది. అశ్వని నుంచి రేవతి వరకు ఇలా నక్షత్రాల పేరు మీద కార్తెలు ఏర్పడ్డాయి.
            జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు,  పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయమై నప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు  రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ  వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’, వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. 
భూమీచరులం.. ప్రతిరోజు భూమి నుంచి చూసినపుడు ఇరవై ఏడు నక్షత్రాలు ఒకటి తరువాత ఒకటిగా ఉదయిస్తూనే ఉన్నాయి! ఒకటి తరువాత ఒకటిగా అస్తమిస్తూనే ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఈ 'నక్షత్రాల' ఉదయం, అస్తమయం సాపేక్షంగా జరుగుతోంది!

భూమి పరిభ్రమణం కారణంగా అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సూర్యుడు సంవత్సరం పొడవునా ఏదో ఒక నక్షత్రంతో కలిసి ఉన్నట్టు సాపేక్ష- రిలేటివ్- దృశ్యం ప్రస్ఫుటిస్తోంది!! ఇలా సూర్యుడు ఉదయించే సమయంలోనే అశ్వని నక్షత్రం ఉదయించడం పదమూడు రోజులు ప్రస్ఫుటించే దృశ్యం - మొదటి రోజు మేష సంక్రాంతి! సౌరమానం పాటించే తమిళులకు అదే ఉగాది.. శుక్రవారం నుంచి సూర్యుడు అశ్వనితో కలిసి ఉదయిస్తాడు!

పరిభ్రమణం ప్రభావం వల్ల సూర్యుడు 'నక్షత్రంతో కలిసి చేసే సహప్రస్థానంలో ప్రతిరోజు వెనుకపడిపోతాడు. దాంతో పదమూడు పదునాలుగు రోజులలో అశ్వని నక్షత్రం పూర్తిగా ముందుకెళ్లిపోతుంది. అప్పుడు భరణితో కలిసి సూర్యుడు ఉదయించడం మొదలైపోయినట్లు కనిపిస్తుంది. అదే భరణి కార్తె!

ఇలా రేవతి వరకూ!! ఇరవై ఏడు నక్షత్రాలు లేదా సమూహాలు 12 రాశులుగా ఖగోళంలో కనిపిస్తాయి.

మనం పంచాంగాన్ని గమనిస్తే ప్రతి నెలలోను ఒక సంక్రాంతి కనిపిస్తుంది. జ్యోతిష్యంలో సంవత్సరానికి 12 నక్షత్ర రాశులుగా విభజించారు. ఒక్కో నెలలో సూర్యుడు ఒక్కో రాశి లోకి సంక్రమణం(ప్రవేశం) చెందినట్టుగా భావించారు. ఏ మాసంలో ఏ నక్షత్ర రాశిలోకి ప్రవేశిస్తాడో, ఆ నెలలో ఆ రాశికి చెందిన సంక్రాంతి అన్నమాట. ఇలా 12 సంక్రాంతులున్నాయి. కానీ మకర సంక్రాంతిని మాత్రమే పండుగగా జరుపుకుంటారు. మకర సంక్రాంతిన సూర్యుడు ఉత్తరాయణ పుణ్య కాలంలో ప్రవేశిస్తాడని బ్రాహ్మణుల విశ్వాసం. జ్యోతిష్యానికి ముడిపడి ఉన్న పండగ అంటేనే ఈ పండగను బ్రాహ్మణులు కల్పించారని అర్థమవుతుంది. అసలు ఉత్తరాయణం, దక్షిణాయనం ఉన్నాయా..? ఉత్తరాయణం బ్రాహ్మణులకు పితృకర్మలు చేయడానికి పుణ్యకాలం ఎందుకైంది? దీనిని తెలుసు కోవాలంటే సంక్రాంతి పండుగ ఏర్పడిన విధం తెలుసు కోవాలి. ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవాలి. వారి జీవన విధానమే ఉత్తరాయణం, దక్షిణాయనంల సృష్టి కి కారణం. శాస్త్రవిజ్ఞానం ప్రకారం ఇవేవి లేవు. దీన్ని ఇంకోసారి చర్చిద్దాం.

కార్తెలు 27

 1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 

 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 

 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 

14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 

18.జ్యేష్ట 19.మూల     20.పూర్వాషాడ  

21.ఉత్తరాషాడ 22.శ్రావణ 23.ధనిష్ట 

24.శతభిషం 25.పుర్వాబాధ్ర 26.ఉత్తరాభాధ్ర 

27.రేవతి


రోహిణి కార్తె

         pc oneindiatelugu.com

రోహిణి కార్తె అనగానే రోకళ్లు సైతం పగిలిపోయే కాలం అంటారు. ఎండా కాలంలో నాలుగు నెలలు ఒక ఎత్తు అయితే.. చివరి రెండు వారాలలో అదీ రోహిణి కార్తె సమయంలో వచ్చే ఎండ వేడిమి మరో ఎత్తు.రోహిణి కార్తె లో పక్షం(15) రోజులలో అధిక వేడి గాలులు, ఎండ తీవ్రత, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. అయితే రోహిణి కార్తెలో ఎండలు ప్రచండంగా ఉండే అవకాశం ఉంది.సాధారణంగా రోహిణి కార్తె సమయంలో ఎండలు మాత్రమే ప్రభావం చూపుతాయని అందరికీ తెలుసు. అయితే వరుణుడు కూడా ఇదే కాలంలో తన ప్రతాపాన్ని అప్పుడప్పుడు చూపుతాడు. ఆ సందర్భంలో ఉరుములు, పిడుగులు కూడిన వడగండ్ల వానలు పడుతుంటాయి.     

మృగశిర కార్తెె

    ‌‌‌ Pc: Sharechat

సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. 

       రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతుంటారు.మృగశిర కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ  కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా ఉంటుంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగానే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు.

             ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది.  అంతేకాకుండా ఈ కార్తె మొదలయ్యే సమయానికి వర్షాలు మొదలవుతున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి వాటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినడం చాలా మంచిది.

కార్తెలపై సామెతలు

1.అశ్వని (ఏప్రిల్ – 14) '

అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం
అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.
అశ్వని కురిస్తే అడుగు తడవదు.

2'.'భరణి' (ఏప్రిల్ – 27)

భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.
భరణి ఎండకు బండలు పగులుతాయి.
భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు
భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.

3.కృత్తిక (మే – 11)

కృత్తిక పునర్వసులు సత్తువ పంట.
కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.
4.రోహిణి (మే – 25)

రోహిణి ఎండకు రోళ్ళు పగులును
రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.
రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.

5.మృగశిర (జూన్ – 8)

మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును
మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.
మృగశిరకు ముల్లోకాలు చల్లబడును.
మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.
మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.
మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది.
మృగశిర కురిస్తే ముంగారు పండును.
మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.

6.ఆరుద్ర (జూన్ – 22)

ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు
ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.
ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.
ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.
ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.
ఆరుద్రతో అదనుసరి.
ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.
ఆరుద్ర వాన ఆదాయాల బాన.
ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.
ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.
ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.
ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.
ఆరుద్ర వాన అరుదు వాన
ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి

7.పునర్వసు (జులై – 6) 

పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.

8.పుష్యమి (జులై – 20) 

పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.
పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు

9.ఆశ్లేష (ఆగస్టు – 3) 

ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది
ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.
ఆశ్లేష వాన అరికాలు తేమ
ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.
ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.
ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.
ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం
ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.
ఆశ్లేష వర్షం – అందరికి లాభం.
ఆశ్లేష వాన అరికాలు తేమ

10.మఖ (ఆగస్టు – 17) 

మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ
మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.
మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.
మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.
మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు.
మఖా పంచకం సదా వంచకం.
మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం.
మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.

11.పుబ్బ (ఆగస్టు – 31) 

పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.
పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.
పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు
పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు
పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు
పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు
పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు
పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు

12.ఉత్తర (సెప్టెంబరు – 13) 

ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.
ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.
ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
ఉత్తర పదును ఉలవకు అదును.
ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.
ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం
ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు

13.హస్త (సెప్టెంబరు – 27) 

హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.
హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.
హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.
హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.
హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.
హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.
హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.
హస్తలో చల్లితే హస్తం లోకి రావు.
హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.
హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.

14. చిత్త (అక్టోబరు – 11) 

చిత్త కురిస్తే చింతలు కాయును
చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.
చిత్తి ఎండకు బట్టతల పగులును.
చిత్తలో చల్లితే చిత్తుగా పండును.
ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.
చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.
చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.
చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.
చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.
చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.
చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.

15.స్వాతి (అక్టోబరు – 27) 

స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.
స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.
స్వాతి కురిస్తే భీతి కలుగును.
స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.
స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.
స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.
స్వాతి వానకు సముద్రాలు నిండును.
స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.
స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.
స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.

16.విశాఖ (నవంబరు – 16) 

విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.
విశాఖ కురిస్తే పంటకూ విషమే.
విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం
విశాఖ విసురుతుంది.

17.అనూరాధ (నవంబరు – 20) 

అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది
అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.

