నన్నయ్యకు పూర్వం భాషా స్వరూపం
నన్నయ్యకు పూర్వం భాషా స్వరూపం
నన్నయ్యకు పూర్వ యుగాన్ని ప్రాజ్నన్నయ యుగం (Pre-Nannaya age) అని పిలుస్తారు. ప్రాక్ + నన్నయ ప్రాజ్నన్నయ 'ప్రాక్' అంటే పూర్వ కాలమందు అని అర్ధం. క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 1000 వరకు గల కాలాన్ని ప్రాజ్నన్నయయుగంగా వ్యవహరిస్తారు. నన్నయ కు చాలా తెలుగు సాహిత్య ఉంది కానీ అది ఇంతవరకు పరిశోధకులు సేకరించలేకపోయారు బహుశా జానపద వాంగ్మయమే ఎక్కువగా ఉండి ఉంటుంది. నన్నయనే ఆదికవనడం సరైనది కాదని చాలామంది పరిశోధకుల అభిప్రాయం. నన్నయ కన్నా ముందర ఉన్న నన్నెచోడుడు ఆదికవి అని భావిస్తున్నారు.
నన్నయకు పూర్వం అనేకమందిరాజులు, సామంతరాజులు, ధనవంతులు శాసనాలు వేయించారు. జైత్రయాత్ర చేసి కొత్త భూభాగాన్ని తాను సంపాదించినప్పుడో లేదా అగ్రహారాన్ని దానం చేసినప్పుడో లేదా మత విషయాల్ని, ధార్మిక విషయాల్ని తెలియజేయాలన్నప్పుడో లేదా మరో ఏదో కారణంగా రాజులు, సామంతరాజులు, శ్రీమంతులు శాసనాలు వేయించారు. ఈ శాసనాలు రెండు రకాలుగా కన్పిస్తున్నాయి. ఒకటి శిలా శాసనాలు, రెండు తామ్ర శాసనాలు.
సుప్రసిద్ధ భాషా శాస్త్రజ్ఞుడు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ ప్రాజ్నన్నయ యుగంలోని
269 శిలా తామశ్రాసనాల్ని సునిశితంగా పరిశీలించి
సోపపత్తికంగా ఈ యుగంలోని భాషా స్వరూప స్వభావాల్ని తెలియజేశారు.
ప్రాజ్నన్నయ యుగంలోని శాసనాల స్వరూపాల్ని బట్టి భాషా శాస్త్రజ్ఞులు ఈ యుగాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా వర్గీకరించారు. క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 575 వరకు గల కాలాన్ని తొలి దశ (early stage) అంటారు. దీనినే ప్రాకృత సంస్కృత శాసన భాషా యుగం అని కూడా వ్యవహరిస్తారు. క్రీ.శ. 575 నుంచి క్రీ.శ. 1000 వరకు గల కాలాన్ని మలి దశ (Later Stage) అని అంటారు.
రాయలసీమ లో ప్రభవించిన తెలుగు
క్రీశ. 575లో కడపజిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడులోని చెన్నకేశవ
స్వామి ఆలయంలో 'ఎరికల్ ముత్తురాజు' వేయించిన శాసనమే తెలుగులో మొట్టమొదటి శాసనంగా పరిగణిస్తున్నారు. ఇది వచన శాసనం.మొట్టమొదటి తెలుగు శాసనంలోని భాష ఇది. 'స్వస్తిశ్రీ ఎరికల్ ముత్తురాజుల్లకుణ్ణి కాళ్ళు (ని) వబుకాను ఇచ్చిన పన్నస దుజయ రాజుల ముత్తురాజులు నవప్రియ ముత్తరాజులు వల్ల lపదుక రాజులు సక్షి కాను ఇచ్చి(న) పన్నస్స కొట్టంబు పాణకుకుణ్ణి కాళ్ళుళ ఇచ్చిన పన్నస ఇరివదియాదినాల్కు మఱునుబ్లు నేల....”
క్రీ.శ. 848 ప్రాంతం నాటి పండరంగని అద్దంకి శాసనం మొట్టమొదటి తెలుగు పద్య
శాసనం. ఇది తరువోజ ఛందస్సులో వుంది. క్రీ.శ.898 నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో
కవిత్వ పద్ధతి కనిపిస్తుంది.
ప్రాజ్నన్నయ తెలుగు భాషా స్వరూప స్వభావాల్ని తెలుసుకోవడానికి పరమ ప్రామాణిక మైన, ప్రధానమైన ఆధారాలు శాసనాలు మాత్రమే. శాసనాల్లోని భాషా ధ్వనులు,వర్ణాలు, సమాసాలు, ఛందో విశేషాలు, ధాతు ప్రత్యయ నిర్మాణం, పద రచన, వాక్య విన్యాసం, సర్వనామాలు, వ్యక్తుల నామాలు, గ్రామ నామాలు, సంఖ్యా వాచకాలు, క్రియలు, విభక్తులు, పదజాలం మొదలైన వాటిని ఆధారం చేసుకుని ప్రాజ్నన్నయ యుగ భాషా స్వరూపాన్ని దాని పరిణామ వికాసాన్ని తెలుసు కోవచ్చు.
నాగబు పదం
క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందినశాతవాహనుల కాలం నాటి అమరావతి స్థూపం (గుంటూరు
జిల్లా సత్తెనపల్లి తాలూకా)లో 'నాగబు' అనే పదం శాసనాల్లో తొలి తెలుగు పదమని మొట్టమొదటి సారిగా ప్రముఖ విమర్శకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. ఇందులో 'నాగ' శబ్దం సంస్కృతం. 'బు' అనేది అమహద్వాచక ప్రథమైక వచన ప్రత్యయమైన 'ము' వర్ణానికి రూపాంతరం. నాగబు పదం కాక “నాగబుధి", "నాగబోధి" అనే మాటలు ప్రాకృత శాసనాల్లో కన్పిస్తున్నాయి. “నాగబు" అనేది"నాగబుధి" లోని ఒక భాగం కావచ్చునని కొంతమంది భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఏదిఏమైనా ఈ విషయం ఉత్తమ పరిశీలన వల్ల మాత్రమే నిగ్గు తేలుతుంది. 'ము వర్ణమునకు మాముడి యేనింబూర్ణ బిందుపూర్వకబువర్ణంబేని విభాషనగు' (చిన్నయసూరి -బాల వ్యాకరణం -
తత్సమ పరిచ్చేదం - 42) అనే సూత్రం వల్ల 'నాగము' శబ్దం; నాగమ్ము, నాగంబు అనే రూపాలు ఏర్పడతాయి. 'నాగంబు'లోని బు వర్ణానికి ముందు గల బిందువు లోపించి 'నాగబు' అవుతుంది.
భాషా శాస్త్రకారుల అభిప్రాయం ప్రకారం 'బు' అనేది తెలుగు ప్రత్యయం. ఈ విషయం విమర్శకుల్లో ఎవరికీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇది ంబు, 'ము', 'మ్ము' అనే రూపాలుగా కనిపిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి