సినారె


ఎదురీదే చేతులుంటే ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది
అంటూ జీవితం పట్ల గొప్ప ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసిన విశ్వంబరుడు సినారె.
        సినారె గా ప్రసిద్దుడైన సి.నారాయణరెడ్డి 1931, జూలై 29  న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట్లో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు
జన్మించాడు.  వారిది రైతు కుటుంబం. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదు లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. సినారె  ఉస్మానియాలో ఉర్దూ మీడియంలో బీఏ పూర్తి చేశారు.1954లో ఉస్మానియాలో ఎం.ఏ తెలుగు పూర్తిచేసి, ఆచార్య ఖండవల్లి లక్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు-ప్రయోగములు’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. సినారె గారికి చిన్నప్పటి నుండి కవిత్వం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆరేడు తరగతుల వయసులోనే కవితలు రాశారు. అనేక జానపదాలు, హరికథలు, బుర్రకథలు నేర్చుకున్నారు. సినారె తొలి రచన 1953లో ‘నవ్వనిపువ్వు’ ను రాశారు. అనేక గేయనాటికలను, గేయకవితలను, ఖండ కావ్యాలను,కవితాసంపుటాలను, విశిష్ట కావ్యాలను, వ్యాససంపుటాలను, దీర్ఘ కావ్యాలను రాసిన సాహితీ ఉప్పెన సినారె. 

సినారె గారి ‘విశ్వంభర’ వచన కావ్యానికి 1988లో  జ్ఞానపీఠ్‌ అవార్డు లభించింది.  ‘మంటలూ -మానవుడు’ అనే కవితాసంపుటానికి 1973లో ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. బౌద్ధ కథగా ‘నాగార్జునాసాగరం’ పేరు పొందిన కథాకావ్యం. మాత్రాఛందస్సుకు ప్రాణం పోసిన గేయకావ్యం ‘కర్పూ ర వసంతరాయలు’ ఎనలేని ఖ్యాతిని పొందిం ది.‘మధ్యతరగతి మందహాసం’ కవితాసంపుటి వచనకవిత్వాన్ని బలోపేతం చేసింది. ‘ప్రపంచ పదులు’ వంటి విశిష్ట కావ్యాలను రాశారు.

‘ప్రపంచ పదులు’లో..
‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు
నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు 
కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’  అంటూ చెప్పిన కవిత్వం అద్వితీయం.అలాగే గజల్‌ లో..‘మబ్భుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బె ముసిరితే కన్నీరవుతుంది..’అని చెప్పిన కవితలు నేటికీ ఆదర్శవంతగా ఉన్నాయి. ఊపిరి ఉన్నంత వరకు ఆయన కవితావాహిని ఆగలేదు. కలం, గళం రెండు ఆయన అస్ర్తాలు.

సినారె గారు1981లో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, 1985లో  అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా, 1989లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా, 1992లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారులుగా, 1993లో ఆంధ్రప్రదేశ్‌ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా- ఏ పదవిలో ఉన్నా ఆ పదవులకు వన్నె తెచ్చారు.  1962నుంచి సినీ ప్రస్థానం ప్రారంభించి సినీ గేయాలు రాయడం మొదలు పెట్టారు. ‘గులేబకావళి కథ’ సినిమాలో ‘నన్ను దోచుకుందువటే... వన్నెల దొరసాని..’ అనే పాటతో పాటు ఆ సినిమాకు అన్ని పాటలు రాశారు. ‘అరుంధతి’, ‘మేస్త్రీ’ సినిమాల వరకు మొత్తం మూడువేల వరకు పాటలు రచించి సాహిత్య వాణిగా మిగిలి పోయారు. 

‘గున్నమామిడీ కొమ్మమీద...గూళ్ళు రెండున్నాయి..’

‘పగలే వెన్నెలా... జగమే ఊయలా..’

‘వస్తాడు నా రాజు ఈ రోజు..’

‘అమ్మను మించి దైవం ఉన్నదా..’

‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’

‘జేజెమ్మా..... మాయమ్మ..’ అంటూ అద్భుత పాటలు సినారె కలం నుండి 
జాలువారిన సాహిత్య చంద్రికలు.

జ్ఞానపీఠ్‌ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు  సినారె ఎన్నో పురస్కారాలను పొందారు. 1977లో పద్మశ్రీ, 1992 లో పద్మభూషణ్‌ అందుకున్నారు. రాజ్యలక్మీ పురస్కారం, సోవియెట్‌ నెహ్రూ పురస్కారం, కళాప్రపూర్ణ, సినీకవిగా నంది పురస్కారం, పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లను అందుకున్నారు. 2014లో జీవన సాఫల్య పురస్కారం పొందారు.
సినారె రచించిన వచన కావ్యం
విశ్వంభర కు 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడింది. సినారె దీనిని రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజాకు అంకితమిచ్చారు. దీనిని మొదటిసారిగా 1980లో ముద్రించారు.
ఇందులో

నేను పుట్టక ముందే
నెత్తి మీద నీలి తెర
కాళ్ళ కింద ధూళి పొర
ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో
మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి
చిచ్చుముద్దల్లోంచి
చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు
పాలమీగడల్లా పరుచుకున్నాయి
 అంటాడు.


ఇంకా
బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదలింది హరిణాలుగా
నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది
నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది

వేయి తోటలను నరికిన చేయి
పూయిస్తుందా ఒక్క పువ్వును
ఉర్వీతలాన్ని వణికించిన శక్తి
ఒక్క హృదయాన్ని జయిస్తుందా...

అనడుగుతాడు.

మనసుకు తొడుగు మనిషి
మనిషికి ఉడుపు జగతి
ఇదే విశ్వంభరా తత్వం
ఇదే అనంత జీవిత సత్యం....
అంటూ విశ్వంబర తత్వాన్ని
ఆవిష్కరిస్తారు.

విశ్వంభరే గాక మనిషి - చిలక,
ముఖాముఖి,భూగోళమంత మనిషి,దృక్పథం
కలం సాక్షిగా,కలిసి నడిచే కలం,
కర్పూర వసంతరాయలు,
మట్టి మనిషి ఆకాశం,
మంటలూ - మానవుడూ - (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం),
తేజస్సు నా తపస్సు,
నాగార్జున సాగరం,
విశ్వనాథ నాయకుడు,
కొనగోటి మీద జీవితం,
రెక్కల సంతకాలు,
వ్యక్తిత్వం,మొదలైన కావ్యాలెన్నో రచించారు.
1955లో సినారె అజంతా సుందరి సంగీత రూపకాన్ని రచించారు. 1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకమిది.
తెలుగు వారి కీర్తి ని ఖండాంతరాలలో విస్తరించిన
నారాయణరెడ్డి  హైదరాబాద్‌ లోని కేర్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ 2017, జూన్ 12  తుదిశ్వాస విడిచారు.

కామెంట్‌లు