18.జేష్ట్య (డిసెంబరు – 3) 

జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును

19.మూల (డిసెంబరు – 16) 

మూల కార్తెకు వరి మూలన జేరుతుంది
మూల ముంచుతుంది
మూల కురిస్తే ముంగారు పాడు
మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు
మూల మంటే నిర్మూల మంటాడు
మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.
మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.

20.పూర్వాషాడ (డిసెంబరు – 29)

 21.ఉత్తరాషాడ (జనవరి – 11) 

22.శ్రావణం (జనవరి – 24) 

23.ధనిష్ట ( ఫిబ్రవరి – 6 ) 

24.శతభిషం ( ఫిబ్రవరి – 19) 

25.పుర్వాబాద్ర ( మార్చి - 4 ) 

26. ఉత్తరాబాధ్ర ( మార్చి - 4 )

27.రేవతి ( మార్చి - 31 )

రేవతి వర్షం రసమయం – రమణీయం
రేవతి వర్షం అన్ని పంటలకు రాణింపే.
రేవతి వర్షం సర్వ సస్యములకు 
రాణింపే.

వివిధ కార్తెల్లో చేయవలసిన వ్యవసాయ పనులు

అశ్వని కార్తె

సజ్జ : వేసవి పైరు కోతలు
వరి : కోతలు, కత్తెరకు (కృత్తిక) వరి నారు పోయుట.
జొన్న : వేసవి జొన్న పంట సాగు.
మొక్కజొన్న : వేసవి పంట విత్తుట.
వేరుశనగ : త్రవ్వకాలు

భరణి కార్తె

వేసవి పనులు

కృత్తిక కార్తె

వేసవి పనులు

రోహిణి - మృగశిర కార్తెలు

వరి : సార్వ లేక అబి వరినారు పోయుట, వరి వేయబోయే పొలాల్లో ఎరువులు వేయుట.
మొక్కజొన్న : దమ్ములు చేయుట. ఎరువులు వేసి దుక్కులు దున్నుట, ఖరీఫ్ పంటలను విత్తుట.
కాయ ధాన్యాలు : తక్కువ పంటకాలపు పెసర, మినుము, కంది విత్తుట, అంతర కృషి చేయుట.
గోగు : రసాయనిక ఎరువులు వేయుట.
పసుపు : భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, విత్తనం వేయుట (కడప, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో)
కూరగాయాలు : బెండ, గోరుచిక్కుడు విత్తుట, గుమ్మడి, సొర, పొట్ల, కాకర పాదులు పెట్టుట.
సజ్జ : ఎరువులు వేసి దుక్కులు దున్నుట.
ప్రత్తి : ఎరువులు వేసి దుక్కులు దున్నుట. విత్తనం వేయుట.
పండ్లు : ద్రాక్షకు క్రిమి సంహారక మందులు చల్లుట, ఎరువులు వేయుట, నిమ్మకు ఎరువులు, రేగు, దానిమ్మ మొక్కల నాట్లు. (అంటు కట్టే మొక్కలకు మామిడి టెంకలు నాటడం).
వేరుశనగ : రసాయనిక ఎరువులు వేసి విత్తుట.
సువాసన మొక్కలు : రూషాకామంచి, పాల్మా రోజా విత్తనాలు చల్లటం.

ఆర్ధ్ర కార్తె

వరి : నారుమళ్లలో అంతరకృషి, సస్యరక్షణ
జొన్న : దుక్కులు దున్నుట, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయుట.
మొక్కజొన్న : సస్యరక్షణ - రెండవ దఫా ఎరువులు వేయుట.
ప్రత్తి : అంతరకృషి, మొక్కలను పలుచన చేయుట.
గోగు : అంతరకృషి, మొక్కలను పలుచన చేయుట.
పండ్లు : అరటి, మామిడి, జామనాట్లు, కొబ్బరి చెట్లకు ఎరువులు వేయుట, రేగు, దానిమ్మ నాట్లు.
పప్పుధాన్యాలు : వర్షాలు ఆలస్యం అయినచో కంది విత్తుటకు భూమిని తయారు చేయుట - విత్తుట.
కూరగాయలు : బీర, సొర, పొట్ల, గుమ్మడి విత్తుట.
సువాసన మొక్కలు : నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా నాట్లు.

పునర్వసు కార్తె

వరి : సార్వా లేక అబి వరినాట్లు, ముందుగా నాటిన వరిలో అంతరకృషి, సస్యరక్షణ.
సజ్జ : రసాయనిక ఎరువులు వేసి పునాస లేక ఖరీఫ్ పైరు విత్తుట.
వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ.
ఆముదం : రసాయనిక ఎరువులు వేసి విత్తుట.
మిరప : నారుమళ్లలో విత్తులు జల్లుట.
పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో నాట్లకు భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, గోదావరి ప్రాంతంలో పైరులో కలుపు తీయుట, గొప్పు త్రవ్వుట, (త్రవ్వటం).
పూలు : చేమంతి నారు పోయుట, గులాబి, మల్లె కనకాంబరం చెట్లకు ఎరువులు వేయుట. సస్యరక్షణ.
జొన్న : పునాస లేక ఖరీఫ్ జొన్న విత్తుట. విత్తిన పంటకు ఎరువులు వేయుట. సస్యరక్షణ.
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ. నెలాఖరులో ఎరువులు వేయుట.
పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో పసుపు నాట్లు.
చెరకు : సస్యరక్షణ, ఎరువులు వేయుట.
పండ్లు : మామిడి, నిమ్మ, నారింజ, అరటి, సపోటాలకు ఎరువులు వేయుట, ద్రాక్ష తీగలను పారించుట, మందులు చల్లుట. జామ, సపోటాలకు అంట్లు కట్టుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు వేయుట.
కొర్ర : ఎరువులు వేయుట, దుక్కి తయారు చేయుట.
వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ.
ఆముదం : కలుపు తీయుట, సస్య రక్షణ.
మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ.
కూరగాయలు : చేమ, వంగనాట్లు.
సువాసన మొక్కలు : కామంచి గడ్డి, నిమ్మగడ్డి మొక్కల నాట్లు.

పుష్యమి కార్తె

వరి : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.
జొన్న : అంతరకృషి, మొక్కలు పలుచన చేయుట, సస్యరక్షణ.
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ.
కొర్ర : విత్తనం వేయుట.
మిరప : నాట్లకు భూమి తయారు చేయుట.
పొగాకు : నారుమళ్లు తయారు చేయుట.
పండ్లు : తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ జాతి మొక్కలు నాటుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు.
వనమహోత్సవం : చెట్లనాట్లకు తయారీ, పొలాల గట్లపై చెట్లనాట్లకు తయారి.
పశువులు : దొమ్మ, పారుడు, గురక, గాలికుంటు మరియు యితర వ్యాధుల నుండి కాపాడుటకు చర్యలు.

ఆశ్లేష కార్తె

జొన్న : అంతరకృషి, రెండవ దఫా ఎరువులు వేయుట, సస్యరక్షణ
సజ్జ : అంతరకృషి, సస్యరక్షణ
వేరుశనగ : సస్యరక్షణ.
ఆముదం : రసాయనిక ఎరువులు వేయుట, అంతరకృషి, సస్యరక్షణ.
మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ.
పొగాకు : నారుపోయుట, తర్వాత సస్యరక్షణ.
పసుపు : అర్మూర్, మెట్టుపల్లి, కోరట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పసుపులో కలుపు తీయుట, ఎరువులు వేయుట, కృష్ణా జిల్లాలో భూమిని తయారు చేయుట, విత్తడం పూర్తి చేయుట.
వరి : అంతరకృషి, సస్యరక్షణ, ఉల్లికోడు తట్టుకొనే రకాల నాట్లు పూర్తిచేయుట.
మొక్కజొన్న : రసాయనిక ఎరువులు వేయుట.
కొర్ర : ఆలస్యంగా వర్షాలు పడినచో వెంటనే విత్తనం వేయుట.
రాగి : మే నెలలో విత్తిన రాగి కోతలు.
కాయధాన్యాలు : తక్కువ పంటకాలపు పెసర, మినుము కోతలు, కంది పంటకు కలుపు తీయుట.
ప్రత్తి : అంతరకృషి, రసాయనిక ఎరువులు వేయుట.

మాఘ కార్తె

జొన్న : మాఘీ జొన్నకు నేల తయారీ.
సజ్జ : సస్యరక్షణ.
కొర్ర : రసాయనిక ఎరువులు వేసి అంతరకృషి చేయుట.
ఆముదం : అంతరకృషి, సస్యరక్షణ, దాసరి పురుగు నివారణ
పొగాకు : నారుమళ్ళలో సస్యరక్షణ, పొగాకు వేయు చేలలో దుక్కులు తయారు చేయుట.
పసుపు : మే, జూన్, జూలై నెలల్లో నాటిన పైరులో సస్యరక్షణ, ఎరువులు వేయుట.
వరి : సస్యరక్షణ, కలుపు తీయుట, రెండవ దఫా ఎరువులు వేయుట.
కాయధాన్యాలు : తక్కువ పంటకాలపు మినుము పంటకు వస్తుంది.
వేరుశనగ : సస్యరక్షణ.
ప్రత్తి : సస్యరక్షణ
మిరప : నారుమడిలో సస్యరక్షణ, నాట్లకు దుక్కులు తయారు చేయుట.
పశుగ్రాసాలు : చలికాలపు పశుగ్రాసాల నాట్లకు నేలను తయారు చేయుట, విత్తనం సేకరించుట.
పశువులు : వ్యాధులు రాకుండా టీకాలు వేయించుట.
చేపల పెంపకం : మడుగులు నిర్మించుట, విత్తనం సేకరించుట.
అటవీ శాస్త్రం : మెట్టపొలాల గట్లపై చెట్లు నాటుట.
పండ్లు : జీడిమామిడి తోటల నాట్లు, మామిడి మొక్కల నాట్లు, ఎరువులు వేయుట.

పుబ్బ కార్తె

వరి : రసాయనిక ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు తీయుట.
జొన్న : రబీ జొన్న వేయుటకు దుక్కులు తయారు చేయుట.
వేరుశనగ : సస్యరక్షణ, ఎరువులు వేయుట.
పసుపు : ఆగష్టులో నాటిన పైరులో కలుపు తీయుట, జూన్‍లో నాటిన పంటకు పొటాష్ వంటి ఎరువులు వేయుట. సస్యరక్షణ చర్యలు.
కూరగాయలు : క్యాబేజి, కాలిఫ్లవర్ పంటలకు నారు పోయుట.

ఉత్తర కార్తె

సజ్జ : రబీ పంటలకు రసాయనిక ఎరువులు వేయుట, విత్తుట.
వేరుశనగ : సస్యరక్షణ.
ఆముదం : సస్యరక్షణ.
మిరప : మిరప తోటలలో ఖాళీలను పూరించుట, సస్యరక్షణ, అంతరకృషి.
పొగాకు : నారుమడిలో సస్యరక్షణ, పొగాకు వేయబోయే చేలలో దుక్కులు దున్నుట.
కూరగాయలు : వంగ, టొమాటో నాట్లు.
పండ్లు : ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ మొక్కలు నాటుట. అరటి నాట్లకు నేలను తయారు చేయుట. విత్తనం పిలకలను సేకరించుట.
సజ్జ : కోతలు
నువ్వులు : జూన్ నెలలో వేసిన పైరు కోతలు
ప్రత్తి : సస్యరక్షణ
పశుగ్రాసాలు : శీతాకాలపు పశుగ్రాసాల విత్తనం సేకరించుట, నేలను తయారు చేయుట.

హస్త - చిత్త కార్తెలు

జొన్న : జూలై నెలలో విత్తిన పైరులో సస్యరక్షణ. రబీ జొన్న విత్తుట, సస్యరక్షణ.
కాయధాన్యాలు : కోతలు, దీర్ఘకాలపు కందికి సస్యరక్షణ, ఉలవ, శనగ విత్తుట.
వేరుశనగ : గుత్తి రకం కాయ తీయుట.
మిరప : అంతరకృషి, సస్యరక్షణ, పచ్చికాయ ఏరుట.
ఉల్లి : నారు పోయుట.
పూలు : గులాబి కత్తిరించుట, ఎరువులు వేయుట.
మొక్కజొన్న : కోతలు.
ప్రత్తి : సస్యరక్షణ.
ఆముదం : అరుణ పైరులో కాయ తీయుట ప్రారంభించుట.
పొగాకు : నాట్లు, మూడవ వారంలో ఖాళీలను పూరించడం.
పసుపు : సస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో కలుపు తీయుట, రసాయనిక ఎరువులు వేయుట, జూలై నెలలో నాటిన పైరులో అంతరకృషి.
కొర్ర : కోతలు
కుసుమ : విత్తుట.
ధనియాలు : విత్తుట.
వాము : విత్తుట.
పశుగ్రాసాలు : లూసర్న్, బర్సీము, పిల్లిపెసర, జనుము విత్తుట.
పండ్లు : కోస్తా జిల్లాల్లో అరటి పిలకల నాట్లు, రేగు పండ్ల మొక్కలు, దానిమ్మ మొక్కల నాటు.

స్వాతి కార్తె

వరి : తక్కువ పంటకాలపు రకాల కోతలు.
జొన్న : రబీ జొన్నలో సస్యరక్షణ, ఖరీఫ్‍లో వేసిన తక్కువ పంట కాలపు రకాలు కోతకు వచ్చుట.
వేరుశనగ : తీగ రకం కాయ తీయుట.
గోగు : కోతలు.
పొగాకు : అంతరకృషి
ఆలుగడ్డ : నాటుటకు భూమిని తయారు చేయుట.
మొక్కజొన్న : రబీ పంటకు విత్తనాలు వేయుట.
పశుగ్రాసాలు : చలికాలపు పశుగ్రాసాలు విత్తుట. (పిల్లిపెసర, లూసర్న్)
చిలగడ దుంప : నాటుట.

విశాఖ కార్తె

జొన్న : రబీ జొన్నలో అంతరకృషి, తొందరగా విత్తిన వాటికి సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.
మొక్కజొన్న : రబీ పంటకు విత్తనం వేయుట.
గోధుమ : భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, రెండవ వారంలో విత్తుట.
ప్రత్తి : ఖరీఫ్ ప్రత్తిలో ఎరువులు.
గోగు : కోసిన గోగు మొక్కలను నీటిలో ఊర వేయుట.
మిరప : అంతరకృషి, సస్యరక్షణ.
పొగాకు : అంతరకృషి, సస్యరక్షణ.
ఉల్లి : నాట్లు.
కాయధాన్యాలు : తక్కువ పంట కాలపు పెసర, మినుము, వరి పండిన పొలాల్లో చల్లుట, కందికి సస్యరక్షణ.
పసుపు : సస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో ఎరువులు వేయుట, ఆఖరి సారి నాగలితో అంతరకృషి.
కాయగూరలు : క్యాబేజి, కాలిఫ్లవర్ నాట్లు, కంద నాట్లు, బిన్నీసు విత్తుట.
పండ్లు : మామిడి తోటలకు సస్యరక్షణ, అరటి నాట్లు.

అనూరాధ కార్తె

వరి : మధ్య కాలిక రకాల కోతలు, రబీ పైర్లకు నారు పోయుట.
మొక్కజొన్న : సస్యరక్షణ.
మిరప : తోటలలో సస్యరక్షణ.
చెరకు : చెరకు తోటలు కొట్టడం ప్రారంభం. కార్శి తోటల పెంపకం, బెల్లం తయారి, చెరకు పిప్పిని పాతరవేయుట.
గోధుమ : ఇంకా విత్తనచో వెంటనే విత్తనం వేయుట.
జొన్న : రబీ పైరులో సస్యరక్షణ.
గోగు : నార తీయుట.
పసుపు : సస్యరక్షణ.
పశుగ్రాసాలు : చెరకు పిప్పిని పాతర వేసి పశుగ్రాసంగా మార్చడం.
కాయధాన్యాలు : కంది విత్తడం
పశువులు : ఈనిక కాలంలో మాయ పడనిచో తగు జాగ్రత్తలు తీసికొనుట, దూడలకు ఏలిక పాములు రాకుండా నివారణ చర్యలు.
పండ్లు : ఫాల్సా కత్తిరింపులు, ఉసిరి కాయలు మార్కెటింగ్, పచ్చళ్ళ తయారీ.
సువాసన మొక్కలు : కోతలు, సుగంధ తైలం తీయుట.

జ్యేష్ఠ కార్తె

వరి : దీర్ఘకాలిక రకాల కోతలు, రబీ నారుమళ్ళకు ఎరువులు వేయుట, సస్యరక్షణ.
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.
గోధుమ : అంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.
కాయధాన్యాలు : దీర్ఘకాలిక కంది రకాలు కోతకు వచ్చుట.
మిరప : సస్యరక్షణ.
పొగాకు : తలలు త్రుంచుట, సస్యరక్షణ.
చెరకు : నరుకుట, బెల్లం తయారీ.
పసుపు : ఆగష్టులో నాటిన పైరుకు రసాయనిక ఎరువులు వేయుట. అన్ని ఋతువుల్లో నాటిన పైర్లకు సస్యరక్షణ, ఎరువులు వేయుట.
పూలు : గులాబీల్లో బడ్డింగ్ చేయుట, ఎరువులు వేయుట.
ప్రత్తి : మాగాణి ప్రత్తికి భూమిని తయారు చేయుట.
ఆముదం : దీర్ఘకాలిక రకాల కాయ తీయుట ప్రారంభించుట.
పండ్లు : ఫాల్సా కత్తిరింపులు, ఉసిరిక, నిమ్మకాయ పచ్చళ్ల తయారీ.
సువాసన మొక్కలు : కోతలు, తైలం తీయుట.

మూల కార్తె

వరి : నారుమడికి ఎరువులు వేయుట, దాళ్వా లేక తాబి వరినాట్లకు పొలం తయారు చేయుట.
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ, ఎరువులు వేయుట.
గోధుమ : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.
రాగులు : రాగి విత్తుట.
కాయధాన్యాలు : పెసర, మినుములను వరి పండించిన భూముల్లో విత్తుట, కంది కోతలు, కంది మొడెం పంటగా సాగు చేయుట.
మిరప : పండు కాయలు కోయుట.
చెరకు : తెలంగాణా జిల్లాలో నాట్లు.
ఉల్లి : వరి పండించిన నేలల్లో నాటుట.
వేరుశనగ : వరి పండించిన చేలలో విత్తుట.
పండ్లు : అరటికి పిలకలు తీయుట. నాటిన పిలకలకు ఎరువులు వేయుట.

పూర్వాషాడ - ఉత్తరాషాడ కార్తెలు

వరి : తాబీ లేక దాళ్వా వరి నాట్లు, నాటిన వరికి కలుపు తీయుట, సస్యరక్షణ.
జొన్న : సంకర జొన్నకు నేలను తయారు చేయుట, విత్తనం వేయుట.
సజ్జ : వేసవి పంటకు నేల తయారి - విత్తనం వేయుట.
ప్రత్తి : మాగాణి ప్రత్తికి నేలను తయారు చేయుట.
మొక్కజొన్న : ఎరువులు వేయుట, అంతరకృషి.
పసుపు : మే నెలలో ఆర్మూర్, కొరుట్ల, మెట్టుపల్లి మరియు యితర ప్రాంతాలలో నాటిన కస్తూరి రకం పసుపు త్రవ్వుట, విత్తనం నిల్వ చేసుకొనుట.
వేరుశనగ : డిశంబరులో విత్తిన వేరుశనగకు అంతరకృషి, తెలంగాణా ప్రాంతంలో నీటి వసతి క్రింద విత్తుట.
ఆముదం : విత్తుట
చెరకు : తెలంగాణా జిల్లాల్లో నాటిన పైరుకు, కార్శి తోటల్లో ఎరువులు వేయుట, సస్యరక్షణ, కోస్తా రాయలసీమల్లో క్రొత్త తోటలను నాటుట.
పప్పు దినుసులు : వరి పొలాలందు (మాగాణిలో) నవంబరులో వేసిన మినుము, పెసర కోతలు.
కూరగాయలు : బఠాణికాయ ఏరుట, ధనియాలు కోతలు
పండ్లు : మామిడిపై తేనె మంచు పురుగు నివారణ చర్యలు, అరటి, ద్రాక్ష నాట్లకు గుంతలు త్రవ్వుట, ఉసిరి కాయలు అమ్ముట, నిల్వచేయుట.
పువ్వులు : గులాబి, మల్లెల కత్తిరింపులు, ఎరువులు వేయుట, చామంతి పూల కోతలు.
ధాన్య నిల్వలు : విత్తనాలు నిల్వ చేసుకొనుటలో జాగ్రత్తలు తీసుకొనుట, నిల్వ ఉంచిన ధాన్యానికి పురుగు పట్టకుండా శాస్త్రీయ పద్ధతులను పాటించుట.
శ్రవణం కార్తె

ధనిష్ఠా కార్తె

వరి : ముందు మాసాల్లో నాటిన వరికి రెండవ దఫా ఎరువులు వేయుట, కలుపు తీయుట.
జొన్న : రబీ జొన్న కోతలు, వేసవి పంటకు ఎరువులు వేయుట, అంతరకృషి.
గోధుమ : కోస్తా జిల్లాల్లో కోతలు, తెలంగాణాలో నీరు పెట్టుట, సస్యరక్షణ, ఎలుకల నిర్మూలన.
సజ్జ : వేసవి పంట విత్తుట, ఎరువులు వేయుట.
ప్రత్తి : మొక్కలు పలచన చేయుట. ఎరువులు వేయుట, సస్యరక్షణ
చెరకు : మూలకార్తెలో (ముందు మాసాలలో) నాటిన పంటకు, కార్శి తోటలకు ఎరువులు వేయుట.
వేరుశనగ : వరి పొలాల్లో వేసిన పంటకు సస్యరక్షణ
కుసుమ : కోతలు మార్కెట్‍కు పంపుట
ఆముదం : ముందు మాసాలలో విత్తిన పంటకు సస్యరక్షణ
పొగాకు : ఆకు కోత, క్యూరింగ్ చేయుట.
మిరప : కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పండు కాయ ఏరుట, అమ్ముట
పండ్లు : ద్రాక్ష గుత్తులు కత్తిరించుట - మార్కెట్‍కు సస్యరక్షణ, పండ్లను నిల్వ చేయుట.

శతభిషా కార్తె

మినుము : వరి మాగాణుల్లో వేసిన మినుము కోతలు.
వేరుశనగ : వేసవి పంటకు సస్యరక్షణ, తెలంగాణా జిల్లాల్లో విత్తిన పంటకు ఎరువులు వేయుట.
ఆముదం : సస్యరక్షణ, తెలంగాణాలో విత్తిన పంటకు అంతరకృషి.
పసుపు : సస్యరక్షణ, తెలంగాణాలో విత్తిన పంటకు అంతరకృషి.
కూరగాయలు : బెండ విత్తుట, బీర, సొర పాదులు వేయుట, టమాట, వంగ విత్తనం తీయుట.
మెంతులు : కోతలు - విత్తనం తీయుట.
జీలకర్ర : కోతలు - విత్తనం తీయుట.
పండ్లు : ద్రాక్ష గుత్తులు కోయుట - అమ్ముట, పండ్ల పానీయాలు తయారు చేయుట.
మిరప : ఏరుట, మార్కెట్‍కు పంపుట.

పూర్వాబాధ్ర కార్తె

వరి : రెండవ పంటకు ఎరువులు వేయుట, సస్యరక్షణ
గోధుమ : తెలంగాణా రాయలసీమ జిల్లాల్లో కోతలు.
జొన్న : వేసవి పంటకు సస్యరక్షణ.
ప్రత్తి : ఎరువులు వేయుట - సస్యరక్షణ, ఎడ సేద్యం.
రాగి : రబీ రాగి కోతలు
సజ్జ : సస్యరక్షణ
వేరుశనగ : ఎరువులు - సస్యరక్షణ
పసుపు : జూలైలో నాటిన పసుపు త్రవ్వుట.
మిరప : ఎండు కాయలు అమ్ముట, విత్తనం తయారు చేయుట.
పొగాకు : ఆకు కోయుట, క్యూరింగ్
చెరకు : జనవరిలో నాటిన పైరుకు ఎరువులు వేయుట, సస్యరక్షణ
పప్పుదినుసులు : మాగాణిలో విత్తిన పెసర, మినుము పంటకు వచ్చుట.
ఆకుకూరలు : పాల, తోట, చుక్క కూరలు విత్తుట.
అల్లం : పంట త్రవ్వకాలు
పువ్వులు : చామంతి పూలు ఏరుట.

ఉత్తరబాధ్రా కార్తె

పసుపు : పంటకాలు మార్కెట్‍కు పంపుట, విత్తనం సేకరించుట.
ఆముదం : సస్యరక్షణ
అల్లం : త్రవ్వకాలు, అమ్మకాలు, శొంటి తయారీ.
గోధుమ : ఆలస్యంగా విత్తిన పంట కోతలు
వేరుశనగ : డిశెంబర్‍లో విత్తిన పంట నుండి కాయ త్రవ్వుట.
పండ్లు : ద్రాక్ష పండ్ల ఎగుమతి, నిల్వలు పానీయాలు తయారు చేయుట.
కూరగాయలు : వేసవి కూరగాయల పెంపకం.
పప్పు దినుసులు : పెసర, మినుము కోతలు
ఖర్భూజ తర్బూజ : సస్యరక్షణ, తొందరగా విత్తిన పంటలు కోతలకు తయారగుట.
ఉల్లిగడ్డ : డిశంబర్‍లో నాటిన ఉల్లి త్రవ్వకాలు
వరి : అశ్వని కార్తెలో వేయబోయే వరిని విత్తుట

రేవతి కార్తె

వరి : స్వల్పకాలిక రకాల కోతకు తయారి, అశ్వనీ కార్తె వరికి పొలం తయారి.
జొన్న : జనవరి మొదటి వారంలో విత్తిన జొన్న కంకులకు పురుగుల నుండి రక్షణ.
వేరుశనగ : డిశంబర్ ఆఖరులో విత్తిన పంట త్రవ్వకాలు.
ప్రత్తి : మాగాణి ప్రత్తిలో కాయ తొలిచే పురుగు నివారణకు మందులు చల్లుట
చెరకు : అంతరకృషి, నీరు పెట్టుట, బోదె సవరింపులు
పసుపు : ఆగష్టులో నాటిన పంట త్రవ్వకాలు, వండుట, మార్కెట్‍కు పంపుట.
పొగాకు : అమ్మకాలు.
పండ్లు : నిమ్మ, నారింజలో ఎండు కొమ్మల కత్తిరింపు, బోర్డో మిశ్రమం పూయుట, గజ్జి రాకుండా మందులు చల్లుట, ద్రాక్ష అమ్మకాలు పూర్తి చేయుట, అరటికి అంతరకృషి.
కూరగాయలు : ఉల్లిగడ్డల త్రవ్వకం, ఆకు కూరలకు ఎరువులు వేయుట, కాకర పాదులు తయారు చేయుట.
అల్లం : త్రవ్వకాలు పూర్తి చేయుట, దుక్కులు తయారు చేయుట.


ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి సంవత్సరం ఏ కార్తెలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయి, ఏ నేలలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు వస్తాయి వంటి అనేక విషయాలను కూలంకషంగా వివరించిన పుస్తకాన్ని ముద్రించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అంకితమిస్తుంది.



Source:wikipedia,oneindia telugu,facebook etc

కామెంట్‌లు

  1. కార్తెలు కోసం చాలా విస్తృతమైన సమాచారం అందజేశారు మీకు ధన్యవాదాలు సార్

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు