కవిత్వం -డిక్షన్(poetry-diction)
కవిత్వంలో డిక్షన్ అన్నది ఒక శైలికి (style)కి సంబంధించినది.అది కదితానిర్మాణానికి మార్గాలు చూపుతుంది.కొత్తగా కవిత్వం రాస్తున్న కవులను కవిత్వం ఇలా రాయాలని,లేదా ఫలానా వారి మాదిరి రాయాలని..ఆదేశించడం అన్యాయమే అవుతుంది.ఎందుకంటే మన తెలుగు సాహిత్యంలో మెుదటి నుండి వ్యక్తి పూజ అన్న జాఢ్యం ఉంది.అభిమానం వేరు, జాడ్యం వేరు.పెద్దన వలె కృతి చెప్పిన పెద్దనవలె..లేకుంటే గద్దన వలె..మెుద్దన వలె..ఎద్దన వలె అంటూ కవి చౌడప్ప ఆరోజుల్లోనే కొత్తగా కవిత్వం రాసే వారిని అదరగొట్టాడు.
ఇప్పటికీ కవిత్వం రాస్తే శ్రీశ్రీ లా రాయాలని ,శేషేంద్రలా రాయాలని తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానంతో అనేవాళ్ళు ఉన్నారు.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కవిత్వం -డిక్షన్ లో అనేక మార్పులొచ్చాయి.పైగా పెద్ద కవులతో పోల్చుకుని కవితలు రాయాల్సిన అవసరం లేదు.అప్పట్లో రాయల కొలువులో తీరిగ్గా పెద్దన కవిత్వం రాశాడు.ఇప్పుడు కంప్యూటర్ యుగంలో బతకడమే భారమైన కంజ్యూమర్ సమాజంలో కవిత్వం రాయడమే గొప్ప విషయం.వారికి కొన్ని టెక్నిక్స్ తెలిస్తే వారే ఎంచక్కగా మంచి కవిత్వం రాసుకుంటూ వెళతారు.అందుకు ఆలూరి బైరాగి అన్నట్టు `ప్రతి అక్షరం ఒక భటుడు,ప్రతి పదం ఒక శగటు,ప్రతి ఊహ ఒక వ్యూహం` గా మార్చుకుంటూ వెళితే ఎవరైనా మంచి కవిత్వం రాయవచ్చు.ప్రతి ఊహను ఒక వ్యూహంగా కవితా నిర్మాణం చేపట్టడానికి యువకవులు కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలి.అంతే కాని ఈ పరుగుల జీవితంలో టెక్సన్ తో ఉద్యోగాలు చేసుకునే యువతను అందరి కవుల కవిత్వాన్ని,పెద్ద పెద్ద కావ్యాలను చదవమంటే చదివే ఓపిక తీరిక వారికుండదు.అందుకే కవితా నిర్మాణంలో తమదైన ఒక శైలిని సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు వారికి అవసరం.గత కవిత్వం డిక్షన్ వ్యాసాల్లో వచన కవిత్వం ఎలా ఉండాలి.వాక్యం కవిత్వం అవుతుందా,?శబ్ద చిత్రాలు,ప్రతీకలు,సిమిలి.మెటాపర్లు,పర్సోనిపికేషన్,ఇంకా అనేక విషయాలను స్థూలంగా పేర్కొనడం జరిగింది.ఇప్పుడు..పొయెటిక్ డెవిసెస్ (poetic devices)లో పరిశోధకులు కవితానిర్మాణంలో వాడిన టర్మినాలజి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఒక కవితను నిర్మస్తున్నపుడు ఎలా కవితను మెుదలు పెట్టాలి?మనకు వచ్చే ఊహలను ఎలాంటి వ్యూహంతో కవితగా శిల్పీకరించవచ్చు అన్నది యువ కవులు పసిగట్టాలి.పొయెటిక్ డెవిసెస్ లో అల్లిగొరి(allegory) అల్లూషన్(allusion) సిల్లోజిజమ్(syllogism) మెటానమి(metonomy)లాంటి ఇంకా అనేక లింగ్విస్టిక్ పరిభాషలో అనేక అర్థాలు స్పురింపజేసే కవితా సామాగ్రికి చెందిన టెక్నికల్ పదాలున్నాయి.సందర్భాను సారంగా వాటిని ఉదహరిస్తూ కవితా నిర్మాణానికి సంబంధించిన కొన్ని మెలకువలు చెప్పడం జరుగుతుంది.అల్లిగొరి(allegory) అంటే అబ్ స్ట్రాట్ (కనిపించని)ఆలోచనలను,సూత్రాలను వర్ణించడాన్ని అల్లిగొరి అంటారు.ఇది క్యారెక్టర్స్,సంఘటనలకు సంబందించినది.సింబాలిజానికి అల్లిగొరికి తేడా ఉంది. జార్జ్ ఓర్ వెల్(george orwell) animal farmలాంటి పదబంధాలను అల్లిగొరి concept లోనే ఉపయోగించాడు.రచయితలు అనేక సందర్భాల్లో నీతికి సంబంధించిన విషయంలో తమకు తోచిన ఆలోచనలను అల్లిగరి స్టైల్ లో కవిత్వం చేసిన సందర్భాలున్నాయి. john bunyans`pilgrims progress`ను spiritual allegoryకి ఉదాహరణగా చెబుతారు.రచయిత ప్రాపంచిక దృక్పథాన్ని..నీతి నేపథ్యంలోని ఆలోచనా విధానాన్ని అల్లిగరి తెలియజేస్తుంది.అలాగే ఒక విషయాన్ని కవిత్వం చేస్తూ పోతున్నప్పడు ఇచ్చే రెఫరెన్సులను అల్లూషన్ అంటారు.ఇది ఒక వ్యక్తి లేక స్థలం,లేక వస్తుకు సంబంధించినదై ఉంటుంది.చరిత్ర సంస్కృతికి సంబంధిన ఒక ఆలోచనైనా కావచ్చు.అయితే ఇది పూర్తీగా ఒక వ్యక్తిని గాని వస్తువును గాని వర్ణించదు.ఉదాహరణకు `ఆమె ముందు రాముడిలా నటించకు` అనడంలో రాముడు అన్న రెపరెన్స్ ఉంది.మిల్టన్ ఫ్యారడైజ్ లాస్ట్ గ్రంథంలో dreadless angel ను abdiesకు రెపరెన్స్ గా ఉపయోగిస్తాడు.శ్రీశ్రీ యముని మహిషపు లోహగంటలు మబ్బుచాలున ఖణేల్ మన్నాయి అనడం లో ఇల్యూషన్ ఐడియాలజి ఉంది.కార్మికులకు యముని మహిషం రెఫరెన్స్.మార్లోవ్స్ రాసిన `doctor fanstus` గ్రీకు మైథాలజీకి olympusనుallusion గా ఉపయోగిస్తాడు.తెలుగులో శేషేంద్ర,కవిత్వంలో ఎన్నో అల్లూషన్స్ ను చూడవచ్చు.శ్రీ శ్రీ ఆలూరి బైరాగి లాంటి కవుల పొయెటిక్ డిక్షన్ గొప్పగా ఉండటానికి వారు కవితానిర్మాణంలో చేసిన ప్రయోగాలే కారణం.కవిత్వంలో syllogism అన్నది ఒక ఆర్గ్యుమెంట్ తో ప్రారంభమవుతుంది.ఆలూరి బైరాగి వేశ్యలాంటి కవితలను ఆర్గ్యుమెంట్ తో ప్రారంభిస్తాడు.
ఆ అచ్చొత్తిన ఓర చూపులా
అవా మరుని తూపులా
విద్యుత్కాంతులు
చల్లని రేయి అవాంతులు
అంటూ కవితను సిల్లోజిజమ్ శైలిలో ప్రారంభిస్తాడు.మధ్యలో ` ఓ వేశ్యా నీవంటే నాకు అసహ్యం అంటాడు.కాని చివరలో..
జాలి జాలి పేరుకున్న చీకటి ముద్దు..ముద్దరాలా
నా గుండెల మబ్బుల్లో మెరసిన
జాలి మెరుపు నిన్నేమైనా
వెచ్చగా కరిగించేనా
వెచ్చని చలిమంట ప్రేమ
ఈ రేయి గడపలేమా
అంటూ కవితను ముగిస్తాడు.అంటే syllogism లో మూడు స్థాయిల్లో స్టేట్ మెంట్ ఉంటుంది .అలా చివరకు సత్యం చెబుతాడు కవి.జనరల్ ట్రూత్ నుండి ఒక స్పెసిపిక్ ట్రూత్ వైపు రీడర్స్ ను తీసుకునివెళ్ళే విధంగా కవితా నిర్మాణం సాగుతుంది.
`ఎవడో చెబితే వినే రోజులు ఏనాడో వెళ్ళి పోయాయి..ఇంకా ఏదో చెప్పాలని ఎందుకీ ఉబలాటం` అన్న శ్రీశ్రీ కవితల నిర్మాణంలో ఆర్గ్యుమెంట్ style కనిపిస్తుంది.పదచిత్రాలను తన ఆవేశం ఆవిష్కరించడానికి శ్రీశ్రీ మాధ్యమాలుగా ఉపయోగించుకున్నాడు.అంతే కాదు.ఆయన కవిత్వంలో వేగం ఊపు కవితా నిర్మాణ ప్రౌఢిమకు కారణం..శ్రీశ్రీ ప్రెంచ్,రష్యన్ ఇతర దేశాల కవుల కవితానిర్మాణ పద్ధతులు అనుసరించడమే,గంటలు మెుదలైన కవితల్లో అది గమనించవచ్చు.ఇవన్నీ తెలుసుకునే కవితలు రాయాలా.?అని భయపడకండి. తెలుసుకుంటే మంచిది.మీరు రాసే కవితలకు కవిత్వం డిక్షన్ ఒక గైడ్ గా ఉపయోగ పడుతుంది.అంతేగాని గైడ్ అంతా బట్టీ పట్టి పరీక్షలు రాసినట్టు కవిత్వం డిక్షన్ బట్టీ పట్టి కవితలు రాయాలని కాదు.
-బిక్కి కృష్ణ
సెల్ :8374439053
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి