రచయితకూ,సామాజికులకూ మధ్య ఒక వారధి పిళ్లా కుమారస్వామి


           పిళ్లా విజయ కుమారస్వామి రెడ్డి 8.7.1964లో కడపజిల్లాలోని రాజంపేట మండలం, సరస్వతీపురంలో జన్మించారు. పాఠశాల రికార్డులలో మాత్రం 5-2-1964గా నమోదైంది. వీరి తల్లిదండ్రులు పిళ్లా
రామలక్ష్మి, పిళ్లా లక్ష్మిరెడ్డి. తన పదేళ్ల ప్రాయంలోనే తల్లి దివంగతురాలైంది. వీరి తండ్రి పిళ్లా లక్ష్మిరెడ్డి తెలుగులోవిద్వాన్ పూర్తి చేసి తెలుగు పండితులుగా పనిచేసి పదవీ
విరమణ చేశారు. కుమారస్వామి పదైదేళ్ళ ప్రాయంలో ఉండగా తండ్రి మరణించారు.
ఆయన తన అన్న పిళ్లా దశరథరామిరెడ్డిగారి సంరక్షణలో వుండి చదువు సాగించారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు కడపలోని గాంధీనగర్ మునిసిపల్ హైస్కూల్ లో, ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బి.ఏ.
డిగ్రీ ఎస్.వి. డిగ్రీ కళాశాలలో పూర్తి చేసినారు. ఆ తరువాత ఎం.ఎస్సీ (గణితం)తిరుపతిలోని ఎస్.వి. యూనివర్శిటీలో పూర్తి చేశారు.

      కడప జీవిత బీమాసంస్థలో 1986లో చేరి అసిస్టెంట్ గా గూడూరు,కడపలలో పనిచేస్తూ పదోన్నతితో డెవలెప్ మెంట్ ఆఫీసరుగా కడప నుంచి కదిరికి1990లో వచ్చినారు. ఒకవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే మరొక వైపు తనకు ఆసక్తి కలిగించిన జనవిజ్ఞాన వేదికలో చేరి అనేక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా
గ్రామాల్లో ప్రచారం చేసినారు. సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా
అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని గ్రామాలల్లో ప్రజలనుచైతన్యవంతం చేసినారు. ఆ సందర్భంలోనే విద్యార్థుల్లో సైన్సు పట్ల అభిరుచి ఏర్పడేందుకు విద్యార్థులకు బాలోత్సవ్, సైన్సు ఫేర్ వంటివి నిర్వహించారు. పుస్తకాలను చదవాలని జనవాచక ఆందోళన్ నిర్వహించారు. కదిరికి సమీపంలో వున్న
కవులేపల్లిలో ఒక గ్రంథాలయాన్ని అక్కడి యువకులతో స్వచ్ఛందంగా ఏర్పాటుచేసి
పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచినారు.
         కొంతకాలం తరువాత కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాలతో కలిసి
అనేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ సంస్థల ప్రవేటీకరణ, అంగన్‌వాడీల
ప్రవేటీకరణలకు వ్యతిరేకంగా కార్మికులను చైతన్యపరచి పోరాటాలను నడిపారు.

       బీడీ కార్మికుల వ్యథలను చూచి చలించిన కుమార స్వామి వారి సమస్యలపై పలుమార్లు ఆందోళనలు చేసినారు.
           2015లో 'కదిరి అభివృద్ధి వేదిక'ను ఏర్పాటు చేసి కదిరి అభివృద్ధిపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
           అనంతపురంలో తన సొంత ఇంటికి మారాక 2002 నుంచి ఆయన భూమిక మారిపోయింది. ఆయన సాహిత్య రంగంపై మక్కువ పెంచుకుని అటు సాహితీ కార్యకర్తగా ఇటు సాహితీకారునిగా మారినారు. ఆయన జీవితనేపథ్యం,నడిచినబాట తన సాహితీ కృషికి తోడ్పడింది. సాహితీస్రవంతి సంస్థను
అనంతపురంలో ఏర్పాటుచేశాక ఎప్పటి కప్పుడు ఏవో కార్యక్రమాలు సభలూ సమావేశాలు నిర్వహించేవాడు. కొత్త వారిని కూడగడుతూ, పాత వారినికాపాడుకోవడానికి తంటాలు పడుతూ, పెద్దల సహకారం తీసుకుంటూ విద్యార్థి యువతను సాహిత్య కృషిలో భాగస్వామి చేసినారు.
        అనంతపురం జిల్లాలో సాహితీ సంస్థలు అధికమై, రచయితలు ఎవరికి వాళ్ళుగా ఉంటున్న నేపథ్యంలో, కుమారస్వామి తనదైన పద్ధతిలో జనాన్ని సమీకరించు కొని ప్రజాసాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా అనంతపురం లో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు.
             హేమాహేమీలకు నిలయమైన అనంతపురంలో ఈ రకమైన కృషి వల్లనే సాహితీ స్రవంతి పదహారేళ్లు పైగా పనిచేస్తోంది. ఇతర మిత్రులు కొందరికి లేని లేదా కొందరికే వున్న ఒక ప్రత్యేకత కుమారస్వామికి వుంది. కుమారస్వామి చాలా కుదురుగా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, ఇతరులు రాసినవి చదివి స్పందిస్తుంటాడు. సమీక్షలు రాస్తుంటాడు. అవలోకనాలు చేస్తుంటారు.
      ప్రపంచీకరణ సవాళ్ళను ఎదుర్కొనేందుకు       ప్రపంచీకరణ ప్రతిఘటనా వేదికగా సాహితీ స్రవంతి ఏర్పడింది. ఆ సందర్భంలో  
కుమారస్వామి ప్రపంచీకరణపై పోటెత్తిన కవితా సంద్రంపేరుతో ఒక వ్యాసాన్ని పుస్తకంగా 2005లో తీసుకొచ్చారు. దీనిని విజయవాడలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య కార్యక్రమంలో తెలకపల్లి రవి గారు ఆవిష్కరించారు. 

2015లో 'అనంతకవితా స్వరాలు' పేరుతో అనంత కవుల కవిత్వాన్ని ప్రచురించారు. దీనికి మల్లెల గారితో కలిసి తాను సంపాదకత్వం వహించారు. 
2016లో 'అనంతసాహితీ సమాలోచన' పుస్తకాన్ని రాసి ప్రచురించారు. 2015లోనే మేడే-కార్మికుల


హక్కుల దీక్షాదినం' పుస్తకం రాసిప్రచురించారు. దీనిని 'మేడే' రోజున అనంతపురం
సి.ఐ.టీ.యు. సభలో ఓబులుఆవిష్కరించారు. 2017లో ఆధునిక సాహిత్య పరిణామక్రమం, రాయలసీమ ఆధునికసాహిత్యపరిణామక్రమం పుస్తకాన్ని కూడా ఇటీవల వెలువరించారు. దీనిని అనంతపురంలో రాచపాళెం,సింగమనేని గార్లుఆవిష్కరించారు. 

2018లో 'మట్టిపోగు' కవితా సంపుటిని, 

2019లో 'లెనిన్  జీవితకథనం', 

'శుకసప్తతి కథలు పుస్తకాలను వెలువరించారు. 'మట్టిపోగు' కావ్యాన్ని
అనంతపురంలో జయచంద్ర ఆవిష్కరిస్తే, 'లెనిన్ జీవితకథనం'ను అనంతపురంలో
రాంభూపాల్ ఆవిష్కరించారు. 'శుకసప్తతి' కథలను కదిరిలో వెంకటరామిరెడ్డి ,నందవరం కేశవరెడ్డి గార్లు ఆవిష్కరించారు.
గురజాడ ఫౌండేషన్ వారు గురజాడ పురస్కారంతో ఆయనను సత్కరించారు. ఏప్రిల్ నెలలో వేమన సాహిత్యంపై రాష్ట్రస్థాయిలో 250 సాహిత్య సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అనంతపురం పట్టణంలో ఆయన నిర్వహించారు.
        2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని ఆయన తన కవితను
వినిపించారు. ఆ సందర్భంగా ఆయన సత్కరించబడ్డారు.
          ‌సింగమనేని నారాయణ, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, తెలకపల్లి రవి గార్ల ప్రభావంతో ఆయన సాహితీ విమర్శారంగంలో మార్క్సిస్టు దృక్పథాన్ని అలవర్చుకున్నారు. కుమార స్వామికి స్పష్టమైన తాత్వికభావ జాల ముంది. నిర్ధిష్టమైన ప్రాపంచికదృక్పథంతో సిద్ధాంత బలంగలిగిన రచయిత. వాక్కు నిర్దిష్టంగా ఉంటుంది. ఇంకా సిద్ధాంతాలను రాద్దాంతాలుగా భావించే తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు.వాళ్ళు గుర్తించవలసింది వాళ్ళకూ సిద్ధాంతాలు ఉన్నాయని. కుమారస్వామి
రచనలను చదివైనా సిద్ధాంత ద్వేషులు, దానిని వదులుకొని, తమ సిద్ధాంతమేదో ప్రకటించు కోవాలి. సాహిత్యం, జీవితంలోంచిపుడుతుంది. జీవితం సిద్ధాంతరహితంగా ఉండదు. అందువల్ల సాహిత్యం కూడా సిద్ధాంత రహితంగా ఉండదు.కుమారస్వామి ఆధునిక సాహిత్య విమర్శకుడు. ఆయన ఆధునిక భావజాలాన్ని అందుకున్నారు. దాంతో పాటు ప్రాపంచిక జ్ఞానం కూడా ఉంది.అందువల్లనే ఆయన ఆధునిక సాహిత్యాన్ని సాధికారికంగా విమర్శిస్తూ రచయితకూ,సామాజికులకూ మధ్య ఒక వారధిలా నిలబడి ఉన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు