ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యుడు అబ్బూరి రామ కృష్ణారావు
ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యుడైన అబ్బూరి రామ కృష్ణారావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అనంతవరం గ్రామంలో లక్ష్మీనరసింహశాస్త్రి, బాపమ్మ దంపతులకు 1896, మే 20 న జన్మించాడు. ఆయన చిన్నతనంలో తిరుపతి వెంకట కవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తరచుగా అబ్బూరి తండ్రి గారి ఇంటికి వస్తుండేవాడు. బలిజేపల్లి లక్ష్మీకాంతం, గోవిందరాజులు సుబ్బారావులు అబ్బూరికి మిత్రులు.
అబ్బూరి 1909 నాటికే, అయిదో ఫారం చదువుతుండగానే "జలాంజలి" అను పద్యకావ్యం రచించారు.
అబ్బూరి మైసూరు లోని సంస్కృత కళాశాలలో చేరినప్పుడు, అప్పటి విద్యాధికారి కట్టమంచి రామలింగారెడ్డి, 1915 లో అచ్చైన అబ్బూరి రచన 'మల్లికాంబ' ను చదివి మెచ్చుకొన్నాడు. అబ్బూరికి అక్కడే ఉన్న రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తో స్నేహం కుదిరింది. అబ్బూరి 1916లో వీణా శేషన్న వద్ద కొంతకాలం పాటు వీణ ను కూడ నేర్చుకొన్నాడు.
1917-19 మధ్యకాలం అబ్బూరి గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్ సన్నిధిలో శాంతినికేతన్ లో గడిపారు. అప్పుడే వీరు "ఊహాగానం", నిరాడంబరతా భావనాబలాలు" రచించారు.
అక్కడే బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను విని
ఉత్తేజితుడయ్యాడు.
కోడి రామమూర్తి ని ప్రశంసిస్తూ, "ఆంధ్రవీర కంఠీరవ" అనే పద్యాన్ని రాశారు.
పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం , గాంభీర్యమూ ప్రతిబింబిస్తాయి. నన్నయ నాటి అక్కరలకు మార్పులు తెచ్చి, కొత్త నడకలతోనూ నూతన ఛందస్సుతోనూ రచించారు.
ఊహాగానము-పూర్వప్రేమ,
,నదీసుందరికావ్యాలు రచించారు. అబ్బూరి రచించిన కథల సంకలనం మంగళసూత్రం1924లో వెలువరించారు.
1919 సంవత్సరంలో ఆంధ్ర దేశంలో జాతీయోద్యమం మమ్మురంగా సాగుతుండేది. ఆ రోజులలో రామదండును నిర్వహిస్తున్న ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో అబ్బూరి ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. "జలియన్ వాలాబాగ్" బుర్రకథ (జంగం కథ) రచించారు.దానిని అనేక చోట్ల ప్రదర్శించారు. ఇది బహుళ ప్రజాదరణ, ప్రచారం పొందింది. కానీ అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్రచురణ కూడా అందుబాటు లేదు.
1917- 18 మధ్య
ఆంధ్ర పత్రికలో "సారస్వతానుబంధం" అను శీర్షికను పెట్టించారు.
"అభినవకవితాప్రశంస" అనే వ్యాసం తో దాన్ని ప్రారంభించారు. 1923-24 సంవత్సరాల మధ్య "రసమంజరి" అను కొత్త అనుబంధం కూడా ప్రవేశపెట్టించారు.వీరు రాసిన చాటువులు, ఆశువులు చాలా ప్రసిద్ధి పొందాయి. ఇంకా ఆంగ్ల సాహిత్యంలో తరచుగా కనిపించే సానెట్స్ (గీత మాలికలు) రాశారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ), భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు మొదలైనవారు అబ్బూరిని తమ గురువుగా భావించేవారు. వారిని మేస్టారు అని సంబోధించేవారు. వారితో అనేక సాహిత్య చర్చలు జరిపేవారు.
అబ్బూరికి కార్మిక సంఘాలతోను, కమ్యూనిష్టు పార్టీ నేతలతోనూ అనుబంధం ఉండేది. ఆ సందర్భం లోనే పుచ్చపల్లి సుందరయ్య తో, ఎం.ఎన్.రాయ్ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది.
ఫాసిజానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సభకు అబ్బూరి తెలుగు వారి తరపున హాజరయ్యారు.
1936లో ప్రేమచంద్, నజ్జాద్ జహీర్, హిరేన్ ముఖర్జీ వంటి వారితో కలసి అఖిల భారత అభ్యుదయ రచయతల సంఘం స్థాపించి, వారి పత్రిక "ఇండియన్ లిటరేచర్" సంపాదకవర్గంలో ఒకరుగా ఉన్నారు.ఈయన 1939 లో ఎం.ఎన్.రాయ్, లక్ష్మణశాస్త్రి, సచ్చిదానంద వత్సాయన్ వంటి వారితో కలసి స్థాపించిన భారతీయ పునరుజ్జీవన సంఘం (ఇండియన్ రినైసెంస్ అసోసియేషన్) సాహిత్య పునర్వికాసంలో ముఖ్యపాత్ర వహించింది.ఆంధ్రదేశంలో కూడా అరసం శాఖను శ్రీశ్రీ వంటివారిని కలుపుకుని
అబ్బూరి ఏర్పాటు చేశారు.
ఆంధ్ర విశ్వకళా పరిషత్ 1926 లో స్థాపించిన తరువాత కట్టమంచి రామలింగారెడ్డి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల య్యారు.ఆయన అబ్బూరిని గ్రంథాలయంలో నియమించారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్ష్యులుగా ఉన్నప్పుడు డా.ఎం.ఓ. థామస్ ను గ్రంథాలయాధికారిగా నియమించి, అబ్బూరిని తెలుగు విభాగంలో ప్రథమ ఆంధ్రోపన్యాసకుడుగా పంపారు. అక్కడ తెలుగు భాషతో బాటు గీర్వాణం కూడా బోధించారు. థామస్ తరువాత విశ్వవిద్యాలయ గ్రంథా లయానికి గ్రంథాలయాధి కారిగా నియమింపబడి అబ్బూరి అక్కడే సుమారు 30 సంవత్సరాలు పనిచేశారు. 1932-33 మధ్య బ్రిటీష్ గ్రంథాలయ సంఘం, లండన్ వారి నుంచి (ఎఫ్.ఎల్.ఎ) "ఫెలో ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్, లండన్" అనే గౌరవ పట్టా పొందారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విద్వత్తు కలిగిన అబ్బురి గ్రంథాలయాధికారిగా ఉన్నందున అనేక మంది కవులు, పరిశోధకులు కూడా ఆయన సలహాలను పొందేవారు. విశాఖపట్నంలో సాహిత్య వాతావరణం పెరగడానికి అది దోహదం చేసింది. గ్రంథాలయాలు వాటి విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి వివిధ స్థాయిలలో శిక్షణ పొందిన సిబ్బంది అవసరాన్ని గుర్తించిన అబ్బూరి వారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ గ్రంథాలయశాస్త్రంలో సర్టిఫికేట్, డిప్లమాలలో అధ్యయనాలు ప్రవేశ పెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు డా.వి.ఎస్.కృష్ణతో వారి సాన్నిహిత్యం, ఆత్మీయత విశ్వవిద్యాలయ గ్రంథాలయం ఇంకా గ్రంథాలయశాస్త్ర అధ్యయనాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడ్డాయి. అబ్బూరి రామకృష్ణారావు తమ పదవీకాలం పూర్తయిన 2/3 సంవత్సరాల తరువాత 1960లో పదవీ విరమణ చేశారు. ఆసందర్భంలో "గ్రంధాలయాలు అనాధ శరణాలయాలు కాదు. అనాధ శరణాలయాలు మాదిరి అవి అభివృద్ధి చెందకూడదు." అని
సందేశాన్ని ఇచ్చారు. అంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు అబ్బురి రాష్ట్ర గ్రంథాలయ కమిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, పౌర గ్రంథాలయోద్యమ సమస్యలను చర్చించి అక్కడి జిల్లాగ్రంధపాలకులకు తమ సహకారాన్ని అందించారు. వారిలో చాలావరకు అతని విద్యార్థులే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడే సందర్భం లో ఆంధ్ర గ్రంథాలయ చట్టం ఏర్పాటులో కీలక పాత్ర వహించారు.
చనిపోవడానికి కొన్ని రోజుల ముందు అబ్బూరి వారు తమను కలుసుకోవాలని చూడవచ్చిన భద్రిరాజు కృష్ణమూర్తికి చివరగా ఈ పద్యం వ్రాసుకోమని వినిపించారు.
"చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునోఏమి యగునో ఎవరికెరుగరాదు,
ఎరుకలేని వారలేమేమో చెప్పగా విని తపించువారు వేనవేలు"
అబ్బూరి 30 ఏప్రిల్, 1979న మరణించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి