ఆచల్లని సముద్ర గర్భం




       
      ఆచల్లని సముద్ర గర్భం 
       ‌‌ ‌‌ ‌‌                       ___దాశరథి             

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో
        || ఆ చల్లని||
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాలసుడిగుండాలకు బలైన పవిత్రులెందరో
|| ఆ చల్లని||
మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో 
రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపుకోతతో అల్లాడిన కన్న తల్లుల విషాదమెంతో
ధనవంతుల దుర్మార్గాలకు దగ్దమైన బతుకులు ఎన్నో
|| ఆ చల్లని||
అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసి పాపలనిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో
|| ఆ చల్లని||

 - దాశరథి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు