నూటాయాభైయ్యేళ్ల ఆధునికసాహిత్యం_ విహంగ వీక్షణం_పార్ట్2

  
                           

             చక్కని వాడుక భాషలో సరళమైన భాషతో, భావాలతో, ముత్యాల సరాలను “ కొత్త పాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా” కూర్చి తెలుగు భాషకు వన్నె తెచ్చాడు గురజాడ.

             ప్రపంచ సాహిత్యంలో ఆధునిక కథానిక 1832లో పుట్టింది. పారిశ్రామిక విప్లవం తరువాత వచ్చిన మార్పుల కారణంగా సమాజంలో మధ్యతరగతి వర్గం ప్రవేశించింది. మధ్యతరగతి బుద్ధిజీవుల నుంచి వచ్చిన కథానిక మన దేశంలోకి
ఆంగ్లేయుల రాకతో ప్రవేశించింది. మన ప్రాచీన సాహిత్యంలో ముఖ్యంగా భారతంలో, బౌద్ధ జాతక కథలలో, బృహత్కథలో ఉన్న కథకు ఆధునిక కథకు చాలా బేధం ఉంది. ఆధునిక కథకు ఉన్న లక్షణాలు ప్రాచీన సాహిత్యంలో ఉన్న కథలకు లేవు. కానీ కథానిక అనే పదాన్ని అగ్నిపురాణం నుంచి స్వీకరించి వాడుకలో ప్రవేశపెట్టారు.
        ముందుకు చదివింపచేసే ప్రారంభం, చక్కటి నడక, సంభ్రమాన్ని కలిగించే ముగింపు కథానిక లక్షణాలు. రచయిత వస్తుస్వీకరణలో జాగ్రత్త వహించాలి. తీసుకున్న వస్తువును పదికాలాలపాటు నిలిచేలా చెప్పగలగటమే శిల్పం. ఏకకాలంలో ఒకే అంశాన్ని గూర్చి చెప్పాలి. కథపాత్రలనూ,
సన్నివేశాలను సృష్టిస్తుంది, వర్ణిస్తుంది. అంటే వ్యక్తులను, నిర్దిష్ట సన్నివేశాలలో వాళ్ళకు కలిగే కష్టసుఖాలనూ, రాగద్వేషాలను చిత్రిస్తుంది. ఈ విధంగా కథలో ఆద్యంతం పాత్రల అనుభూతులు వ్యక్తమవుతూ ఉంటాయి. కథారచయిత
అనవసరమైన పాత్రలు, వర్ణనలు ప్రవేశపెట్టకూడదు. చిన్న వాక్యాలు, క్లుప్తత కథ అల్లికకు అందాన్ని కలిగిస్తాయి. ప్రారంభం నుండి చివరిదాకా
చదివింపచేసేది, గుండెల్ని అర్థం చేసి ఆవేదనతో పాఠకుల కళ్ళు చెమ్మగిల్లచేసేది ఉత్తమకథ.   ఆంగ్లేయుల ఇంగ్లీషు భాషా సాహిత్య ప్రభావంతో  
తెలుగు కథా నిర్మాణం సాగింది.గురజాడకు ఆంగ్ల సాహిత్యం తో పరిచయం ఉంది.అందు వల్లనే
గురజాడ తన దిద్దుబాటు కథను కొత్త ఒరవడితో రాసి  కథాప్రక్రియలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. గురజాడ కన్నా ముందే బండారు అచ్చమాంబ కథ రాసింది. ఆమె కన్నా ముందే అటు రాయలసీమ లో నూ ఇతర ప్రాంతాల లోనూ చాలా మంది దాకా కథలు రాసినవారున్నప్పటికీ గురజాడను మనం కథకు అద్యుడుగానే భావిస్తున్నాం. కారణం ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్న కథావస్తువు, శైలి, నూతన ఒరవడి. నాటకంలో నూతన ఒరవడిని ప్రవేశపెట్టినవాడు గురజాడ. తన కన్యాశుల్కం నాటకంలో కన్యలనమ్మే విధానాన్ని వ్యతిరేకిస్తూ సామాజికా భ్యుదయాన్ని ఆకాంక్షించాడు. కథానిక, నాటకం, కవిత్వాలకు నవ్యరీతులను చేర్చి నూతన యుగానికి బాటలు వేసిన వాడు గురజాడ. అందుకే ప్రాచీన కాలంలో తిక్కన, మధ్యయుగంలో
వేమన, ఆధునిక యుగంలో గురజాడ ముగ్గురు కలిసి కవిత్రయమన్నాడు శ్రీ శ్రీ. కథానిక ప్రక్రియ గురజాడ ప్రారంభించిన ఒరవడిని అందుకుని చలం,
శ్రీపాదసుబ్రమణ్యం శాస్త్రి, వేటూరి శివరామ శాస్త్రిల చేతుల్లో కథ శక్తివంతంగా విరాజిల్లింది. చలం తన కథారచనలతో ప్రజల్లో విప్లవాత్మక భావనలను
ప్రవేశపెట్టారు.

     - పిళ్ళా కుమారస్వామి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు