శతాబ్ది ఆధునికసాహిత్యం_ విహంగ వీక్షణం_పార్ట్1
సమాజానికి కేంద్రం మనిషి జీవితం. జీవితాన్ని ప్రతిబింబించేది సాహిత్యం, సాంస్కృతిక రంగం. వీటిలో మానవ చైతన్యం నిత్యనూతనంగా
మెరుస్తుంది. మానవుని జీవన సంఘర్షణలు, కార్యాచరణ మనిషిలో సృజనను పెంచి సాహిత్యంలో ప్రతిఫలిస్తాయి. అందువల్లనే సాహిత్యం సమాజానికి దర్పణం అంటున్నాం. అంతేగాక సాహిత్యాన్ని అధ్యయనం చేసేటపుడు ఆనాటి సామాజిక రాజకీయ అంశాలను పరిశీలించాలి. వాటి మధ్యగల పరస్పర సంబంధాల్ని చూడాలి. సాహిత్యాన్ని సమాజం ఎంతగా ప్రభావితం చేస్తుందో అంతగా సాహి
త్యం కూడా సమాజానికి ప్రేరక శక్తిగా పనిచేస్తుంద న్నది వాస్తవం. ఈ వెలుగులో మనం ఆధునిక సాహిత్య పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం.
యూరప్ లో వచ్చిన పారిశ్రామిక విప్లవంతో కొత్త యంత్రాలు వచ్చాయి. విజ్ఞాన శాస్త్రం వికసించసాగింది. ఆ సందర్భంలో ప్రకృతికి, మనిషికి మధ్య సామరస్యం కోసం సాహిత్యకారులు ఆరాటపడ్డారు. దానితో 'రొమాంటిసిజం'పుట్టింది. దీనినే మనం “భావకవిత్వం' అన్నాం. ఆ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడి భూస్వామ్య వ్యవస్థను అణచివేసింది. భూస్వామ్య వ్యవస్థకు ప్రాణమైన రాజరిక వ్యవస్థపై వ్యతిరేకత వచ్చింది. స్త్రీలు అంత:పురాల నుంచి బాహ్య ప్రపంచంలోకి రావాలని సాహిత్యకారులు కోరారు. స్త్రీ ప్రేమ, ఆరాధనలతో కవులు కవిత్వం రాశారు. ఇవన్నీ 18వ శతాబ్దంలో యూరప్ లో వచ్చిన విప్లవాత్మక
మార్పులు. ఇలాంటి పరిస్థితులు మనదేశంలో ఆంగ్లేయుల రాకతో ఏర్పడినాయి.
19వ శతాబ్ది ఆరంభంలో మనదేశంలో ఆంగ్లేయుల పాలనతో ఆంగ్ల విద్యా విధానం ప్రారంభమైంది. ఆంగ్ల విద్య ప్రభావంతోభారతీయులు
తమ దేశంలో ఉన్న వెనుకబాటుతనాన్ని, సంప్రదాయం పేరిట జరిగే అకృత్యాలను,మూఢ విశ్వాసాలను గుర్తించారు. రాజారామమోహనరాయ్ బెంగాలులో సంఘ సంస్కరణోద్యమం నడిపాడు. వారి ప్రభావంతో రఘుపతి వెంకటరత్నం,
వీరేశలింగం పంతులు కృషి ఫలితంగా మన రాష్ట్రంలో కూడా సంఘ సంస్కరణోద్యమాలు వచ్చాయి. వీరు తమ ఉద్యమాలకు సాహిత్యాన్ని సాధనంగా చేసుకున్నారు.మరోవైపు ఆధునిక యంత్రాలు, రైల్వేలు, టెలిగ్రాఫులు, పోస్టల్ వంటి
వాటిని ఆంగ్లేయులు తమ వ్యాపార విస్తరణకు మనదేశంలో ఏర్పాటు చేశారు. అనేక ఆనకట్టలు నిర్మించారు. దేశంలో ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. అవన్నీ సాహిత్యరంగంలో మార్పులకు దోహదం చేశాయి.
భావకవిత్వం
18వ శబాబ్దంలో యూరప్ లో వచ్చిన రోమాంటిసిజం మనదేశంలో 20వ శతాబ్దంలో ప్రవేశించింది. దీనినే మనం కాల్పనికవాదం లేదా భావకవిత్వం అన్నాం. ప్రేమ, ప్రకృతి, సౌందర్యం, స్వేచ్ఛ రొమాంటిక్ కవుల కవితావస్తువులు. స్త్రీ,
పురుషుల మధ్య సెక్స్ సంబంధాలు కాక ప్రేమ, స్నేహ సంబంధాలు వుంటాయని ఆధునికులు గుర్తించడం ఒక పరిణామం.
విశ్వకవి రవీంద్రనాథ్, మైకేల్, మధుసూద నదత్తు మొదలైన బెంగాలి కవులు భావకవిత్వంలోకి ప్రవేశిం చారు. వీరి ప్రభావంతో రాయప్రోలు, దేవులపల్లి, నాయుని సుబ్బారావు, నండూరి సుబ్బారావు, అడవి బాపిరాజు, దువ్వూరి రామిరెడ్డి మొదలైన వారు భావకవిత్వం రాశారు.
రాయప్రోలు తన 'తృణకంకణం'లో స్త్రీ, పురుషుల మధ్య ఉండే స్నేహ, ప్రేమ సంబంధాలను వ్యక్తీకరించారు. దీనినే ఆయన అమలిన శృంగారం (ప్లాటోనివ్) అన్నారు. షెల్లీ, కీట్సు, బైరన్, స్వీన్ బర్న్ ప్రణయకవిత్వం రాస్తే, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని, నండూరి సుబ్బారావులు రాయప్రోలు
ప్రేయసిని ప్రేమించి విరహగీతాలు రాశారు. ఇందులో ఎలాంటి శృంగార భావనగాని, కామోద్దీపనగాని లేవు.
ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే యాగిపోనా,
అంటూ ప్రకృతిలో లీనమైపోవాలని కాంక్షించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.నండూరి 'ఎంకి పాటలు' దువ్వూరి 'కృషీవలుడు', 'వనకుమారి', పింగళికాటూరి 'సంక్రాంతి'లో భావకవిత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది."ప్రేమదాహాన నెడద తపించుకొలది అమృత మొలకింతు స్మితనయనాంచలముల" అని అంటాడు 'వేదుల'
“దైవతమ నీవు, నీదు ప్రత్యక్షమునకు
గడియ లెంచు నుందు భక్తుడను నేను" అంటాడు తల్లావఝుల 'కవి హృదయములో తటిల్లతలా అప్రయత్నంగా మెరసిపోయిన భావాల అక్షరాకృతి భావకవిత్వం' అని శ్రీ శ్రీ నిర్వచించారు.
- పిళ్ళా విజయ్9490122229
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి