ప్రపంచీకరణలో సాహిత్యం
1980లో రష్యాలో 'పెరిస్టోయికా', 'గ్లాస్ నోస్త్ వంటివి ప్రవేశపెట్టడంతో ప్రజాస్వామ్య ఉద్యమాలు పెరిగి అక్కడి కమ్యూనిస్టు పార్టీ అధికారం కోల్పోయింది.ఫలితంగా సోవియట్ యూనియన్ 1990 నాటికి విచ్ఛిన్నమైపోయింది. 1989లో
బీజింగ్ లో ప్రజాస్వామ్యం కోసం పోరాటం వచ్చినా అది అణచి వేయబడింది. ఆ సందర్భంలోనే కమ్యూనిజం వ్యతిరేక గాలులు వీచి బెర్లిన్ గోడ బ్రద్దలైంది. కమ్యూనిస్టు వ్యతిరేక పవనాలు ప్రపంచ వ్యాప్తంగా వీచడంతో పెట్టుబడి దారీ విధానం ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచాధిక్యతను సాధించింది. దీనినే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అన్నారు. దీని ప్రభావం మన దేశంపై ముఖ్యంగా తెలుగు సాహిత్యంపై పడింది. దీనినే మనం పడమటిగాలి అన్నాం.
ప్రపంచీకరణ ప్రారంభ దినాల్లో సాహిత్యకారుల్లో గందరగోళం ఉండేది. ప్రపంచీకరణవల్ల మేలు జరుగుతుందనే ప్రచారం ఉండేది. ప్రపంచీకరణ
అన్ని రంగాల్లోకి విస్తరించి ఎప్పుడైతే అన్ని మూలాల్ని ధ్వంసం చేయడం మొదలు పెట్టిందో అప్పుడు సాహిత్యకారుల్లో భ్రమలు తొలగి తమదైన సాంస్కృతిక వారసత్వం కోసం గతంలోకి తొంగి చూడటం మొదలుపెట్టారు. నోస్టాల్జియాలోకి
వెళ్లిపోయారు. గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణ విసిరిన సవాళ్ళు చెప్పలేనంతగా పెరిగాయి. అవినీతి పెరిగిపోయింది. ప్రపంచ బ్యాంకు షరతులు ఒక్కొక్కటీ అమలవుతున్నాయి. ప్రైవేటీకరణ, సరళీకరణ వేగవంతమ య్యాయి.
కాంట్రాక్టు ఉద్యోగులు పెరిగారు. చాలా ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయి. సాఫ్ట్వేర్ రంగం విజృంభించింది. వైద్య, వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించాయి. చేనేత, వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. భాషా
సంస్కృతుల్లో పెను మార్పులు వచ్చాయి.
కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగింది. ఇంటర్నెట్, ఫేస్బుక్ లు వచ్చాయి. విదేశాలకు వెళ్ళడం సహజమై పోయింది. అదే సందర్భంలో మానవ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
ప్రపంచీకరణకు ప్రతిఘటనగా, ధ్వంసమవుతున్న మానవీయ విలువలను, పతనమవుతున్న సామాజిక విలువలను నిలబెట్టేందుకు, సాహిత్యకారులు తమ సృజనకు పదును పెట్టారు. "మాయమైపోయినాడమ్మా మనిషన్నవాడు”
అనే పాట కూడా వచ్చింది. మానవతావాద దృక్పథం తో ఎన్. గోపి, అంపశయ్య నవీన్, సినారె, పాపినేని శివశంకర్, యాకూబ్, గోరటి వెంకన్న మొదలైనవారు తమ రచనలను సాగిస్తున్నారు.
అంతేగాక ఒకవైపు మానవీయ దృక్కోణంతో వస్తున్న
సాహిత్యాన్ని, వివిధ అస్థితత్వ ఉద్యమాల ద్వారా
వచ్చిన సాహి త్యాన్ని, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలలో వస్తున్న మార్పుల వెలుగులో అనేక మంది సాహితీ విమర్శకులు సమీక్షిస్తూ, విశ్లేషిస్తున్నారు. వీరిలో దివంగతులైన
చేకూరి రామారావు, వల్లంపాటి ప్రముఖులు. ప్రస్తుతం రాచపాళెం, రామమోహన్ రాయ్, కాత్యాయిని విద్మహే, తెలకపల్లిరవి మొదలైనవారు గతితార్కిక చారిత్రక సూత్రాల వెలుగులో వర్తమాన సాహిత్యాన్ని విశ్లేషిస్తున్నారు.
“21వ శతాబ్దంలో మనిషి మరణిస్తున్నాడు. వస్తువే ప్రధానమైందని" ఎరిక్ ఫ్రామ్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత ఆశలు,స్వార్థం, అవినీతి, సంపాదనలు, ఉద్యోగ అవకాశాలు ప్రధానమైనాయి. ఈ కాలంలో కవులు మరణించి నంతగా ఎవరూ మరణించలేదు. అంటే కవులు రాయటం మానేసారు. వేరే వ్యాపకాల్లోకి వెళ్ళి పోయారు.
రెండు దశాబ్దాల తరువాత కవులు రచయితలు తెప్పరిల్లారు.మూలాలను అన్వేషించడం మొదలుపెట్టారు.చేజారిపోతున్న విలువలను ఒడిసి పట్టడానికి ప్రయత్నించారు.ఈ రకమైన కృషి జరుగుతుండగానే ప్రపంచీకరణ ప్రజాజీవనంలోకి ప్రవేశించి మూడు దశాబ్దాల అంచుకు చేరింది. సమాజం ఎన్ని ముక్కలవ్వాలో అన్ని ముక్కలయ్యింది. అస్థిత్వ వేదన, సమాజంలో ఒంటరి వేదన, సౌకర్యాల కోసం
వెంపర్లాట, అయోమయ సౌఖ్యాలకోసం పరుగులాట, విశృంఖలత్వం - ఇలా సామాజిక సంబంధాలలో మార్పులు, భాషా సంస్కృతుల్లో మార్పులు. ఇది పతనమా? ఉత్తానమా? తిరోగమనమా?
కవి మాత్రమే దీన్ని గుర్తించగలడు. ప్రారంభంలో కవి అయోమయంలో పడినా ప్రస్తుత సందర్భాన్ని కవి పట్టుకున్నాడు. ప్రపంచీకరణ వినియోగవస్తువుల వ్యామోహాన్ని పెంచడాన్ని, మానవతా విలువలు తగ్గిపోయి, మానవ సంబంధాల మధ్య ధన సంబంధ దృష్టి పెరిగి పోవడాన్ని, ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాటను,
కోల్పోతున్న ఆత్మీయ స్పర్శను నిజాయితీగల కవులు గుర్తించి వాటినే తమ కవితా వస్తువులుగా
మలుచుకున్నారు. భావకవిత్వంలో మునిగిన కవి సామాజిక సంక్షోభ సందర్భాలను వదలి నేలవిడిచి
సాము చేస్తున్నాడు అంతర్జాలంలో.
మానవసంబంధాలు డబ్బు సంబంధాలుగా పెట్టుబడిదారీ వ్యవస్థలో మారిపోతాయని మార్క్స్
ఏనాడో చెప్పినాడు. నేడు వ్యాపార విలువలు ఉన్నతీకరించబడిన సందర్భంలో మానవతా విలువలు,రాగబంధాలు మృగ్యమై మానవీయ స్పర్శ మనుషుల మధ్య మాయమవుతోంది.
మనుషులు కలిసినా పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకోవడం కరువైపోయింది. ప్రపంచమంతా
కుగ్రామంగా మారిందనుకున్నా మనుషుల మధ్య ప్రేమ బంధం దూరమైపోయింది. పక్కనున్న
మిత్రునితో మాట్లాడలేనివాడు అంతర్జాలంలో ముక్కుమొహం తెలియనివాడితో సంభాషిస్తాడు. ప్రక్కన మిత్రునితో కన్నా ఎక్కడో నున్న మిత్రునితో సెల్ లో గంటల తరబడి సంభాషిస్తాడు.
“ఇప్పుడు కలవడాలు లేవు / కరచాలనాలు లేవు / కలుసుకొని కన్నీళ్ళు కలబోసుకోవడాలులేవు
ఎవరి ఏడుపులను వారు భుజాలకెత్తుకుని / కావడి బద్దలై కనులు తుడుచు కోవడమే"
అంటాడు సి. హెచ్. బృందావనరావు తన కవిత “ఏకైక భాష"లో,
జీవన వేగం బాగా పెరిగింది. ఇక్కడున్న సొమ్మును కాంతివేగంతో సుదూర ప్రాంతానికి
బదలాయించవచ్చు. ఏవిదేశీ వస్తువువైనా క్షణంలో కొనేయవచ్చు. డబ్బుంటే చాలు. అందుకే డబ్బే
సర్వస్వమయింది. మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను కవి ఒక విపత్కర పరిస్థితిగా గుర్తించాడు.
వైరుధ్యాలను కవి పట్టుకున్నాడు. అందుకే కత్తి పద్మారావు తన గచ్చ పొదల్లో సూరీడు కవితలో
“ప్రపంచం దూరవుతున్న మాటనిజం / మనుషులు ఒకరినొకరు / దూరం అవుతున్నమాట నిజం.
ఒక సామాజిక సందర్భాన్ని, మనసును కలచివేసే సంఘటనను, సామాజిక పురోగమన పోరాటాన్ని కవిత్వం ఒడిసి పట్టుకుంటుంది. సమాజాన్ని కదిలించేందుకు కవి తన కలాన్ని కదిలిస్తున్నాడు.
“ఏ భావదారిద్ర్యం / యువతను నిర్వీర్యం చేసింది / ఏ మాయాజాలం | యువతరాన్ని నిష్క్రియాపరత్వంలోకి నెట్టింది /ఏ దుష్ప్రచార సాధనాల చెదపురుగు / యువత మెదళ్ళను అనుక్షణం తినేస్తున్నది ఏ మత్తు / యువతను ఉన్మత్తుల చేసింది | " అంటూ నిర్భయ సంఘటనకు కారకులెవ్వరని తన క్షతగాత్ర గానం కవితలో ప్రశ్నిస్తాడు జీవన్.
“నాకిప్పుడు వందేమాతరం అంటే | వందేళ్ళ అభద్రతాభావమై / కలవరపెడుతోంది |
సారేజహాసా అంటే / సామాజిక ఆర్త నాదంలా ధ్వనిస్తోంది " అంటూ తన 'పంతొమ్మిదవ పర్వం - పన్నెండవ ఆశ్వాసం' కవితలో రాధేయ ప్రజల భావావేశాన్ని తనపదునైన భావాలతో వ్యక్తీకరించాడు. ఇలాగే ఆవుల బసప్ప, కెంగారమోహన్, నాయని కళ్యాణ
చక్రవర్తి, ముదల వలస పద్మావతి తదితరులు ఎంతో పదునైన వాడియైన కవితల్ని ఆవిష్కరించారు.
కవి వేసే ప్రశ్నలకు, సామాజిక వెబ్ సైట్లలో సమాధానం దొరకదు. కవుల అంతరంగ
ఆవిష్కరణలోనే అది లభిస్తుంది.
మహిళలను ఆటవస్తువుగా, అంగడి బొమ్మగా అందాల సరుకుగా మార్చి విఫణిలో నిలబెట్టిన వైనం నేటి వ్యాపార వస్తు ప్రపంచంలో చూస్తున్నాం. మార్కెట్లో వస్తువిక్రయ సాధనంగా మహిళలను ఉపయోగించడం నేర్పింది సామ్రాజ్యవాద సంస్కృతి. దీని పర్యవసానమే అన్నిచోట్లా మహిళలపై జరుగుతున్న హత్యాచారాలకు, దురాగతాలకు కారణం. మహిళలపట్ల పురుషాధిక్య ప్రపంచానికున్న
హీనమైన భావనలు కూడా తోడయ్యాయి.
సామాజిక సందర్భాలనే కాక, మానవసంబంధాలను ప్రభావితం చేసే అంశాలను కూడా వర్తమాన
కవి ఆత్మీయ స్పర్శతో వ్యక్తీకరిస్తాడు. కనిపించే ప్రతి వస్తువునూ కవిత్వంలోకి భావ చిత్రంగానో,
పదచిత్రంగానో మార్చుకుంటున్నాడు. పాత పదచిత్రాల స్థానంలో కొత్తవాటిని గుప్పించి కవిత్వానికి కొత్త సొబగులను తీర్చిదిద్దుతున్నాడు. ప్రతీకలు మారుతున్నాయి. అంతర్వేదనను, ఏదోపోగొట్లుకున్న భావనను, అనుభూతుల్ని కవిత్వీకరిస్తున్నారు వర్తమాన కవులు.
వఝల రవికుమార్ రైలు ప్రయాణం దగ్గర ఆత్మీయులు వీడ్కోలు సంభాషణను ఇలా చెపుతాడు
"రైటుచుట్టూ / అప్పగింతల వీడ్కోళ్ళు / మేఘాల ముసురు / ఎన్ని చెప్పినా / పూర్తిగా చెప్పలేక పోయినదేదో గొంతులో ఇరుక్కుపోతుంది"
“నా చెరువును చంపేశారు | నాజ్ఞాపకాలను సమాధి చేశారు" అంటూ కర్ణకట రవీంద్రనాథ్ తన
ఊరి చెరువుతో అనుబంధాన్ని తనకవితలో వ్యక్తీకరిస్తాడు.
వర్తమాన పరిస్థితుల్లో తన తల్లి పేరుతో బంధనాలు తెంచుకుని జీవనం సాగిస్తున్న వేళ, మనిషి ఆత్మాశ్రయాన్ని ఆశ్రయిస్తున్నాడు. అంతర్ముఖుడవుతాడు. గత స్మృతులను నెమరేసుకుని వాటిని కోల్పోవటం వల్ల ఎంత బాధ పడుతున్నది తెలియజేస్తాడు. గతకాలాన్ని నెమరువేయడం కొంతమందికి బాగుండవచ్చు. వర్తమానాన్ని వదలిపోవడం తనకూ, సమాజానికి, సాహిత్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
కొన్ని ఆత్మాశ్రయ ధోరణులున్న కవితల్ని చూద్దాం.
అక్షరజ్ఞానం అందించిన బడిని చూస్తుంటే
గోడకుర్చీ వేయించిన తెలుగు మాస్టారూ
లెక్క తప్పినందుకు చెంపలు వాయించిన
లెక్కల మాష్టారు గుర్తిస్తారు
__మృతిలేనివి (బొమ్మరాతమల్లయ్య)
దూసుకుపోతున్నాం
నేనూ, తప్పిపోయిన మేకపిల్లా
లేదు, నాచిన్ననాటి స్నేహితుడు, నేనూ
ఆహా - నేనూ నన్ను వెంటాడే దెయ్యమూ
స్కైబాబా (వింగ్స్)
కుక్కపిల్ల, అగ్గిపుల్లా, సబ్బుబిల్లా, కాదేదికవిత కనర్హం. అని శ్రీశ్రీ చెప్పినట్లు నేడు కవికి
కవితావస్తువులు ఎన్నో ఉన్నాయి. లోకోభిన్నరుచి, 'ఏకంసత్, బహుదావదంతి' అన్నట్లు కవులు
ఒకే వస్తువును భిన్న దృక్కోణాలలో తమదైన శైలిలో రాస్తునారు. వీరికి సామాజిక సమస్యలు సహజంగా
పట్టవు. కవిత్వం కవిత్వం కోసమే నన్నట్లుగా రాస్తుంటారు. నిత్యం జరిగే సామాజిక సంఘర్షణలను, మనిషి పడే తపనలను రాజకీయార్థిక మార్పులను కవులు తమ కవితా వస్తువులుగా స్వీకరించవచ్చు.
తగినంత అవగాహనలేక పోవడంవల్ల ఆదిశగా ఎవరూ ప్రయత్నం చేయకపోవడం వల్ల రాజకీయ కథలు వచ్చినంతగా రాజకీయ కవిత్వం, ఆర్థికాంశాలపై కవిత్వం తగినంతగా రాలేదు.
'నా అక్షరాలు వెన్నల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అంటూ తిలక్ తన కవితాక్షరాల గురించి వ్యాఖ్యానించు కున్నాడు అమృతం కురిసిన రాత్రిలో. అక్షరకేతనంలో కళాగోపాల్ అక్షరాన్ని ఇలా కీర్తిస్తాడు.
“అక్షరాలు మన నడతకు ఆనవాళ్ళు / అక్షరాలు చరిత్ర పుటల్లో గీటురాళ్ళు / అక్షరాలు క్షరమవని
పంచభూతాలు / అక్షరాలు కనిపించని అమ్మానాన్నలు"
డా||ఎన్. గోపి తన పనిముట్టు కవితలో “చేతిలో ఉన్నది / వొట్టి పెన్నే కావచ్చు /
మరచిపోకు / అది అశేష భావవాహినికి / మొలచిన కన్ను /" అంటూ పెన్నును ఉన్నతీకరిస్తాడు.
చిల్లర దుకాణాల్లోకి వాల్ మార్ట్ లాంటి బహుజాతి కంపెనీలకు అనుమతినివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా దేశంలోని చిల్లర దుకాణాల యజమానులు సమ్మెచేశారు. చిల్లర దుకాణాలు మెల్లమెల్లగా అదృశ్యమయ్యే పరిస్థితి దేశంలో నెలకొంది. ఈ పరిస్థితిని సరిగ్గా గుర్తించిన చైతన్య ప్రసాద్ తన కవితలో ఎంతో ఆవేశంగా ప్రభుత్వాన్ని ఇలా నిలదీస్తాడు? మనల్ని ఆలోచింపజేస్తాడు.
“అవునూ..... మనదేశంలో ఉప్పు పప్పు బెల్లం చింతపండు అమ్మడానికి / అమెరికా నుండి వాల్ మార్ట్ రావాలా? మనం దుకాణాలు మూసుకోవాలా?
మన చిల్లర దుకాణాల్ని మింగేసి, రైతన్న, ప్రజల్ని నిలువునా దోచేసిన సొమ్ము /
ఏ రోజుకారోజు తమ దేశానికి జమ చేసుకుంటుంటే..... మనం చూస్తూ ఉండాలా?
విదేశీ ప్రత్యక్ష నిధుల కోసం పాలకులు మనదేశ తలపులు బార్లా తెరిచారు. చిల్లరవర్తకులకే
కాదు,భీమా, పెన్షన్, పౌర విమానరంగం, ప్రసార రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లోకి.... ఇలా అన్ని రంగాల్లోకి
విదేశీ నిధులకోసం అర్రులుచిస్తున్నారు.
“మానవజాతిని వ్యాపారీకరించే ఈ పెట్టుబడిదారీ ప్రపంచంలో" అంటూ ఆక్రోశిస్తాడొక వర్థమాన
కవి. ఇలాంటి ఆర్థికాంశాలను కవిత్వంలోకి తీసుకొచ్చినందుకు అభినందించాలి.
విదేశీ ప్రత్యక్ష నిధులతో పాటు పాలకులు అవినీతి కూపంలోకి కూరుకుపోయారు. అవినీతి
జడల వృక్షం ఊడలు దిగింది. ఈ సందర్భంలోనే ప్రముఖ కవి విమర్శకులు, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి,
“నీతినంతా దొంగిలించేసి నీతో ...నీతో - అని అరుస్తుంటే, దేశం ఏమౌతుంది?" అని ప్రశ్నిస్తాడు తన కవితలో, అడుగులు అంట కాగుతున్నాయి కవితలో వడలి రాధాకృష్ణ ఇలా చెపుతాడు. “అవినీతికి అంబారీలు కడుతున్న వ్యవస్థ / అధికారమై ఊరేగుతూ | తనను తాను చిదిమేసుకుంటున్నట్లుంది". కవికి మట్టికి ఎంతో బంధముంది. “వాడికి మట్టిమట్టే, నాకు మట్టి కవిత్వం" అంటూ ప్రముఖ కవి కె. శివారెడ్డి, మట్టితో బంధమున్న ప్రతికవీ రైతుల గురించి ఆక్రోశిస్తాడు. ఈదేశానికి రైతే వెన్నెముక అనిచెప్పే పాలకులు వ్యవసాయానికి సాయం మానివేశారు. పైగా వ్యవసాయాన్ని కార్పోరేట్ రంగం చేతిలో పెడుతున్నారు. 'ఇప్పుడు రైతన్న'లో రైతుపరిస్థితిని ఇలా చెపుతాడు పల్లిపట్టు నాగరాజు,
“మోడువారిన మర్రిచెట్టు / మండుతున్న ఏటిగట్టు | అదిగో పొలంగట్టు / ఇదిగో ఇదేరైతుగుట్టు".
నానీల పై ఒక జీవన చిత్రంలో కె జగదీష్ రైతు ఎప్పుడూ వ్యవసాయ జూదంలో ఓడిపోతూ ఉన్నాడని ఇలా వ్యక్తీకరిస్తాడు. “గుప్పెడు గింజల కోసం వెదుకులాట | అలసి పోని జూదం - వ్యవసాయం ఈనేలపై / మట్టిని దున్నడం, మట్టిలో చేరడం, ఒక జీవన చిత్రం | పంటలో పాచికలై ఎప్పుడూ ఓటమే".
మట్టితో / సాగుబడి బంధం | పేగుముడి కన్నా బలమైనది అంటూ ఆకుల రఘరామయ్య
మట్టితో రైతుకున్న అనుబంధాన్ని పేగుబంధం కన్నా బలమైనదిగా వ్యక్తీకరించాడు. ఇది వాస్తవమే.
కాని వర్తమానపరిస్థితుల్లో గత్యంతరం లేని రైతు తన భూమిని అమ్ముకుంటూ పేగుబంధాన్ని
తెంచుకుంటున్నాడు. భూమి ఇప్పుడు కార్పోరేట్ గుప్పెట్లోకి వెళుతోంది.
కవిత్వం అంతర్జాలంలో విరివిగా వస్తున్నప్పటికీ సామాజిక సంక్షుభిత సందర్భాన్ని తన చుట్టూ జరిగే సామాజిక పరిస్థితులను ఆకలింపుచేసుకోకుండా తమలోతామొక సాంఘిక దర్శనం చేసుకుంటున్న చాలా మంది అంతర్జాలకవులు అనుభూతి కవిత్వాన్ని, ఆత్మాశ్రయకవితల్ని ఆవిష్కరిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి